రోడ్డెక్కిన ఫొటోగ్రాఫర్లు…

0
105 వీక్షకులు
మీడియాకు చెందిన ఫొటోగ్రాఫర్లు నిరసనలో పాల్గొన్నప్పటి చిత్రం (File photo)

అమరావతి, జూన్ 29 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల అమలు నేపథ్యంలో ఉపాధి లేకుండా మూడు నెలలుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలన్న ఏకైక డిమాండుతో రాష్ట్రంలోని ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు తమ స్టూడియోలను, దుకాణాలను మూసివేసి శాంతియుత నిరసన చేపట్టారు. గత మూడు నెలలుగా శుభకార్యాల సహా ఎటువంటి సంస్కృతిక, కళా, వినోద, సభలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలు లేకపోవడంతో పూట గడవక ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థికంగా చితికిపోయిన తమకు ప్రభుత్వం సహాయం చేయాలని, యథావిథిగా తమ కార్యకలాపాలు కొనసాగేందుకు అనుమతించాలని డిమాండ్ చేవారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారని, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కష్టాల నేపథ్యంలో ఇప్పటికే 12 మందికి పైగా మృతి చెందారని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల రంగాన్ని కాపాడాలని, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల పనిని కూడా ప్రత్యేక వృత్తిగా గుర్తించి చేయూతనందించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఫొటో, వీడియోగ్రాఫర్లు తమ స్టూడియోలను, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. అదే విధంగా, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో బంద్ పాటించాయి. తిరుపతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో కొన్ని చోట్ల బంద్ దృశ్యాలు కనిపించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందోననే భయంతో కొంత మంది ఈ నిరసనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి తమ రంగాన్ని కూడా గుర్తించాలని వీరంతా రోడ్డెక్కడం విశేషమే. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా రంగాలలో నిష్ణాతులుగా ప్రచారంలో ఉన్న అనేక మంది తొలుత ఈ రంగం నుంచి వచ్చినవాళ్లే. అయితే, వాళ్లతో కొంత మంది మీడియాలో కొనసాగుతూనే తమ వృత్తినీ నెట్టుకువస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here