కరోనా నేపథ్యంలో రేషన్ డిపోటల వద్ద జాగ్రత్తలు

49
  • 29 నుండి బియ్యం… కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ

విజయనగరం, మార్చి 28 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు ఏప్రిల్ నెల కోటా కింద అర్హత మేర బియ్యం, రైస్ కార్డు ఒక్కంటికి ఒక కిలో కందిపప్పు ఉచితంగా ఈనెల 29వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని సంయుక్త కలెక్టరు ఆర్. కూర్మనాధ్ తెలిపారు. కరోనా వ్యాధి దృష్ట్యా సరుకులు పంపిణీ చేసే సమయంలో సామాజిక దూరం పాటించేటట్లు అందరు తహశీల్ధార్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు, చౌకధరల డిపో డీలర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న దృష్ట్యా చౌక ధరల దుకాణముల వద్ద ఉదయం 6 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చెయ్యాలన్నారు.

మార్చి నెలలో గల పాత రేషన్ కార్డుదారుల డికెఆర్ ఆధారంగా ఈనెలలో ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. పంపిణీ చేసే సమయంలో చౌకధరల డిపో డీలరు అమ్మకం రిజిస్టర్ మెయింటెన్ చేసి రిజిస్టరులో కార్డు నెంబరు, కార్డుదారుని పేరు, సంతకం తీసుకోవాలన్నారు. కార్డుదారుడు సంతకం చేయడానికి కార్డుదారుని సొంత పెన్ను మాత్రమే వాడాలన్నారు. ఉచిత రేషన్ తీసుకోవడానికి వచ్చిన కార్డుదారులలో నిరక్షరాస్యులు ఉన్నట్లయితే వారి వేలిముద్ర తీసుకోకుండా రేషన్ పంపిణీ చేస్తున్నట్లుగా కార్డుదారునితో ఫోటో తీసుకోవాలన్నారు. చౌకధరల డిపోవద్ద ప్రభుత్వంచే నియమించిన ప్రభుత్వ ప్రతినిధి అయిన విఆర్ఓ/విఆర్ఎ/గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి రైస్ కార్డుకి వేలిముద్ర వేయాలన్నారు. కార్డుదారుని కార్డు చేతితో తీసుకొనకుండా దూరం నుండి నెంబరు చూసి పంపిణీ చేయాలన్నారు. ప్రతి రేషన్ కార్డుదారులు లైన్‌లో నిల్చొనే నిమిత్తం రెండు మీటర్ల దూరం చొప్పున గడులను మార్కింగ్ చెయ్యాలన్నారు. ప్రతి చౌక ధరల దుకాణం వద్ద రైస్ కార్డుదారులు చేతులను శుభ్రం చేసుకొనుటకుగాను శానిటైజర్స్/సబ్బు, నీరు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రతి చౌకధరల దుకాణం వద్ద గ్రామంలోని మహిళా పోలీసును ఏర్పాటు చెయ్యాలని, రైస్ కార్డుదారులు గుంపులుగా నిలబడకుండా ఉండేవిధంగా చూడాలన్నారు. ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు పాల్గొనేటట్లు చూడాలన్నారు. చౌకదరల దుకాణముల వద్ద ఇపోస్‌‌లో రైస్ కార్డుదారులకు బదులుగా ప్రభుత్వంచే నియమించబడిన విఆర్ఓ/విఆర్ఎ/గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి రైస్ కార్డుకి వేలిముద్ర వేయాలన్నారు.