తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు వివాదం చివరికి ఎటు దారితీస్తుందో తెలియడం లేదు. పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన ఎజెండాగా సోమవారం హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తాజా ధరల ప్రకారం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలు, ఇవే అంశాలను అథారిటీ సమావేశంలోనూ ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ షరతులు పెడుతున్న సమయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.

అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి రంగారెడ్డి, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, తెలంగాణ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా పాల్గొంటారు. వీరుకాక మరో ఏడుగురు సభ్యులుగా ఉన్న అధికారులు సమావేశానికి హాజరవుతారు. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జలశక్తి సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌గుప్తా కూడా పాల్గొంటారు. 2017-18తోపాటు 2014-15 ధరల రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సిఫార్సులపై సమావేశంలో ఆయన ప్రజంటేషన్‌ సమర్పిస్తారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కొర్రీని యథాతథంగా ఆమోదించి పంపుతారా? చర్చల తర్వాత అప్పటి అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించడం కష్టమని తేలుస్తారా? అన్నది చూడాలి.

కాగా, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాజరవుతున్న అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ మార్గదర్శకాలు, దేశంలోని ఇలాంటి 16 ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? తదితర అంశాలను ప్రస్తావించేలా సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు? పోలవరం అథారిటీ ఏ ఉద్దేశంతో ఏర్పడింది? 2013 భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం పోలవరంపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ దశలో చాలినంత నిధులివ్వకపోతే భవిష్యత్తేమిటి? తదితర అంశాలతో వాదనను వినిపించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. అయితే, కేంద్ర జలశక్తి శాఖ పెట్టుబడి అనుమతినివ్వడంలో భాగంగా 2017-18 ధరలకు అంచనాలను పోలవరం అథారిటీ ఆమోదించి పంపుతుందని, ఇది ఒక సాంకేతిక అంశమేనని ఏపీ జలవనరుల అధికారులు పేర్కొంటున్నారు. తుది నిర్ణయం కేంద్ర జలశక్తి శాఖకు వదిలేసే అవకాశమూ ఉందని అథారిటీలోని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలావుండగా, పోలవరం వివాదానికి తమను కేంద్రబిందువుగా చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ‘‘పోలవరం ప్రాజెక్టుపై ప్రధానికి రాసిన లేఖతో ముఖ్యమంత్రి జగన్‌ చులకనైపోయారు. రాష్ట్రానికి ఏం కావాలో అడిగే బదులు తెదేపాపై బురదచల్లేలా రాశారు. ఇక్కడ మమ్మల్ని 176 మాటలు అనండి. అంతేగానీ ప్రధానికి లేఖ ఎంత జాగ్రత్తగా రాయాలి? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోకుండా ఇదేం పని?’’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

చిల్లర రాజకీయాలు చేయాలనే ఆలోచన తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం వైకాపా ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. చెత్త లేఖలతో అవగాహన లేని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి తెలియకపోతే నేర్చుకోండి, నిపుణుల్ని పెట్టుకోండి.. అంతేకానీ రాష్ట్రాన్ని అంధకారం చేయొద్దని హితవు పలికారు. 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. వాటిని మేమే ప్రజల ముందుకు తీసుకెళ్తాం.. అందరూ చదివి అర్ధం చేసుకోవాలని కోరారు. ‘‘పోలవరం ప్రాజెక్టులో అంచనాలను రూ.20 వేల కోట్లు పెంచేశారని ఆ రోజు అన్నారు. ఇప్పుడు అదే ధరకు కట్టండి. తెలంగాణ సీఎంతో మాట్లాడి.. గోదావరి నీరు తెస్తామన్నారు. ఏమైంది? పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారును మార్చొద్దని కేంద్ర మంత్రి చెప్పారు. వినకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. లేదంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది’’ అని మండిపడ్డారు.

‘‘మా హయాంలో బొల్లాపల్లి జలాశయం ప్రతిపాదించాం. దాని ద్వారా బనకచర్లకు సొరంగం తవ్వితే రాయలసీమకు నీరు తీసుకెళ్లొచ్చు. అయినా అవగాహన లేకుండా చేస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘జగన్‌ వచ్చాక రివర్సు టెండరింగ్‌ పేరుతో పనులు ఆపేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిపై ఆరోపణలు చేశారో వారికే అప్పగించారు. కేంద్రంతో సమన్వయం చేసుకోలేదు. పద్ధతి లేకుండా చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆయనెందుకు మాట్లాడలేకపోతున్నారని నేను అనను. ప్రజలే అర్ధం చేసుకుంటున్నారు’’ అని చెప్పారు. ‘‘18 నెలలుగా ఒక్క రూపాయి పనులు చేయలేదు. డబ్బుల్లేవు, చేసే పరిస్థితీ లేదు. కేంద్రం డబ్బు ఇచ్చే ప్రాజెక్టును భ్రష్టు పట్టించడం ఎంతవరకు సబబు?’’ అని నిలదీశారు. ‘‘ప్రాణం కంటే మిన్నగా పోలవరం ప్రాజెక్టును చూసుకున్నా. ప్రతి సోమవారం సమీక్షించా. ప్రతి నెలా ప్రాజెక్టు వద్దకు వెళ్లొచ్చా. ఎంతో అంకితభావంతో పనిచేశాం. 70% పైగా పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రాజెక్టు భవిష్యత్తే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మేధావులు, ప్రజలు దీనిపై ఆలోచించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర జలవనరులశాఖ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 2019 ఫిబ్రవరిలో 11న జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనా రూ.55,548 కోట్లకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘పోలవరం అంచనాలపై ఎంపీలు విజయసాయిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రశ్నలకు కేంద్రం ఇదే సమాధానం ఇచ్చింది. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ.. రూ.55,548 కోట్లతో ఆమోదించామని కేంద్రం ప్రమాణపత్రం దాఖలు చేసింది. ప్రాజెక్టు భూసేకరణ వ్యయం 2010-11లో రూ.2,937 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.33,187 కోట్లకు పెరిగింది’’ అని చెప్పారు.

‘‘పోలవరం ప్రాజెక్టు యజమాని కేంద్రమే. దీనిపై మేం ఎప్పటికప్పుడు వారిని సంప్రదించాం. ఏకపక్షంగా ఎప్పుడూ చేయలేదు. అప్పటి గుత్తేదారు పనిచేయకపోతే కేంద్రంతో మాట్లాడాం. కొత్త టెండర్లు పిలిస్తే రేట్లు పెరుగుతాయని వారి అనుమతితోనే మరొకరికి ఇచ్చాం. తెదేపా హయాంలో ప్రాజెక్టు పనుల పురోగతి చూసి నితిన్‌ గడ్కరీ అభినందించారు. దేశంలోని పది రాష్ట్రాల్లో చేపట్టిన జాతీయ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరాన్ని రాష్ట్రానికి అప్పగిస్తే వారే చేసుకుంటారని నీతిఆయోగ్‌ చేసిన సూచన మేరకు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు’’ అని చంద్రబాబు వివరించారు. ‘‘కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అడిగినప్పుడల్లా దిల్లీకి లక్షల పత్రాలు పంపాం. ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా అందించాం. అంచనాలపై ఆమోదం వచ్చే వరకు అక్కణ్నుంచి రావొద్దని అధికారులను ఆదేశించాం. పుణె వెళ్లి గడ్కరీని కలిసి అంచనాలపై వివరించా. దిల్లీలో అరుణ్‌జైట్లీని కలిశా. అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రం పరిస్థితి వివరించి, పోలవరానికి నిధుల కొరత లేకుండా చేశాం. అందువల్లే పనులు శరవేగంగా జరిగాయి’’ అని చంద్రబాబు వివరించారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.