మెడికల్ దుకాణదారుని నుంచి శానిటైజర్ల వివరాలు తెలుసుకుంటున్న పోలీసు అధికారి

ఏలూరు, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులు అన్ని మందుల షాపులను తనిఖీలు చేసి ఆయా దుకాణాలలో విక్రయిస్తున్న శానిటైజర్లను నిశితంగా పరిశీలించారు. ఏ ఏ బ్రాండ్ల శానిటైజర్లను విక్రయిస్తున్నారు? వాటి పేర్లు, అమ్మకం ధర, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు.

మెడికల్ దుకాణంలో విక్రయిస్తున్న శానిటైజర్ల వివరాలను నమోదుచేస్తున్న పరిశీలిస్తున్న పోలీసులు

సాధారణంగానే కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండు ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇటీవల కొన్ని జిల్లాల్లో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్లను సేవించి కొంత మంది మృత్యువాతపడ్డారు. మద్యం ధరలు పెరగడంతో కొనుగోలు స్తోమతలేక శానిటైజర్లను తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శానిటైజర్ల అమ్మకాలపై నిఘా పెట్టారు.

ఇంకోవైపు, శానిటైజర్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్న సందర్భాలూ వెలుగుచూశాయి. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో తనఖీలు నిర్వహించి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మెడికల్ దుకాణంలోని శానిటైజర్‌ను పరిశీలిస్తున్న పోలీసు

ఇతర జిల్లాలకు ఆదర్శనీయంగా ముందు నుంచీ నిలుస్తూ వస్తున్న జిల్లా ఎస్పీ నాయక్ సర్కిల్ అధికారులను అప్రమత్తం చేసి మందుల దుకాణాలు, ఇతర చోట్ల లభ్యమవుతున్న శానిటైజర్లను పరిశీలించాలని ఆదేశించారు.

మెడికల్ దుకాణదారుని నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసు అధికారి

అదే విధంగా మెడికల్ షాప్ యజమానులు, ఆయా దుకాణాలలో పనిచేసే సిబ్బంది నుండి శానిటైజర్ల నిల్వలు, వివిధ రకాల శానిటైజర్ల గురించి తెలుకొని, ఎవరెవరు శానిటైజర్లను తీసుకొని వెళ్తున్నారు? వారి పూర్తి వివరాలు సేకరించాలని, ఎవరైనా ఎక్కువసార్లు శానిటైజర్ తీసుకొని వెళితే సంబంధిత వ్యక్తుల వివరాలను సమీపంలోని పోలీసు స్టేషనుకు తెలియజేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతుల శుభ్రతకు వినియోగించాల్సిన శానిటైజర్లను తాగటం వలన జరిగే అనర్థాలను గురించి ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహిస్తూ, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తుల ఆరోగ్యానికి కలిగే దుష్పరిణామాలు గురించి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా పోలీసులు.