త్రిశంకు స్వర్గంలో గిరిజనుల సంక్షేమం… భూములు

గిరిజన భూములను వెబ్ ల్యాండ్‌లో పెట్టాలా? వద్దా?

స్వార్ధపరుల పాలనలో కలగా మిగిలిన ఆదివాసీ సాధికారత!

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా…

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. గిరిజనులకు అనేక హామీలతో ప్రకటనలు గుప్పిస్తుంటారు. అవి ఆచరణలో మాత్రం నోచుకోవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15వ తేదీ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి తీరాలన్న కృతనిశ్చయంతో వుంది. ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. వచ్చే ఆగస్టు 15వ తేదీకి ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఈలోపు కనీసం ఆదివాసీలకైనా పట్టాలిచ్చి భారీ ఎత్తున భూ పంపిణీ చేశామనే చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఆర్ఓఎస్ఆర్ కింద గిరిజన రైతులకు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టాలివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్ని శక్తులు ఒడ్డి విశాఖ జిల్లాలోని 11 మండలాల మన్య ప్రాంతంలో ఆడ్రైఎస్ఆర్ కింద 58 వేల ఎకరాల వ్యవసాయ భూములు, 32 వేల మంది గిరిజనులకు పైగా ఆ భూములపై హక్కు పత్రాలు ఇచ్చేందుకు శతవిధాలా కింద అధికారులు కృషి చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో భూ కమిటీ ఆమోదం కూడా తెలిపింది.

అర్హులను గుర్తించి వారి పేర్లతో టైటిల్ డీడ్లు రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ జిల్లా మన్య ప్రాంతంలో దాదాపు లక్షా 34 వేల గిరిజన కుటుంబాలున్నాయన్నది అంచనా. జనాభాపరంగా చూస్తే ఏడు లక్షల వరకు గిరిజనులుంటారు. స్వతంత్ర పోరాటంలోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో విశాఖలో మన్యం పోరాటం మరిచిపోలేనిది. అలాంటి మన్య ప్రాంతంలో ఈ రోజుకీ తాతముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నా పట్టాలు లేక ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, అనేక సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారు.

పాడేరు డివిజన్లో లక్షా 3 వేల 862 ఎకరాలు దాదాపు 2 లక్షల 56 వేల 648 ఎకరాల భూమి, నర్సీపట్నం డివిజన్లో 2 లక్షల 34 వేల 237 హెక్టార్లు దాదాపు 5 లక్షల 78 వేల 812 ఎకరాల్లో రిజర్వు ఫారెస్ట్ భూమి వుంది. ఈ భూముల్లో కొంత భూమి లేని గిరిజన రైతులు 75 సం.లకు పైగా దశాబ్దాల తరబడి తరతరాలుగా రిజర్వు ఫారెస్టుని వేలాది ఎకరాల్లో బతుకుతెరువు కోసం సాగు చేస్తున్నారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆనాడు అటవీ హక్కుల చట్టం తేవడంతో స్వర్గీయ రాజశేఖరరెడ్డి 2009 జూలై 12వ తేదీ నుంచి రెండు దఫాలుగా ఏజెన్సీ ప్రాంతంలో 31 వేల 866 గిరిజన కుటుంబాలకు 63 వేల 602 ఎకరాల అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలిచ్చారు. మరలా పది సంవత్సరాల తరువాత ఈ పట్టాల కోసం నేటి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మానవ సమాజం అడవుల నుంచే ప్రారంభమైంది. తొలి తరం నుంచి మానవుల జీవనాధారం అడవులే.

అడవులను అటవీ సంపదను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ఆదివాసీల మనుగడ మీదే అడవి ఆధారపడి వుంటుందని ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అడవికి, ఆదివాసీలకు మధ్య తల్లీబిడ్డల బంధమనేది ప్రభుత్వం గుర్తించాల్సి వుంది. అడవులే నివాసంగా అడవే ఆధారంగా ఆదివాసీలు జీవిస్తుంటే ఆ భూములపై హక్కులు లేకుండా ప్రభుత్వ సంక్షేమాలకు నోచుకోకుండా ఇప్పటివరకు ఆక్రమణదారులుగానే బతికారు. ఇప్పటికి ప్రభుత్వం హడావిడిగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా లబ్ధి పొందాల్సిన గిరిజన రైతులు పెద్దఎత్తునే వుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు 9 లక్షల 22 వేల 188 మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. అందులో ఉత్తరాంధ్రలోనే 36 శాతం 3 లక్షల 26 వేల 966 మంది వున్నారు.

అత్యధికం విశాఖ జిల్లాలో లక్షా 51 వేల 960 మంది, తరువాత స్థానంలో విజయనగరం జిల్లాలో లక్షా 3 వేల 537 మంది శ్రీకాకుళం జిల్లాలో 71 వేల 669 మంది వ్యవసాయ కూలీలుగా గిరిజనులు ఉన్నారు. వీరికి ఇవ్వడానికి విస్తారమైన భూమి మన్య ప్రాంతంలో వుంది. ప్రభుత్వం మాత్రం కుండలో కూడు కుండలోనే వుండాలి, కొడుకు మాత్రం గుండ్రాయిలా వుండాలనే చందంగా అప్పుడప్పుడు అడపాదడపా చట్టాలున్నాయి కాబట్టి నామమాత్రంగా తరతరాలుగా దశాబ్దాల కాలం సాగు చేస్తున్న భూములకు పట్టాలిస్తున్నారు. కొందరు గిరిజన రైతులు 6,7 ఎకరాలు కుటుంబం మొత్తం వ్యవసాయం చేస్తున్నా ఈ రోజు ప్రభుత్వం 30 సెంట్ల నుంచి 2 ఎకరాల లోపు మాత్రమే భూమి మీద కాగితాల్లో హక్కు కల్పిస్తూ పట్టాలివ్వడానికి పూనుకోవడం కొసమెరుపు.

ప్రభుత్వ రంగంలో వుండే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరుతో గిరిజన ప్రాంతంలోని భూములు సొంతం చేసుకుని వ్యాపార కార్యక్రమాలు సాగించి కోట్లు గడించి స్థానిక గిరిజన సంస్థలకు నామమాత్రంగా ఇస్తానన్న కోట్ల రూపాయలు నేటికీ చెల్లించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో కొయ్యూరు మండలంలోని కొన్ని పంచాయతీలు, అనంతగిరి మండలంలో కొన్ని పంచాయతీలు త్రిశంకు స్వర్గంలో వున్నాయి. అమ్మా పెట్టదు… అడుక్కోనివ్వదు అన్న చందంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకుండా ఈ రెండుమండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు సందిగ్ధంలో దశాబ్దాల కాలం వుండిపోతున్నారు. పేరుకు కొయ్యూరు మండలం, అనంతగిరి మండలం షెడ్యూల్ ఏరియాల్లోనే వున్నాయి.

కానీ ఇక్కడ భూములు మాత్రం గిరిజనేతరుల చేతుల్లోనే వుండిపోతున్నాయి. 150 చట్టం, 1/70 చట్టం, 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూములన్నీ గిరిజనులకే దక్కాలి. కానీ కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో గిరిజన ప్రాంతాలుగానే వున్నా భూములు మాత్రం గిరిజనేతరుల చేతుల్లో వుంటాయి. ఈ ప్రాంతంలో గిరిజనులు కూలీలుగానే వుంటారు. రాష్ట్ర విభజన, జిల్లా విభజన, మండలాల ఏర్పాటు సందర్భంలో గిరిజనేతర ప్రాంతాలను తీసుకువచ్చి గిరిజన షెడ్యూల్డ్ ఏరియాలో విలీనం చేయడంతో ఓ పక్క గిరిజనేతరులకు అన్యాయం జరిగినట్లయింది. ప్రత్యామ్నాయంగా గిరిజనేతరులు వున్న ఈ ప్రాంతాలను నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో విలీనం చేయాలి. లేదా ప్రత్యామ్నాయ భూములన్నా ఇవ్వాలి.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా తరతరాలుగా కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరుల బాధ వర్ణనాతీతం. ఈ గ్రామాలు గతంలో గొలుగొండ మండలంలో వుండేవి. కొయ్యూరు మండలంలో బాలారం, కంఠారం, అనంతగిరి మండలంలో భీంపోలు, గుమ్మకోట, గరుగుబిల్లి, రొంపిల్లి, ఎస్ఆర్ పురం ఈ ఐదు పంచాయతీలు గతంలో విజయనగరం జిల్లాలో పాచిపెంట, గజపతినగరంలో వుండేవి. జిల్లా మరియు మండలాల ఏర్పాటు సందర్భంలో నాన్ షెడ్యూల్డ్ ఏరియాలను తీసుకువచ్చి షెడ్యూల్డ్ ఏరియాల్లో కలిపేశారు. ఇక్కడ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటికీ వుంది.

ఇలా ప్రభుత్వం సమస్య పరిష్కరించకుండా వీరిని త్రిశంకు స్వర్గంలో పెట్టింది. ఆర్ఓఎస్ఆర్ అటవీ భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ పట్టాలిస్తున్నారు. కేవలం అటవీ హక్కుల చట్టం వచ్చింది కాబట్టి ఆరోజు వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత, కాఫీ తోటలు, పోడు భూములు వన సంరక్షణ సమితి గ్రామాల్లో కొంత పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలివ్వకపోయినా ఈ భూముల్లో గిరిజనులే సాగు చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవం పేరుతో పట్టాలివ్వడం వల్ల భూమి ఉందనేది ఓ హక్కు ఏర్పడింది. దీనివల్ల రైతు భరోసా, బ్యాంకు రుణాలు, ఇతర సబ్సిడీలు లబ్ది జరిగే అవకాశముంది.

కాకపోతే తాంబూలాలు ఇచ్చాం తన్నుకోండి అన్న చందం కాకుండా ఇచ్చిన భూములన్నింటికీ ఆన్లైన్లో సంబంధిత రైతుల పేరుమీద వెబ్ ల్యాండ్ లో నమోదు చేస్తే వీరికి ఉపయోగకరంగా వుంటుంది. ఆదివాసీ దినోత్సవం రోజున ప్రభుత్వ పెద్దలమెప్పుకోసం కాగితాల్లో పట్టాలివ్వడానికి పరిమితం కారాదు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, ఎమ్మార్వో, ఆర్ఎ, వీఆర్వోలు గతంలో గిరిజన రైతులు అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించినా ఈ పట్టాలివ్వడంలో అతీ గతీ లేదు. ఇప్పటికీ అనేకమంది లబ్ధిదారులున్నా నామమాత్రంగానే ఆదివాసీ దినోత్సవం కోసం పట్టాలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా 50 వేల మందికి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదివాసీ దినోత్సవం లక్ష్యానికి ప్రధాన భూమిక తూర్పు కనుమల్లో ఉత్తరాంధ్ర మన్యప్రాంతమే కాబోతోంది.

ఏజెన్సీ ప్రాంతంలో జోలాపుట్టు నీటి ప్రాజెక్టులు నిర్మాణం సందర్భంగా నిర్వాసితులుగా జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో రష్యాగుడ గ్రామంలో 40 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న వలస గిరిజనులకు ఇప్పటికీ అటవీ శాఖ అభ్యంతరాలు, బెదిరింపులు తప్పడం లేదు. మేకా సూరిబాబు తదనంతరం సీపీఐ అండతో తమ భూములకు పట్టాలివ్వకపోయినా తామే సాగు చేసుకునే మనోధైర్యం ఇవ్వడంతో ఇప్పటికీ భూములు గిరిజనుల చేతుల్లో వున్నాయి.

అటవీ హక్కుల చట్టం వచ్చిన తరువాత తప్పని పరిస్థితుల్లో నామమాత్రంగా ప్రభుత్వం భూములిస్తోంది. ఇప్పటికి కొంతమంది అటవీ శాఖ రిటైర్డ్ అధికారులు అడవుల్లో జంతువులు అంతరించిపోతాయి. అందుకు గిరిజనులను అడవుల నుంచి తప్పించాలన్న ప్రయత్నం జరుగుతోంది. మరోపక్క విలువైన ఖనిజ నిక్షేపాలు బాక్సైట్, లాటరైట్ ఏ క్షణానైనా తవ్వడానికి ప్రభుత్వం అలాంటి ప్రాంతాల్లో అర్హత గల గిరిజనులున్నప్పటికీ పట్టాలివ్వడం లేదు. గతంలో మండల అధికారులు ఇచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లతో బ్యాంకు రుణాలను సైతం గిరిజనులు పొంది వున్నారు. గిరిజనేతరులు ఒక తరం 25 సం.లుగా 3 తరాలు దాదాపు 75 సం.లు ఇక్కడే వున్నట్టు నిరూపించుకుంటే గిరిజనేతరులకు కూడా షెడ్యూల్ ప్రాంతంలో భూమి ఇవ్వొచ్చు అనే నిబంధన ఉన్నప్పటికీ అమలుకోసం అధికారులు డోలయామానంలో వున్నారు. గిరిజనులు 12 సం.లుగా సాగు చేస్తున్నట్టు షెడ్యూల్ ఏరియాలో వుంటే ఆ భూములపై పట్టా హక్కు పొందే అవకాశముంది.

ఏజెన్సీలో ప్రకృతి సహజసిద్ధంగా వేసవి కాలంలో ఆంధ్రా ఊటీగా చల్లగా వుండే అనంతగిరి, అరకులోయ, లంబసింగి లాంటి ప్రాంతాల్లో భూములు గిరిజనుల పేరుపై వున్నప్పటికీ అక్కడ పెరుగుతున్న పర్యాటకుల ఆదాయాన్ని కొల్లగొట్టేలా గిరిజనేతరులు, వ్యాపారస్తులు అనధికారికంగా గిరిజన భూములను నామమాత్రపు అనధికార చెల్లింపులతో అన్యాక్రాంతం చేసి హెటళ్లు, రిసార్ట్స్, భారీ నిర్మాణాలతో కోట్లు ఆర్జిస్తూ భూములు కలిగిన గిరిజనులను అక్కడే వాచ్మెన్లుగా, కూలీలుగా జరుగుతున్న తంతు ప్రభుత్వానికి పట్టడం లేదు. కాఫీ పేరుతో వేల ఎకరాల్లో సాగు చేస్తూ కోట్ల రూపాయలు కాఫీబోర్డు, గిరిజన సహకార సంస్థ లాభాలు ఆర్జిస్తూ కాఫీకి నోచుకోని గిరిజనుల భూములను గిరిజనుల సహజసిద్ధమైన అడవిని వారి మానవ వనరుల శ్రమను దోచుకుని కూలీలుగానే చూస్తున్న వైఖరి కొనసాగుతోంది. ముఖ్యంగా విలువైన మైనింగ్ రంగురాళ్లు, బాక్సైట్, లేటరైట్ అనే నిక్షేపాలున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు గతంలో ప్రయత్నించింది. ఈ రోజు రోడ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమయ్యే క్వారీలను గిరిజనుల పేరుతో గుత్తేదారులు కొండలు తవ్వేస్తున్నారు. మైనింగ్ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తోంది.

గిరిజన సహకార సంస్థ సైతం గిరిజనులకు సేవ చేస్తానని ఏర్పడి కనీసం సంతల్లో పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను గిరిజనులు విక్రయాలు జరిపి కర్రీతో వుండే పసుపు, కారం, వాడేసిన నూనెలు సర్వం నకిలీలు రాజ్యమేలుతున్నా గిరిజన సహకార సంస్థ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో సైతం అటవీ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే మొక్కలు పెంచి కోట్ల విలువ చేసే అటవీ ముడిసరుకులు కారుచౌకగా ప్రైవేటు పరిశ్రమలకు అప్పచెప్పడం రివాజుగా మారింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన్యంలో అడవిబిడ్డల సాధికారత ఎలా వున్నా ప్రభుత్వం తన శాఖల ద్వారా సమన్వయం చేసే ఉక్కు సంకల్పం కొరవడడంతో గిరిజనులు అన్ని రకాల నాటి నుంచి నేటివరకూ దొపిడీకి గురవుతూనే వున్నారు. ముఖ్యంగా గిరిజన
ప్రాంతాల్లో నక్సలైట్ల పేరుతో అమాయక గిరిజనులను పోలీసులు వేధించడం, పోలీసులకు కొరియర్లుగా వున్నారని కొన్ని సందర్భాల్లో నక్సల్స్ గిరిజనులను వేధించడం పరిపాటిగా మారింది. కూంబింగ్ పేరుతో పాడేరు వాకపల్లిలో గ్రేహౌండ్స్ దళాలు జరిపిన అత్యాచారం పుష్కర కాలం గడుస్తున్నా ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక ఇప్పటికీ డోలీమోతలే శరణ్యమవుతున్నాయి.

ముఖ్యంగా రోడ్లు, విద్యుత్ సదుపాయం కూడా వుండదు., ఎన్నికల సందర్భంలో రెండు రోజుల నడకతో పోలింగ్ స్టేషన్లకు చేరి పోలింగ్ తరువాత రెండు రోజులకు గానీ తిరిగిరాని పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఏటా వేసవి కాలంలో రక్షిత మంచినీటి కొరతతో వందలాది మంది గిరిజనులు అంతుచిక్కని విష జ్వరాలకు పిట్టల్లా రాలిపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో బతుకు అవకాశం లేక ఆదివాసీలు పట్టణాలకు వలసలు వచ్చి దుర్భరమైన బానిస బతుకులకు సిద్ధపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఈ నేపథ్యంలో ఆదివాసీల దినోత్సవం పేరుతో నామమాత్రపు పట్టాలకు పరిమితం కాకుండా గిరిజనుల శతశాతం సాధికారత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్; +91 94919 99678, ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)