న్యూఢిల్లీ, డిసెంబర్ 12 (న్యూస్‌టైమ్): కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా పీఎం స్వానిధి లబ్ధిదారులు, వారి కుటుంబాల సామాజిక ఆర్థిక ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని పీఎం స్వానిధి పథకం అదనపు అంశంగా ఈ రోజు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి పీఎం స్వానిధి లబ్ధిదారుడు, వారి కుటుంబ సభ్యుల పూర్తి ప్రొఫైల్ తయారు చేయనున్నారు. ప్రొఫైల్డ్ డేటా ఆధారంగా వారి సమగ్ర సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం వివిధ అర్హతగల కేంద్ర పథకాల ప్రయోజనాలు వారికి అందించనున్నారు.

పీఎం స్వానిధి పథకాన్ని వీధి వ్యాపారులకు రుణాలు అందించే కోణంలో మాత్రమే చూడకూడదని, వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సంపూర్ణ అభివృద్ధి, సామాజిక-ఆర్ధిక అభ్యున్నతి కోసం ఉపయోగపడే సాధనంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఈ పథకాన్ని చేపట్టారు. మొదటి దశలో 125 నగరాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల అర్హతను ఈ ప్రొఫైల్ గుర్తిస్తుంది. అలాగే పథకాల్లో వారిని చేర్చడాన్ని సులభతరం చేస్తుంది. అంతే కాకుండా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల నిర్దిష్ట సంక్షేమ పథకాలను వారికి విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి భాగస్వామిగా ఎం/ఎస్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ)ను నియమించారు.

కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయడానికి ముందు గయా, ఇండోర్, కాచింగ్, నిజామాబాద్, రాజ్‌కోట్, వారణాసి ఆరు నగరాల్లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా దీన్ని నిర్వహిస్తుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఇబ్బంది పడ్డ వీధి విక్రేతలకు వారి జీవనోపాధిని తిరిగి ప్రారంభించడానికి వీలుగా 10,000 వరకూ మూలధనాన్ని అందించే ఉద్దేశంతో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌యుఏ) జూన్ 1, 2020 నుండి ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ అత్మనిర్భర్ నిధి(పిఎం స్వానిధి) పథకాన్ని అమలు చేస్తోంది.