ఎంజీఎం వైద్యులకు పీపీఈ కిట్లు

0
7 వీక్షకులు
ఎంజీఎంలో కరోనా వారియర్స్‌కు పీపీఈ కిట్లను పంపిణీ చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

వరంగల్, ఏప్రిల్ 21 (న్యూస్‌టైమ్): ఇక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలో కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు (కరోనా వారియర్స్‌కు) వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేశారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.

క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు క‌లిసిక‌ట్టుగా పాటు ప‌డ‌దామ‌ని ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపునిచ్చారు. ‘‘క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య‌ సిబ్బంది సేవలు ప్రశంసనీయం. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న వాళ్ళ‌కు అభినంద‌న‌లు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన‌, మంచి సేవ‌లు అందించాలి. వ‌రంగ‌ల్ చుట్టుముట్టు జిల్లాల‌కు ఎంజీఎం కేంద్రంగా అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ది’’ అని పేర్కొన్నారు.

‘‘ఇక్క‌డ ప‌ని చేస్తున్న వైద్యుల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా టెలీ మెడిసిన్ సేవలను కూడా అందిస్తుండ‌టం అభినందనీయం. ప్రభుత్వ సహాకారం, దాతల సహాయంతో ఎంజీఎం వైద్య‌శాల‌లో మ‌రిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు శాయశక్తులా కృషిచేస్తా. రాష్ట్రంలో రెండో రాజ‌ధానిగా ఉన్న వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న‌ది. వైద్యరంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయ‌డానికి ప్రభుత్వం ప్ర‌త్యేక కృషి చేస్తున్న‌ది. ప్ర‌జ‌ల‌కు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న వైద్యులపై దాడులు దురదృష్టం, బాధాక‌రం’’ అని అన్నారు.

‘‘ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు, వైద్యుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాలి. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు త‌ప్ప‌వు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పేదల కోసం ప్రభుత్వం ప‌ని చేస్తున్న‌ది. మే 7 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. అప్ప‌టి దాకా పకడ్బందీగా లాక్‌డౌన్‌ని అమలు చేయాలి. అప్ప‌టికి ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లాక్‌డౌన్‌ని పోడిగించినా స‌రే, ప్రజలు సహాకరించాలి’’ అని మంత్రి ఎర్రబెల్లి కోరారు.

‘‘ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్, ప్ర‌జ‌ల కోస‌మే ఇదంతా చేస్తున్నారు. ఒక‌సారి మ‌న చేతులు దాటితే, క‌రోనా వైర‌స్‌ని కంట్రోల్ చేయ‌లేం. పెద్ద పెద్ద దేశాలే క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నాయి. మిగ‌తా దేశాలు, రాష్ట్రాల‌తో పోలిస్తే, తెలంగాణ‌లో క‌రోనా కంట్రోల్‌లో ఉంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఈ కార్యక్ర‌మంలో వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంతు, న‌గ‌ర క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఎంజీఎం సూప‌రింటెండెంట్, వైద్యులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here