విషయం ఉన్న నాటకకర్త భమిడిపాటి!

0
18 వీక్షకులు
భమిడిపాటి కామేశ్వరరావు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): భమిడిపాటి కామేశ్వరరావు… ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త. హాస్య బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరి కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ కూడా ఒక ప్రముఖ రచయిత. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం, కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.

1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు.

త్యాగరాజు రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ త్యాగరాజు ఆత్మ విచారం రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన చంద్రగుప్తలో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు. ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగస్టు 28న పరమపదించారు. భమిడిపాటి కామేశ్వరరావు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగాలలోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి. ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.

ఈయన రాసిన వ్యాసాలన్నీ కూడా హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here