‘మెట్రో నియో’పై కేటీఆర్‌కు ప్రజెంటేషన్

164
మహా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్‌ను జ్ఞాపికతో సత్కరిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

హైదరాబాద్, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): మహారాష్ట్రలో పలు నగరాల్లో మెట్రో సౌకర్యాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్న ‘మహా మెట్రో సంస్ధ’ అధికారులతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నాసిక్, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో మెట్రో ఏర్పాటు కార్యక్రమాలను తామే నిర్వహిస్తున్నామని, వాటి కోసం చేపట్టిన కార్యక్రమాలు, నిర్మాణం తాలుకు వివరాలతో మహా మెట్రో అధికారులు ఒక సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో వ్యవస్థకి కొంత భిన్నంగా, అతి తక్కువ ఖర్చుతో ‘మెట్రో నియో’ పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను ఈ సమావేశంలో మంత్రికి, పురపాలక శాఖాధికారులకు అందించారు.

ప్రస్తుతం తాము సిద్ధం చేస్తున్న ఈ ప్రతిపాదనలతో ప్రాజెక్టు వ్యయం ఘననీయంగా తగ్గుతుందని, స్వల్ప కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. సాంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్‌లు ఉపయోగిస్తుండగా ప్రస్తుతం తాము ప్రతిపాదించిన మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్‌లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలివేట్ కారిడార్‌లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల పైన కూడా ఈ మెట్రో నడుస్తుందని తెలిపారు. 350 నుంచి 400 మంది ప్రయాణీకులు ఒకే సారి ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం నాసిక్‌లో తమ ప్రతిపాదనల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కోచ్ వచ్చేందుకు అవకాశం ఉందని, దీన్ని రెండు నిమిషాలకు ఒకసారి కోచ్‌లు వచ్చేలా చేసేందుకు కూడా వీలుందన్నారు. ప్రస్తుతం తాము నిర్మిస్తున్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను పట్టణ అవసరాలు, ప్రయాణీకుల రద్దీ పెరిగితే, సుదీర్ఘ కాలంలో దీన్ని సాధారణ మెట్రో మార్గంగా మార్చుకునేందుకు కూడా వీలుకలిగేలా తమ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. నాసిక్ మెట్రో కోసం తాము సిద్ధం చేసిన ప్రతిపాదనలతో పాటు వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల వివరాలను కూడా ఈ సమావేశంలో మహా మెట్రో అధికారులు వివరించారు.

సమావేశంలో పాల్గొన్న మహా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మహా మెట్రో ప్రతినిధులు

కేంద్ర ప్రభుత్వం నుంచి సూమారు 25 శాతం నిధులు ఈ ప్రాజెక్టు కోసం అందే అవకాశం ఉందని తెలిపారు. మహా మెట్రో అధికారులు అందించిన ప్రజంటేషన్ పైన పురపాలక శాఖ మంత్రి తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈమధ్య కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసినప్పుడు కేంద్రం ద్వీతీయ శ్రేణి పట్టణాలకు మెట్రో లైట్, మెట్రో నియో వంటి ప్రతిపాదనలకు సహయం అదించేందుకు సుముఖంగా ఉన్నదని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో నాసిక్‌లాగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ద్వితీయ శ్రేణి నగరాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నియో లాంటి ప్రతిపాదనలు అనుగుణంగా ఉంటాయని మంత్రి అన్నారు.

నూతనంగా హైదరాబాద్ నగరం కోసం అలోచిస్తున్న ఎలివేటేడ్ బీఆర్‌టీయస్ ప్రతిపాదనల రూపకల్పనలో మహమెట్రో సంస్థ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. దీంతోపాటు మహమెట్రో సంస్ధ పాటిస్తున్న 100 శాతం లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రెయిన్ వాటర్ హర్వేస్టింగ్ పద్దతులు, మెట్రో స్టేషన్లపైన సోలార్ విద్యుత్ ఉత్పాదన, తక్కువ భూసేకరణ ఖర్చు వంటి అంశాలను ఈ ప్రతిపాదనల్లో పరిశీలించాలన్నారు. పశ్చిమ హైదరబాద్‌లోని జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ ఏలివేటెట్, ఎలక్ర్టిక్ బీఆర్‌టీఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇదే పద్దతిలో నాసిక్‌లో ఏర్పాటు చేస్తున్న మెట్రో నియో మోడల్‌ను అధ్యయనం చేయాలని మెట్రో రైల్ సంస్ధను అదేశించారు. సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని కోరారు.

దీంతోపాటు నగరంలో ఉన్న అర్టీసీ, మెట్రో, యంయంటీయస్, భవిష్యత్తులో రానున్న మెట్రో రెండవదశ మార్గాలు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లను, అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను కలిపేందుకు ఉన్న అవకాశాలను, మార్గాలను అధ్యయనం చేయాలని, నగరంలో సమగ్ర ప్రజారవాణ బలోపేతం దిశంగా ఒక నివేదికను సిద్దం చేయాలని కోరారు. దీంతోపాటు నాగ్‌పూర్ పట్టణంలో మెట్రో, రోడ్డు మార్గాల కోసం డబుల్ డెక్కర్ ఫైఒవర్ల నిర్మాణం చేస్తున్నందున, హైదరాబాద్ నగరంలోనూ ఇలాంటి అంశాన్ని పరిశీలించాలని జీయచ్‌యంసీ అధికారులను కోరారు. దీని వలన భూసేకరణ ఖర్చు తగ్గుతుందని, భవిష్యత్తులో మెట్రో మార్గాల ఏర్పాటు సులభం అవుతుందన్నారు.

ఈ సమావేశంలో మహా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్, సంస్థ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌యంఆర్ఏల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీయస్ రెడ్డి తదితర అధికారులు పాల్గోన్నారు.