అమరావతి రాజధానిపై సర్వత్రా ఉత్కంఠ

రాజ్‌భవన్‌లో తెగని పంచాయితీ.. ఆమోదంపై గంపెడాశ

తిరస్కారమే ప్రతిపక్ష లక్ష్యం.. హిందూ మహాసభ పాచిక

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

అధికార వికేంద్రీకరణకు రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల ఆమోద ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణాన్ని సృష్టించగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని గవర్నర్ అంగీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ సర్కారును, ప్రతిపక్షాన్ని ఉక్కిరి బిక్కిరిచేస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఆరా తీయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసన మండలి తిరస్కారంతో ఈ మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేయాలని వారం రోజుల కిందటే రాష్ట్ర గవర్నరుకు ఈ దస్త్రాలను ఏపీ ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుల మనుగడపై గవర్నర్ న్యాయ నిపుణులతో తలమునకలయ్యారు.

ఇంతలో ప్రభుత్వ ప్రతిపాదనల తీరుతెన్నును విశ్లేషిస్తూ ఆచార్య జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పరిశీలనలోని ఈ బిల్లుల వ్యవహారంపై ప్రధాని కార్యాలయం దృష్టి కేంద్రీకరించింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు రద్దు ఆమోద యోగ్యమా? కాదా అనే అంశంపై గవర్నర్‌ను పీఎంవో ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లులపై కేంద్రం జోక్యం చేసుకోవటంతో రాజధాని వ్యవహారం ఉత్కంఠ భరిత వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పరిపాలన వికేంద్రీకరణతో విశాఖ నుంచి కార్యనిర్వాహక రాజధాని కొనసాగే అవకాశంఉందని వైసీపీ వర్గాలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. దసరా తరువాత విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై కేంద్రం ఆరా తీయటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చారిత్రాత్మక వికేంద్రీకరణతోనే ప్రాంతీయ అభివృద్ధి తథ్యమని, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో రాష్ట్ర సమగ్రా భివృద్ధికి ఓ నిపుణుల కమిటీని గతేడాది సెప్టెంబరు 13న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని నిపుణుల కమిటీ నిర్ణయానికి వచ్చింది.

దీంతో విశాఖలో ఎగ్జిక్యూ టివ్ క్యాపిటల్ (పరిపాలనా రాజధాని), అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ (శాసనసభ రాజధాని), కర్నూలులో న్యాయ రాజధాని (జ్యుడిషయల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుకూలంగా ముఖ్యమంత్రికి గతేడాది డిసెంబర్‌లో జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా బీసీజీతో అధ్యయనం నిర్వహించి రెండు నివేదికలపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జనవరి 20న రాష్ట్ర మంత్రివర్గం లోతుగా చర్చించి ఈ బిల్లును తొలి సారిగా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది.

జనవరి 22న శాసనమండలిలో ఈ బిల్లును టీడీపీ వ్యతిరేకించడంతో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు డోలాయమానంలో పడింది. కడకు ఈ ఏడాది జూన్ 16న మరోసారి శాసనసభలో ఈ బిల్లును మరోసారి ఆమోదించింది. దీంతో శాసనమండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలకు అవకాశం ఏర్పడింది. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును తిరస్క రించడం. గతంలో తిరస్కరించిన బిల్లుకు సవర ణలకు సూచించటమే శాసన మండలికి రెండవ ప్రత్యా మ్నాయం. రెండోసారి చర్చించిన బిల్లును 30 రోజు లోపు తిరస్కరించటం మూడో ప్రత్యామ్నాయం. ఈ పరిస్థితుల్లో 30 రోజులుగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆర్టికల్ 197 (2) (బీ) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందినట్టు పరిగణిస్తారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు రెండింటినీ గవర్నర్ ఆమోదం కోసం శాసనసభ కార్యదర్శి పి. బాలకృష్ణాచార్యులు పంపించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠభరిత చర్చకు తెరలేచింది. సర్కారు ప్రతిపాద నను ఆమోదించాలని వైసీపీ, తిరస్కరించాలని టీడీపీ, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు జరపాలని వామపక్షాలు పట్టుపట్టగా రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని బీజేపీ నాయకులు కొత్త రాగాన్ని అందుకున్నారు.

తాజాగా ప్రధాని కార్యాలయం నుంచే బిల్లులపై ఆరా తీస్తోంది. రాష్ట్ర పరి పాలనా వికేంద్రీకరణ బిల్లు రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిసినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వంలో టీడీపీ అనుచర వర్గం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని వైసీపీ వాదిస్తోంది. ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించే అవకాశం లేదని అధికార వైసీపీ గంపెడు ఆశ. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే పర్యవసనాలు ఏ దారి తీస్తాయనే అంశంపై ప్రధాన చర్చ జరుగుతోంది. విద్యా సంవత్సరం మధ్యలో రాజధాని ఉద్యోగుల తరలింపు, ఇతర సమస్యల దృష్ట్యా 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా శాశ్వత పరిపాలనా రాజధాని పనులు ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్య అధికారుల వసతి ఏర్పాట్లపై ప్రభత్వం ఇప్పటికే రెండు దఫాలుగా అనధికారకంగా క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారి సీఎం నివాస ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్; +91 94919 99678, ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)