ప్రతి ఇంటికీ రక్షిత నీరు సరఫరా

57

హైదరాబాద్, జనవరి 20 (న్యూస్‌టైమ్): 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందుగాల తెలంగాణ సాధించిందని ప్రశంసించింది జల్ జీవన్ మిషన్ టాస్క్‌ఫోర్స్. మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని అధికారులను అభినందించింది.

2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యులు జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. మొన్నటి 17 తారీఖు నుంచి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రాలు, ఇంటెక్‌వెల్స్‌తో పాటు గ్రామాల్లో పర్యటించింది.

ఈ సందర్భంగా భగీరథ నీటిని ఉపయోగిస్తున్న ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది. ఇవాళ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డితో సమావేశం అయింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్‌ఫోర్స్‌కు భగీరథ అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భగీరథ ప్రాజెక్టు ఫోటోలు, తాగునీరు సరాఫరా అవుతున్న ఆవాసాల్లోని ప్రస్తుత స్థితిని తెలియచేశారు.

ఆ తరువాత మాట్లాడిన గుజరాత్ వాస్మో (WASMO) ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ ఆర్‌కే సుమా… “ప్రజలందరికి సురక్షిత తాగునీరు అందించడమన్నది చాలా సింపుల్ విషయం. కాని 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఇప్పటిదాకా అది సాధ్యం కాలేదు. 2024 నాటికి ఇంటింటికి నల్లాతో తాగునీటిని అందిస్తామని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటున్నది. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ దీన్ని ఎప్పుడో సాధించింది. ఇది గర్వించాల్సిన విషయం” అన్నారు.

మిషన్ భగీరథతో ఇంటి ముందుకే సురక్షిత తాగునీటిని సరాఫరా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత భగీరథ అధికారుల మీదనే ఉందన్నారు ఆర్కే సుమా. కమ్యూనిటీ భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన తాగునీటి సరాఫరా వ్యవస్థను రూపొందించవచ్చు అన్నారు. తాగునీరు ఎంతో పవిత్రమైనదని దాన్ని వృథా చేయవద్దని ప్రజలను కోరారు.

ఆ తరువాత మాట్లాడిన వాష్ స్పెషలిస్ట్ అవినాష్ జుస్తి (AVINASH ZUTSHI, WASH SPECIAIST)… “నల్లగొండ ఫ్లోరైడ్ గ్రామాల్లో పర్యటించినం. మిషన్ భగీరథ నీటిని ఉపయోగించిన 15 రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించిందని బాధితులు చెప్పారు. సొంతంగా నిలబడడం, నడవడం చేస్తున్నామని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందనలు” అన్నారు.

ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ మోడల్ రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారుతుందన్నారు అవినాష్ జుస్తి. ఒక తాగునీటి పథకం కోసం బ్యాంకుల నుంచి రుణాలు సేకరించాలన్న ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఇది దేశంలోనే తొలిసారి అన్నారు. ఇక మిషన్ భగీరథ ప్రాజెక్టుకోసం వేసిన సరాఫరా వ్యవస్థ నాణ్యత అత్యుత్తమంగా ఉందని అవినాష్ ప్రశంసించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో తాము ఈ విషయాన్ని గమనించామన్నారు. ప్రజలు కూడా భగీరథ నీటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

చివర్లో మాట్లాడిన పబ్లిక్ హెల్త్ మాజీ చీఫ్ ఇంజనీర్ మోహన్ ఇన్నేళ్ల తరువాత నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంజనీర్లు చేసిన మేలును అక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్ పాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చక్రవర్తి, శ్రీనివాస్ రావు, కన్సల్టెంట్లు నర్సింగరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.