ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయం అంతా దేవుళ్ల చుట్టూ తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాల దాకా వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల నేతలు పోటీపడి మరీ దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలకు దిగడంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం దేవుళ్ళకు కూడా తిప్పలు తెచ్చిపెట్టింది. ఏపీలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చూసుకునే విమర్శలకు, ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలకు మధ్యలో దేవుడ్ని లాగడం దారుణమని పలువురు మండిపడుతున్నారు.

ఏది పడితే అది ఆరోపణలు చేసి తీరా దేవుళ్ళ ముందుకు వెళ్లి సత్య ప్రమాణాలు చేసే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బరితెగించి తిట్టుకుంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ తీరు మార్చుకోవాలని, ఏ రాజకీయ పార్టీ నేత లైన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆలయాలలో సత్య ప్రమాణాలకు దిగటం, భగవంతుడితో ఆటలాడటమేనని మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ఆలయాలను పనర్నిర్మిస్తామంటూ ప్రకటించడం మరోచర్చకు దారితీసింది.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన జరిగినప్పట్నుంచీ ఏపీలో ఆలయ రాజకీయం ఊపందుకుంది. ఆ తర్వాత దుర్గగుడిలో వెండి సింహాలు మిస్సింగ్ కూడా కలకలం రేపింది. ఆ తర్వాత కూడా వరుసగా విగ్రహాల ధ్వంసం ఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. అంతర్వేది విషయంలో కాస్త డిఫెన్స్ లో పడ్డ అధికార పార్టీ.. ఆ తర్వాత మాత్రం ఎదురుదాడి మొదలుపెట్టింది. ప్రతి విషయానికీ సీఎంను టార్గెట్ చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలు ధ్వంసం చేయిస్తున్నారవే వాదన తెరపైకి తెచ్చింది.

రాజమండ్రి శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. స్వామి ప్రతిమ చేతులు విరిచేశారు. విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో ఉన్న మోదకొండమ్మ అమ్మవారి పాదుకలను కొందరు ధ్వంసం చేశారు. కొన్నాళ్ల క్రితం ఇదే గుడిలో హుండీ చోరీకూడా జరిగింది. పాదాల ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఏదోచోట దాడులు జరుగుతుండటంతో అటు ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుమారం రేపింది. చారిత్రక ప్రాధాన్యమున్న రామతీర్థం ఆలయంలో ఇలా జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ప్రతిపక్షా పార్టీలన్నీ మూకమ్మడిగా దాడికి దిగాయి. అటు ప్రభుత్వం కూడా దీటుగా కౌంటరిచ్చింది. ఈ ఘటన చేసిందెవరో ఎంక్వైరీ చేస్తున్నామని, సంఘటన గురించి కూడా తెలియగానే సర్కారు స్పందించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో రామతీర్థం సందర్శించాలని చంద్రబాబు షెడ్యూల్ వేసుకోవడంతో.. రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు రామతీర్థం చేరుకునే లోగానే వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొండపైకి చేరుకుని గుడిని పరిశీలించడం, ఆయన కారుపై దాడికి దిగిన టీడీపీ శ్రేణులు.. అద్దాలు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఏపీలో సాధారణంగా మతాన్ని నమ్ముకున్న రాజకీయం చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అక్కడి ప్రజలు కూడా ఇలాంటి వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపించరని చెబుతారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా అన్ని పార్టీలూ టెంపుల్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. ఏపీ రాజకీయాల గత చరిత్ర తెలిసి కూడా నేతలు ఎందుకు గుడి రాజకీయాల పేరుతో హీట్ పెంచుతున్నారనేది హాట్ టాపిక్ అయింది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ గుళ్ల కోసం పోరాటాలు చేయలేదు. వైసీపీ కూడా గుడి పేరుతో రాజకీయం చేసిన దాఖలాల్లేవు. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఆలయాల్ని హైలైట్ చేస్తూ.. పాలిటిక్స్ చేస్తున్న తీరు విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా టెంపుల్ పాలిటిక్స్ నడిపిస్తోందనే ఆరోపణలున్నాయి.

ఏపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టుగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమౌతున్నాయి. వీలైనంత త్వరగా నిందితులెవరో పట్టుకోవాల్సిన ప్రభుత్వం, దోషుల అరెస్ట్ కు డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా.. ఈ ఘటనల్ని పట్టుకుని రాజకీయం పేరుతో మరింత సాగదీసే ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత సున్నితమైన విషయాలని తెలిసి కూడా.. పదేపదే గుళ్లు, దేవుళ్లను వివాదాల్లోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. దేవుళ్లు, గుళ్ల పేరు చెప్పి ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టడం లేటెస్ట్ ఫ్యాషన్ గా మారిపోయింది. ఏ ఆరోపణ చేసినా.. ఏదో ఒక గుడి పేరు తీసుకొస్తున్నారు నేతలు. నేతల తీరు చూస్తుంటే.. ఆలయాల్ని భ్రష్టుపట్టించేదాకా నిద్రపోయేలా లేరనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

అధికార పార్టీపై చంద్రబాబు ధ్వజం…

వైసీపీ పాలనలో దేవుళ్లకే రక్షణ కరువైందని, ప్రజలకేం ఉంటుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆయన అధికార పార్టీని తూర్పారబట్టారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న శక్తులను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని, వరుస ఘటనలపై హైకోర్డు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పట్టుబట్టారు.

ఏం అభివృద్ధి జరిగిందో సీఎం చెప్పాలి: కన్నా

రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో 127 ఘటనలు జరిగితే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోగా మంత్రులు ఎదురుదాడులు చేస్తూ తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో మతమార్పిడులు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

హిందూ మతాన్ని, ధర్మాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా దేవాలయాలపై దాడుల అంశంతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ.. ఏం అభివృద్ధి జరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

లోపం మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?

రాష్ట్రంలో గత రెండేళ్లలో ఏకంగా 100కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని జనసేన అధినేత పవన్‌క్యలాణ్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వైకాపా నేతలపై పోస్టులు వ్యవహారంలో అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల నేపథ్యంలో పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రథాల దగ్ధం, దేవాతామూర్తుల విగ్రహాల ధ్వంసం పేరిట జరుగుతున్న అరాచకంపై మాట్లాడితే ప్రతిపక్షాలు రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ నడిపిస్తున్నాయంటూ సీఎం జగన్‌ చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. సీఎం స్థానంలో ఉన్న ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడితే జనం హర్షించరని హితవు పలికారు.

‘‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీపై గెరిల్లా వార్‌ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్‌లు, మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో 2.60లక్షల మంది వాలంటీర్లను నియమించారు.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? లోపం ఎక్కడుంది? మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా? పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నాయని మీరు చెప్పడం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లు ఉంది.’’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్‌ విమర్శించారు. ఇకనైనా మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిదని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.