వరదల పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరిక

అమరావతి, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): వరదల వల్ల ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీకి ఇవ్వాలని నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వరదల పేరుతో ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్‌ సమీపంలోని రైతు బజార్‌ను మంత్రి కన్నబాబు సందర్శించారు. సబ్సిడీ ఉల్లిని వినియోగదారులకు అందజేశారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.40కే అందిస్తున్నామన్నారు. ఉల్లి ధర పెరగడంతో నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి రూ.40కే అందిస్తున్నామన్నారు. ఈ మేరకు మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఉల్లి ధరలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారన్నారని చెప్పారు. షాపుల వద్ద తప్పనిసరిగా ధరల పట్టిక పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు.

నిత్యావసరాల సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలని సూచించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్‌లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌ తొలిసారి వరద ప్రాంతాల్లో పర్యటించినట్టున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసింది కాదు అందరికీ హక్కు ఉంటుందన్నారు. అమరావతిలో పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కనబడుట లేదని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందని, వీరిద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవాచేశారు.

సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ 8 నెలలుగా కనిపించని తండ్రీ కొడుకుల్లో లోకేష్‌ ఇప్పుడొచ్చి కొత్త బిచ్చగాడి మాదిరి హడావుడి చేస్తున్నారన్నారు. ఆయనకు చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప ఏముందని మంత్రి ప్రశ్నించారు. లోకేష్‌ మొదటిసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టున్నాడని, అందుకే ఆయనకు వర్షాలకు, వరదలకూ తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ చేత చెప్పించుకునే దుస్థితిలో తమ ప్రభుత్వం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిరోజూ సమీక్షిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 20 రోజులుగా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని, అక్కడ పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని అన్నారు. దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, అక్కడా మాదే పెత్తనం అని ఎవరైనా విర్రవీగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

బీసీలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందే ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటించగానే చంద్రబాబు బీసీలకు అధ్యక్ష పదవి, పొలిట్‌ బ్యూరో సభ్యుల పదవులు ఇచ్చారన్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరిని అనుసరిస్తున్నారో అర్థమవుతోందన్నారు.