సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్

ఒంగోలు, ఏప్రిల్ 10 (న్యూస్‌టైమ్): కోవిడ్ బాధితులకు చికిత్స అందించేలా నోటిపై చేసిన ప్రైవేటు ఆస్పత్రులు సర్వసన్నద్ధమై ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. మౌలిక, వైద్యపరమైన సదుపాయాలన్నీ తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల సన్నద్ధతపై శనివారం ఉదయం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో సంబంధిత అధికారులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు.

జిల్లాలో గతేడాది ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పడకల అందుబాటు, చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో చేపట్టే కోవిడ్ నివారణ ఆపరేషన్లకు, హాస్పిటల్ మేనేజ్మెంట్‌కు మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. వైద్యం అవసరమైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించాలని, కోవిడ్ మరణాలు సాధ్యమైనంత వరకూ లేకుండా చూడాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, పీపీఈ కిట్లు లభ్యత, సీసీ టీవీలు, హెల్ప్ డెస్కుల ఏర్పాటు, శానిటేషన్, ఆహారం, మానవ వనరుల లభ్యత, అగ్ని ప్రమాద నివారణ, ఇతర సదుపాయాలపై సోమవారం సాయంత్రానికల్లా నివేదిక సమర్పించాలని నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి), కోవిడ్ నివారణ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ టి.ఎస్.చేతన్ మాట్లాడుతూ కరోనా పరీక్షలు, హోమ్ ఐసోలేషనుపై క్షేత్రస్థాయి ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశామని, వైద్యం అవసరమైన వారికి తక్షణమే చికిత్స చేసేలా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. పడకల వివరాలను ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేస్తూ ఉండాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రత్నావళి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఉషారాణి, రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజమన్నార్, ఆర్ఎంవో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎమ్ఐడీసీ ఈఈ రవి, ఓఎస్థీ చౌడేశ్వరి, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ, డీపీవో నారాయణరెడ్డి, ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డి, ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.