కోడెల కేసులో పోలీసుల పనితీరుపై ఎస్పీ ఆరా

8723
file photo

గుంటూరు, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా గొడవలు జరిగాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సరిపడా పోలీసు బలగాలు ఉన్నా అల్లర్లను నియంత్రించలేకపోయారు. మరికొన్ని చోట్ల పోలీసు బలగాలు తక్కువుగా ఉండటంతో అల్లర్లు తీవ్రరూపం దాల్చాయని పోలీసు ఉన్నతాధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక బృందంతో గుంటూరు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు విచారణకు ఆదేశించటం పోలీసు వర్గాలను కలవరపరుస్తోంది. పోలింగ్‌ వేళ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు మిన్నంటాయి. వాటిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ గొడవలు జరిగిన ప్రాంతాల్లో అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వాటిని కట్టడి చేయటానికి తగు చర్యలు తీసుకోలేదని ప్రాథమిక విచారణలో తేలింది.

అసలు పోలీసులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు, వారిపై ఏమైనా ఒత్తిడి వచ్చిందా అనే కోణంలో తాజాగా విచారణకు ఆదేశించటంతో కొందరు అధికారులు హడలిపోతున్నారు. పోలింగ్‌ రోజున అల్లర్లకు పాల్పడతారని గుర్తించిన వారందరిని స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చొబెట్టాలని ఎస్పీ కింది స్థాయి అధికారులకు ముందుగానే స్పష్టం చేశారు. ఈ పని పక్కాగా చేయలేదు. అల్లర్లు జరిగితే బాగా తెగబడతారని భావించిన వారిని అభ్యర్థుల సూచన మేరకు బయట తిరగనిచ్చారని ఎస్పీకి సమాచారం ఉంది. గురజాల నియోజకవర్గంలో ఓ అభ్యర్థి పలానా వ్యక్తి బయట ఉండటం వల్ల గొడవలకు ఆస్కారం ఉందని, అతన్ని స్టేషన్‌లో కూర్చొబెడితే ఆ ఊళ్లో ఎలాంటి సమస్యలు ఉండవని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఎస్పీ ఈ మేరకు అతన్ని వెంటనే ఎక్కడ ఉన్నా స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చొబెట్టాలని కిందిస్థాయి అధికారిని ఆదేశించారు. సదరు అధికారి ఆ పనిచేయలేదు.

అల్లర్లు జరిగినా చూసీచూడనట్లుగా ఉండేందుకు భారీగా నజరానాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావటంతో వాటిపై విచారణ చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల గ్రామంలో సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగినప్పుడు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బలగాలతో పాటు స్థానికంగా బందోబస్తు పోలీసులు బాగానే ఉన్నారు. అయితే ఏ ఒక్కరూ సభాపతిపై జరిగిన దాడిని అడ్డుకోలేదని, ఇక్కడా పోలీసుల వైఫల్యం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గొడవలు బాగా జరుగుతాయని తెలిసినా పర్యవేక్షణ విధుల్లో ఉన్న పోలీసులు ముందుగా ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి తగు బందోబస్తు కోరలేదని చెబుతున్నారు. జిల్లాలో పోలింగ్‌ వేళ సత్తెనపల్లి, వేమూరు, నరసరావుపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో అత్యధికంగా గొడవలు జరిగాయి.

పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా సత్తెనపల్లి, వేమూరు, పెదకూరపాడు, మాచర్ల, గురజాలలో అల్లర్లు జరిగినా వాటిని స్థానిక పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఇంత మెతక వైఖరిని అవలంబించటానికి పోలీసులు ఏమైనా ఒత్తిళ్లకు ప్రభావితమయ్యారా అనే కోణంలో విచారణ చేస్తుండటంతో కొందరిలో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అల్లర్లకు పాల్పడటం చర్చనీయాంశమవుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల వెంట భద్రతకు స్పెషల్‌ పార్టీ పోలీసులను పంపాల్సి ఉండగా ఆ పని చేయలేదు. వాటన్నింటిపై తాజాగా ఎస్పీ ఆరా తీస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు రెండు నెలలు ముందుగానే పోస్టింగ్‌లు పొందారు.

చాలా వరకు ఎస్సై, సీఐ స్థాయి అధికారులు జిల్లాలో పనిచేసిన వారే విధుల్లో ఉన్నారు. అయినా పోలింగ్‌ వేళ ఎక్కడ గొడవలు జరుగుతాయో ముందుగానే ఒక అంచనాకు వచ్చి అక్కడ ముందస్తు చర్యలు చేపట్టకుండా మౌనం వహించటం ప్రశ్నార్థకమవుతోంది. ఆయా గ్రామాల్లో దాడులు జరిగినప్పుడు విధి నిర్వహణలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? గొడవలు బాగా తీవ్రరూపం దాల్చినప్పుడు సమీప ప్రాంతాల నుంచి బలగాలు ఎంతసేపటికి చేరుకున్నాయి, వాటిని కట్టడి చేయటానికి ఏమేరకు కృషి చేశారో ప్రతిదీ వీడియో ఫుటేజీలు సేకరించి పనితీరును అంచనా వేస్తున్నారు.