సమావేశంలో మట్లాడుతున్న సోమేశ్‌కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన విజయాలను తెలుపుతూ సంక్షిప్త నివేదికలను సిద్దం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులతో జరిపిన సమావేశంలో ఆ నివేదికను ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సమర్పించాల్సివుందన్నారు.

వివిధ శాఖల అధిపతులతో సమీక్షిస్తున్న సోమేష్‌కుమార్

నీతి ఆయోగ్ ఆదేశానుసారం, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలని, ముఖ్యమంత్రి ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, విధానాలను ఆ నివేదికలలో పేర్కొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. నీతి ఆయోగ్ కోరిన విధంగా రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్న టి.ఎస్. ఐ-పాస్, కె.సి.ఆర్ కిట్స్, రైతు బంధు, రైతు భీమా పథకాలను ఆ నివేదికలలో చేర్చాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.