కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

పరిశోధనా మండలి, కృషివిజ్ఞాన కేంద్రాలకు తోమర్ సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రాల (కె.వి.కె.ల) 3రోజుల జోనల్ స్థాయి చర్చాగోష్టి 2020 జూలై 29నుంచి 31వరకూ జరిగింది. ఈ చర్చాగోష్టి ప్లీనరీ సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, దేశాన్ని ఎలాంటి సంక్షోభంనుంచైనా గట్టెక్కించే శక్తి సామర్థ్యాలు వ్యవసాయ, గ్రామీణ రంగాలకు ఉన్నాయని అన్నారు. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, మంచి పంటదిగుబడి రావడం, ఖరీఫ్ కాలంలో మెరుగైన స్థాయిలో పంట నాట్లు పడటం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ భారతం, వ్యవసాయ రంగం భవిష్యత్తులో కూడా ప్రముఖ పాత్ర పోషించగలవన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తంచేశారు. దేశ వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ప్రతికూల పరిస్థితులకూ లొంగబోదనడానికి గత చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని, వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ అనే నినాదం గ్రామీణ అభివృద్ధితో సంపూర్ణంగా అనుసంధానమై పోయిందని తోమర్ అన్నారు.

దేశంలో వ్యవసాయ అభివృద్ధి పర్యవేక్షణలో కృషి విజ్ఞాన కేంద్రాలకు (కె.వి.కె.లకు), వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉందని కేంద్రమంత్రి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, జీవనోపాధిగా వ్యవసాయాన్ని చేపట్టేలా యువతను ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు. వ్యవసాయ విధానాలపై చిన్న, సన్నకారు రైతులకు కె.వి.కె.లు మార్గదర్శకత్వం వహించాలని, చిన్న భూకమతాల ద్వారా కూడా గరిష్టస్థాయిలో లాభం పొందేందుకు వీలుగా దోహదపడాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధిపై ప్రాంతాలవారీగా సాగు నమూనాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.), కె.వి.కె.లు రూపకల్పన చేయాలని, అవి రైతులకు ఉపయోగపడేలా ఉండాలని మంత్రి సూచించారు.

సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కేవలం మానవుల, జంతువుల ఆరోగ్యానికే కాక, భూసారం పటిష్టతకు, స్వచ్ఛమైన పర్యావరణానికి, ఎగుమతులు పెంచి వ్యవసాయాన్ని లాభయకంగా మలిచేందుకు ఎంతో అవసరమని తోమర్ అభిప్రాయపడ్డారు. భూసారాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పులను దీటుగా నడుచుకోవడం వ్యవసాయ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లని అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గిరిజనుల జనాభా ప్రాబల్యం ఎక్కువని, రసాయనాలు, క్రిమిసంహారక మందులు అవసరంలేని సహజ వ్యవసాయాన్ని వారు ఇప్పటికే పాటిస్తున్నారని మంత్రి చెప్పారు. సహజ వ్యవసాయాన్ని మరింత మెరుగుపరుచుకునే విషయంలో వారికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సహాయపడాలన్నారు. దీనితో సేంద్రియ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించి,..పశువుల పెంపకం మరింత లాభదాయకంగా మారగలదని నరేంద్ర తోమర్ అన్నారు.

క్లస్టర్ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ దోహదపడుతుందని, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా గిట్టుబాటు ధరల్లో విక్రయించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రభుత్వం ప్రకటించిందని, స్వావలంబన లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. 10వేల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకోసం మార్గదర్శక సూత్రాలు ఇప్పటికే జారీ అయ్యాయని, పంటనాట్ల దశ నుంచి ఉత్పత్తి అయిన పంటలను విక్రయించే వరకూ ఈ సంఘాలకు ప్రభుత్వం సహాయపడుతుందని మంత్రి చెప్పారు. గరిష్ట సంఖ్యలో చిన్నకారు రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి జరగాలన్నారు.

ఐ.సి.ఎ.ఆర్. డైరెక్టర్ జనరల్, డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, వ్యవసాయ విస్తరణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎ.కె. సింగ్, ఐ.సి.ఎ.ఆర్. వ్యవసాయ విస్తరణ విభాగం జోనల్ ఇన్చార్జి డాక్టర్ వి.పి. చహల్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సిలర్లు, ఐ.సి.ఎ.ఆర్. అనుబంధ సంస్థల డైరెక్టర్లు, అవార్డు విజేతలైన రైతులు, సాగురంగం సృజనాత్మక నిపుణులు, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల కె.వి.కె.ల అధిపతులు ఈ చర్చాగోష్టిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలుపంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here