అంతర్జాతీయ ప్రాజెక్టులో ఏయూ ఆచార్యునికి స్థానం

148
ఆచార్య సుధీర్‌ కుమార్‌
  • గృహవినియోగ విద్యుత్‌ నియంత్రణ విధానాల అధ్యయనం

  • రిసైడ్‌ ప్రాజెక్టుకు సారధ్యం వహిస్తున్న ఆచార్య సుధీర్‌కుమార్‌

విశాఖపట్నం, నవంబర్ 15 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్‌ విభాగం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించింది. భారత్‌, యునైటెడ్‌ కింగ్‌డం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులో ఏయూ ఆర్కిటెక్చర్‌ విభాగం భాగమయ్యింది. ఈ ప్రాజెక్టుకు రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏయూతో పాటు ఐఐఐటీ హైదరాబాద్‌, జైపూర్‌ ఎన్‌ఐటీలు స్థానం పొదాయి. వీటితో పాటు ఆక్స్‌ఫర్డ్‌ బ్రూక్స్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఇంగ్లాండ్‌లు ఉన్నాయి.

రెండు సంవత్సరాల ప్రాజెక్టులో భాగంగా నగరంలోని సుమారు వెయ్యి గృహాలను వీరు అధ్యయనం చేయనున్నారు. రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ ఎనర్జీ డిమాండ్‌ రిడక్షన్‌ ఇన్‌ ఇండియా (రిసైడ్‌) ప్రాజెక్టు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆర్కిటెక్చర్‌ విభాగం ఆచార్యులు పి.సుధీర్‌కుమార్‌ సారధ్యం వహిస్తున్నారు. వేడి-తేమ కలిగిన విశాఖ నగరాన్ని అధ్యయనానికి ఎంపిక చేసుకున్నారు.

ప్రాజెక్టులో భాగంగా నగరంలోని గృహాలలో ఉష్ణోగ్రతలు, తేమ శాతం, గృహవినియోగ ఉపకరణాలు విద్యుత్‌ వినియోగం వంటివి గణిస్తారు. వీటి ఆధారంగా గృహ నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, విద్యుత్‌ వినియోగం నియంత్రణ చేయాల్సిన విధానాలను తీర్చిదిద్దుతారు. వీటిని అవసరమైన సూచనలు, నియమావళిని తీర్చిదిద్ది అందజేస్తారు. అధ్యయనానికి అవసరమైన విధంగా నగరంలో తీర ప్రాంతం నుంచి కొండవాలు, నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. దీనికి ఉష్ణోగ్రత, తేమను గణించే ప్రత్యేక పరికరాలు, డేటా లాగర్స్‌ను వినియోగిస్తారు. దీనిలో నగరవాసులు భాగమై, విలువైన సమచారాన్ని అందించాలని ఆయన కోరారు. ఆసక్తి కలిగిన వారు 9490707607 నంబరులో సంప్రదించాలని సూచించారు.