క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన వేముల

0
9 వీక్షకులు

నిజామాబాద్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీలోని గిరిజన బాలుర వసతి గృహంలో గల ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. క్వారంటైన్‌లో ఉన్నవారితో మాట్లాడారు. వారికి అందిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బాబాపూర్‌లో ఏర్పాటుచేసిన కరోనా వైరస్ క్లస్టర్‌ను కూడా ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం మూలంగా వ్యాధి తగ్గుముఖం పట్టిందని నిజామాబాద్‌లో కూడా బయట దేశం నుండి వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ మూలంగా వారి ద్వారా ఇంకొకరికి కూడా వ్యాధి సంక్రమించలేదన్నారు. మర్కజ్ యాత్రికుల ద్వారా పాజిటివ్ వచ్చిన వారిని, ప్రైమరీ కాంటాక్ట్స్, హౌమ్ క్వారంటైన్ చేయడం ద్వారా వైరస్ సామాజిక వ్యాప్తి జరగలేదన్నారు పది రోజులు మనం జాగ్రత్తలు తీసుకొని అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ వారికి సహకరించి ఎవరికి వారు ఇండ్లలో ఉండటం శ్రీరామరక్ష అన్నారు.

క్లస్టర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఫోన్ ద్వారా తెలియజేసిన నిత్యావసర సరుకులు వారి ఇళ్లకు పంపిస్తారని తెలిపారు ప్రజలు మంచిగా సహకరిస్తున్నారని ఇకముందు కూడా ఇదే విధంగా సహకరించాలని అన్నారు. అక్కడి నుండి భీంగల్ గ్రామీణ బ్యాంక్ సందర్శించారు. అక్కడ ప్రభుత్వం అందిస్తున్న పదిహేను వందల రూపాయలు తీసుకోవడానికి వచ్చిన వారికి షామియానలో కూర్చోడానికి కుర్చీలు, తాగడానికి నీరు ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి డివిజన్ స్థాయి అధికారులతో వేల్పూర్‌లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఇంకా వారం పది రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. పెర్కిట్, బాల్కొండ క్వారంటైన్ సెంటర్లను సందర్శించి క్వారంటైన్‌లో ఉన్నవారికి ధైర్యం చెప్పారు.

మీ ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామన్నారు. మీ రిపోర్ట్స్ నెగిటివ్ వస్తే ఇండ్లకు పంపిస్తామని, ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. ప్రభుత్వ క్వరంటైన్‌లో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాసులు ఎమ్మార్వోలు మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డి, సర్పంచ్ ఏనుగు శ్వేత అడిషనల్ కలెక్టర్ బి చంద్ర శేఖర్ డిసిఓ సింహాచలం, డి.ఎస్.ఒ వెంకటేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, బాల్కొండ నియోజవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతారనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. గతం కంటే రెట్టింపు దాదాపు 6,800 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుందని, నిజామాబాద్ జిల్లాలో గతంలో 310 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 547 కేంద్రాలు ఏర్పాటు చేసామనీ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో 74 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 109 కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతు క్షేమం కోసం ఆలోచిస్తాడు. మీ గ్రామాల్లోనే చివరి కిలో వరకు కొంటాం. రైతులు కూడా తమ వంతు వచ్చేవరకు ఓపిక పట్టాలి. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలా ధాన్యం కొనడంలేదు. గ్రామాల్లోకెళ్లి రైతు పండించిన పంటను కొంటున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రైతులకు కేసీఆర్ భరోసానిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటిస్తూ రైతులు సహకరించాలి. మీరు పండించిన చివరి కిలో వరకు కొంటాం ఎవరూ అధైర్య పడొద్దు’’ అని మంత్రి వేముల అభయమిచ్చారు.

మోర్తాడ్ మండల కేంద్రంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేద వారికి సరుకుల పంపిణీ చేశామని, భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటాయిన్ సెంటర్‌ని పరిశీలించిన సందర్భంగా మంత్రి చెప్పారు. నిర్మల్‌లో పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తితో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 5 గురు వ్యక్తులు విదేశాల నుండి వచ్చేటప్పుడు ఒకే విమానంలో ప్రయాణం చేయడంతో ముందు జాగ్రత్తగా వారిని ఈ క్వారంటాయిన్ సెంటర్‌లో ఉంచడం జరిగిందని, వారికి ఈ రోజు క్వారంటాయిన్ సెంటర్‌లో కలిసి భరోసా ఇచ్చామనీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here