షిల్లాంగ్, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): ఈశాన్య భారతదేశంలో ఉన్న మేఘాలయ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు, గృహాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు మరింత మెరుగ్గా విద్యుత్ ను సరఫరా చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) భారతదేశం 132.8 మిలియన్ అమెరికా డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది. మేఘాలయా విద్యుత్ సరఫరా మెరుగుదల ప్రాజెక్ట్ రుణ ఒప్పందంపై భారతదేశం తరపున కేంద్ర ఆర్ధిక శాఖలోని ఆర్ధిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఫండ్ బ్యాంక్, ఎడిబి) డాక్టర్ సి.ఎస్. మోహాపాత్ర ఎడిబి తరపున బ్యాంకి భారతదేశ రెసిడెంట్ మిషన్ తాకేవో కొనిషి సంతకాలు చేశారు. సంతకాల అనంతరం మాట్లాడిన మోహాపాత్ర ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విజయవంతం చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని అన్నారు. వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సాంకేతిక, వాణిజ్య సరఫరా నష్టాలను తగ్గించడానికి వీలవుతుందని అన్నారు. ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పనిచేసే ఆధునిక సాంకేతిక వ్యవస్థ, స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేయడం, ఆన్‌లైన్‌లో బిల్లులను జారీ చేసి వాటిని వసూలు చేయడానికి కేంద్రాలను నెలకొల్పడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడతాయి’’ అని కొనిషి వివరించారు. మేఘాలయ రాష్ట్రం 100 శాతం విద్యుతీకరణ సాధించినప్పటికీ రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సరఫరా వ్యవస్థలో లోపాల వల్ల తరచు విద్యుత్ సరఫరాకి అంతరాయం కలుగుతోంది.

దీనివల్ల సరాసరి సాంకేతిక ఆర్ధిక నష్టాలు పెరుగుతున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విధ్యుత్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ పథకంలో భాగంగా కొత్తగా 23 సబ్ స్టేషన్‌లను నిర్మించి, పనిచేస్తున్న 45 సబ్ స్టేషన్‌లలో కంట్రోల్ రూమ్ పరికరాలు, రక్షణ వ్యవస్థలను నెలకొల్పుతారు. రాష్ట్రంలో ఉన్న ఆరు సర్కిళ్లలలో మూడు సర్కిళ్లలో 2,214 కిలోమీటర్ల పొడవునా డిస్ట్రిబ్యూషన్ లైన్లను నిర్మిస్తారు. స్మార్ట్ మీటర్లను అమర్చడం వల్ల 180,000 కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. రుణంతో పాటు పేదరికాన్ని తగ్గించడానికి ఎడిబిలో ఉన్న జపాన్ నిధుల నుంచి రెండు మిలియన్ అమెరికా డాలర్లను అదనంగా అందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ నిధులను మూడు గ్రామాలు, మూడు పాఠశాలల్లో మహిళలు, సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాలను అమలు చేసి, మినీ గ్రిడ్లను నెలకొల్పడానికి ఉపయోగిస్తారు.

ఈ ప్రాజెక్టు వల్ల పంపిణీ, ఆర్ధిక వ్యవహారాలపై దృష్టి సారించి పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి మేఘాలయ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అవకాశం కలుగుతుంది. 1966లో ఏర్పాటైన ఎడిబిలో ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు చెందిన 68 మంది సభ్యులు ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఎడిబి సుస్థిర సత్వర అధివృధికి దోహదపడే పథకాల అమలుకు సహాయ సహకారాలను అందిస్తున్నది.