ఎంతో మంది కష్టం, సుమారు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి మరీ సాంధించుకున్నది విశాఖ ఉక్కు కర్మాగారం.. దీని కోసం సుమారు 32000 ఎకరాలు భూములు ఇచ్చి మరీ దక్కించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటుపరం అవుతుందంటే ఎవరికేమో గానీ, భూములను, తమ భావితరాల భవిష్యత్తునూ త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. నష్టాలు పేరు చెప్పి ప్రయివేటీకరణ చేయడానికి ‘విశాఖ ఉక్కు’కు ప్రభుత్వపరమైన ఉదాసీనత నష్టాలు తప్ప సంస్థాగతమైన నష్టాలేమీ లేవు. కేవలం విస్తరణ కోసం 22,500 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెట్టించి, తిరిగి ఇవ్వకపోవడం వల్లే తీసుకున్న అప్పుకు వడ్డీ భారం ఎక్కువైంది తప్ప ఉత్పత్తి, నిర్వహణపరమైన నష్టాలేవీ ఇప్పుడు లేవన్నది సుస్పష్టం.

ఒక్కముక్కలో చెప్పాలంటే విశాఖ ఉక్కు.. ఉత్తరాంధ్ర హక్కు. దీనిని ప్రయివేటుపరం చేస్తే ఉద్యమించే గొంతుకలు అనేకం. యావత్ తెలుగు ప్రజలు నిరసన తెలియజేసే స్థాయికి వీఎస్‌పీ పరరక్షణ పోరాటం చేరుకుంటుందని బహుశా కేంద్ర ప్రభుత్వం అంచనావేయకపోయి ఉంటుంది. వ్యవసాయ చట్టాలు తెస్తే ఉద్యమిస్తున్న రైతులను నిర్లక్ష్యం చేసినట్లే విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కూడా తొక్కేయవచ్చన్న అభిప్రాయంతో కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న పెద్దలు ఉండి ఉండవచ్చు గానీ, ఇక్కడా పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదన్నది వాస్తవాలు గ్రహిస్తే అర్ధమవుతుంది. ఫ్యాక్టరీ సాధించడం కోసం నాడు 32 మంది ప్రాణత్యాగం చేస్తే.. నేడు అవసరం అయితే, అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రాణాలను పనంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు నిర్వాసిత యువత.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 1965 వరకు ఆంధ్ర ప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక ప్రగతి జరగలేదు. పరిశ్రమల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్న తరుణంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో 5వ భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని తలచింది. అప్పుడు ఉక్కు పరిశ్రమ ‘ఏర్పాటు కమిటీ’ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నాన్ని, కర్ణాటకలోని హోస్ పేటను పరిశీలించి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించమని ప్రతిపాదించింది ఆ కమిటీ. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు. దురదృష్టవశాత్తు 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి అకస్మాత్తుగా మరణించారు, ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ అవసరాల రీత్యా ఉక్కు కర్మాగారాన్ని వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

అప్పుడు ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతానికి (గుంటూరు జిల్లాలోని తాడికొండకు) చెందిన కాంగ్రెస్ పార్టీలోని దళిత నాయకుడు తమనపల్లి అమృతరావు 1966 అక్టోబర్ 14 తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. నవంబర్ 1వ తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకంగా మారి 9 ఏళ్ల బాలుడితో సహా, 9 మంది పోలీస్ కాల్పులలో మరణించారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు పోరాడారు.. ప్రాణత్యాగాలు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమకారులపై పోలీస్ వారు జరిపిన కాల్పులలో విజయవాడలో 5 గురు, గుంటూరులో 5 గురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, తగరపు వలసలో ఒకరు, సీలేరులో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు, వరంగల్‌లో ఒకరు చనిపోయారు. రాష్ట్రం మొత్తం మీద 32 మంది పోలీస్ కాల్పులలో చనిపోయారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రవేశ ద్వారం

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉద్యమంలో పోరాడిన వారు, ప్రాణత్యాగం చేసిన వారిది నాడు విశాఖపట్నం మనదే, మన రాష్ట్రానిదే అన్న భావనతో ముందుకు సాగారు. విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ వస్తే విశాఖపట్నం వాసులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అని అప్పుడు పోరాడిన వివిధ ప్రాంతాల ప్రజలందరికీ తెలుసు. అయినా అప్పటి ప్రజల భావన ఏమిటంటే విశాఖపట్నంలోని ప్రజలు కూడా మన వాళ్ళే కదా, అక్కడి పిల్లలు, యువకులు మన పిల్లలే కదా అని రాష్ట్ర ప్రజానీకం భావించింది. ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి వలన తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధిచెందుతుంది అని ప్రజలు బలంగా నమ్మారు. అవి విశాలహృదయంతో, సమతాభావంతో నిండిన అప్పటి ప్రజల మనస్సులోని ఉదాత్తమైన ఆలోచనలు.

విశాఖ ఉక్కు సాధన కోసం దళిత నేత తమనపల్లి అమృతరావు 1966 నవంబర్ 3న తన ఆమరణ దీక్షను విరమించారు. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పుడు కేంద్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నాటి పార్లమెంటరీ ప్లీనరీలో ‘‘ఆంధ్ర ప్రదేశ్‌కు ఏదైనా తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావించటం లేదని, ఉక్కు కర్మాగారం ఏర్పాటు నిధుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.

తమనపల్లి అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష విరమించిన తరువాత కొన్ని సంవత్సరాలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చెయ్యకపోవడం, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పనులు ప్రారంభించకపోవడంతో తెన్నేటి విశ్వనాధం 1970లో ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని ఉద్యమం మళ్లీ ప్రారంభించారు. ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తుగా ఎగిసింది. 1970 ఏప్రిల్ 10న ప్రధాని ఇందిరాగాంధీ విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఆ మేరకు 1971 జనవరి 20న స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.

1977 అక్టోబర్‌లో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అందిన తర్వాత అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 1981లో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నిర్మాణం కోసం రష్యాతో ఒప్పందం, 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో అప్పట్లో నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా సాగాయి. మొత్తానికి పురిటినొప్పులన్నీ అధిగమించి 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభమయ్యింది. శంకుస్థాపన 1971లో జరిగితే 1990లో ఉక్కు ఉత్పత్తి మొదలయ్యింది.

ఈ మధ్య కాలంలో కేంద్రంలో నలుగురు ప్రధానమంత్రులు మారారు, వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో కూడా వివిధ పార్టీలు, వివిధ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, కారణం ఏదైనా ఏ ఒక్కరు కూడా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌ను ఇంకొక ప్రాంతానికి మార్చాలనుకోలేదు. కనీసం ఒక్క క్షణం కూడా ఇటువంటి ఆలోచన ఏ ప్రధానమంత్రికి గాని, ఏ ఒక్క ముఖ్యమంత్రికికి గాని రాలేదు.

స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన భూసేకరణ…

విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకోసం మొత్తం 24 వేల ఎకరాల భూమిని సేకరించారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఎకరా పొలం మార్కెట్ ధర సుమారు రూ. 2000. వారికి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇచ్చిన నష్టపరిహారం రూ. 17,500 నుండి రూ. 20,000. అనగా మార్కెట్ ధరకన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ. ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సహాయం చేశారు. భూసేకరణలో పొలం ఇచ్చిన కుటుంబాలకు ఆర్ కార్డులు ఇచ్చారు. ఆ కార్డులు ఉన్న కుటుంబాలవారికి శిక్షణ ఇచ్చి, వివిధ పోస్టులలో వేల సంఖ్యలో శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఆయా కుటుంబాల వారు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం రావటం వలన గడచిన ౩౦ సంవత్సరాలలో (జీతం రూపంలో) వారికి అందిన డబ్బు సుమారు 75 లక్షల రూపాయలు.

వాస్తవానికి ఇప్పుడు 20 ఏళ్ల అనుభవం ఉన్న టెక్నీషియన్‌కు నెల జీతం సుమారు 50 నుండి 60 వేలు ఉంది. ఇప్పటికి కూడా (2019లో కూడా) ఆర్ కార్డులు ఉన్న కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వలన విశాఖపట్నంలోని వారికి మాత్రమే లాభం జరిగిందని, పొలం ఇచ్చిన కుటుంబాలకు మాత్రమే చాలా ఎక్కువగా లాభం జరిగిందని… విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలవారు ఒక్కరైనా భావించారా? ఉద్యమంలో పోరాడిన వారి మనస్సులో ఉన్నది విశాఖపట్నం మన అందరిది, అందులో పనిచేయబోయేవారందరూ మనవాళ్లే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. ఇటువంటి ఘన చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆశ్రిత పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెట్టే కార్యక్రమానికి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ అనే కుట్రకోణానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. దీనిని రాజకీయలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఖండించి, అన్ని రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాలు ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, విశాఖ కీర్తి, ఘనత, ప్రపంచ స్థాయిలో ఇనుమడింప చేసిన విశాఖ ఉక్కును పరిశ్రమను కాపాడు కోవాలి.

అసంబద్ద వాదనలు… అసలు వాస్తవాలు!

విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బిజెపి నాయకులు, ప్రైవేటీకరణను బలపరిచే శక్తులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. వాటిలో కొన్నిటికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నమిది. అలాగే ప్రజలకు తలెత్తే ఇంకొన్ని ప్రశ్నలకు కమల దళం సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ‘వైజాగ్‌ స్టీల్‌ నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నారు’ అన్న వాదనలో అసలు నిజమే లేదన్నది వాస్తవాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అదే నిజమైతే ఎల్‌ఐసీ లాభాల్లో ఉంది కదా ఎందుకు అమ్మేస్తున్నారు? ప్రభుత్వం నుండి నయాపైసా తీసుకోకుండా డివిడెండ్లు, పన్నుల రూపంలో పెద్ద మొత్తం అందిస్తున్న సంస్థ కదా.. ఎందుకు అమ్మేస్తున్నారు? ఎల్‌ఐసీ మాత్రమే కాదు బీపీసీఎల్‌ భారీగా లాభాల్లో ఉంది కదా.. ఎందుకు అమ్మేస్తున్నారు? అంటే విశాఖ ఉక్కు అమ్మకానికి లాభ, నష్టాలతో సంబంధం లేదని అర్థమవుతుంది కదా!

చెబుతున్న ఆ నష్టాలకు కారకులెవరు?

విశాఖ స్టీల్‌ పరిశ్రమ నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వమే కదా? ప్రభుత్వం అన్ని స్టీల్‌ ప్లాంటులకూ సొంతంగా గనులు కేటాయించి విశాఖను మాత్రమే ఎందుకు విస్మరించారు. స్టీల్‌ ఉత్పత్తిలో కీలకమైన ఇనుప ఖనిజం కోసం ప్రైవేటు కంపెనీలైన టాటా, అదానీ, మిట్టల్‌ వంటి వాళ్లకు ఇచ్చి, కేంద్ర ఉక్కు గనుల శాఖ కింద పనిచేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు ఇవ్వలేదు. క్యాప్టివ్‌ మైన్స్‌ని కార్పొరేట్లకు కేటాయించి ప్రభుత్వ పరిశ్రమకు ఇవ్వకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? అంటే నష్టాలకు అసలు కారకులు పాలకులే కదా?

సొంత గనులున్నవారికి, లేని దానికి తేడా…

సొంతంగా గనులున్న అదానీ, టాటా, మిట్టల్‌ వంటి వాళ్ల కంపెనీలు టన్ను ఇనుప ఖనిజం ఉత్పత్తికి రూ.500 ఖర్చు చేస్తున్నారు. రవాణా ఛార్జీలతో కలుపుకున్నా వారికయ్యేది వెయ్యి రూపాయలే. కానీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మాత్రం రూ.3వేలు పెట్టి ఇనుప ఖనిజం కొనుక్కోవాల్సివస్తోంది. అంటే ప్రతి టన్ను ఇనుప ఖనిజానికి విశాఖ స్టీల్‌ అదనంగా రూ.2 వేలు ఖర్చు చేస్తోంది. ఒక టన్ను స్టీల్‌ ఉత్పత్తి చేయడానికి కనీసం రెండు టన్నుల ఖనిజం అవసరమని ఓ అంచనా. కాబట్టి 8 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తికి ఏటా రూ.3 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చు చేసి మార్కెట్లో నాణ్యమైన స్టీల్‌, ఆయా కంపెనీలతో పోటీ పడి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అందిస్తోంది. సొంతంగా గనులు కేటాయించకుండా సవతి తల్లి ప్రేమ చూపించిన ప్రభుత్వానిదే కదా బాధ్యత. దానికి పరిశ్రమను బలి చేస్తారా?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోకి రాదా?

వాస్తవమేమంటే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజం కోసం సొంతంగా గనులు కేటాయిస్తే అన్ని ప్రైవేటు స్టీల్‌ కర్మాగారాలకన్నా నాణ్యమైన స్టీల్‌ చౌకగా ప్రజలకు అందిస్తుంది. పరిశ్రమ నష్టాలన్నీ తీరిపోయి లాభాలను సాధిస్తుంది. అంటే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి కావాల్సినంత ప్రయోజనం దక్కే మార్గం ఉంది. ‘సొంత గనులు సమకూర్చలేకపోతే అవి ఉన్న ప్రభుత్వ సంస్థకైనా అప్పగించవచ్చు కదా?’ అని కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించేవారి ప్రశ్న. అయితే, వాస్తవం ఏమిటన్నది కూడా వారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆధ్వర్యంలో నడుపుతోంది. అదే ప్లాంట్‌ని ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్)కి అప్పగిస్తే వాళ్ల దగ్గర 200 ఏళ్లకు సరిపడా ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఇనుప ఖనిజం ఉంది. అది విశాఖ స్టీల్‌కు దక్కుతుంది. అంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులయినా ఇవ్వాలి, లేదా గనులున్న సెయిల్‌ కంపెనీకి అయినా అప్పగించాలి. ఈ రెండింటిలో ఏది చేసినా విశాఖ స్టీల్‌ నష్టాలన్నీ తీరి దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది.

దేశంలోని ఇనుప ఖనిజం ఏమవుతోంది?

దేశంలో ఇనుప ఖనిజం మోడీ ప్రభుత్వం చైనాకి ఎగుమతి చేస్తోంది. 80 శాతం ముడి సరుకు చైనాకి ఎగుమతి చేస్తున్నారు. దానివల్ల దేశంలో డిమాండ్‌ పెరిగి వైజాగ్‌స్టీల్‌ ప్లాంట్‌ వాళ్లు ఎక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజం కొనాల్సివస్తోంది. చైనావారు తమ గనుల్లో ఉన్న ఖనిజాన్ని మైనింగ్‌ కూడా చేయకుండా మనం అమ్ముతుంటే కొంటున్నారు. మన ప్రభుత్వం మాత్రం మన కంపెనీలకు ధరలు పెంచి, చైనా వారి కడుపు నింపే పని చేస్తున్నారు. అంటే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు మూల కారకులు ఎవరెవుతారు? గాలి జనార్థన్‌రెడ్డి మైనింగ్‌ మాఫియా వాళ్లు చైనాకు, ఇతర దేశాలకూ ఇనుప ఖనిజం అమ్ముకోవడానికి అనుమతిస్తారు. కానీ ప్రభుత్వ రంగ కంపెనీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించరు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరుతున్నారు… తమ ప్లాంటుకు సొంత గనులు కేటాయించండి… స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కించండి అని. కానీ చైనాకి ఎగుమతి కోసం గనులు ఇచ్చి, దేశీయ ప్రభుత్వరంగ ప్రజల సంస్థను నష్టాల్లో ముంచడమే దేశభక్తి అంటారా? ఇలాంటి అనేక వైఫల్యాల నుంచి తప్పుకునే లక్ష్యంతోనే కేంద్రం నష్టాల డ్రామాకు తెరతీసిందన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వరంగ సంస్థను కావాలని నిర్వీర్యం చేసే కుట్రను ఇప్పటికైనా ఆపితే మంచిది.