నెల్లూరు, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో దశాబ్దాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పాఠశాల భవనాలు నిర్మించిన తరువాత, వసతులు కల్పించిన తర్వాత వాటి నిర్వహణ గురించి గతంలో ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కనీస మరమ్మతులకు నోచుకోక పాఠశాల భవనాలు పాడుబడిపోతుంటే చూస్తూ మిన్నకుండడం తప్ప, వాటిని అభివృద్ధి చేసే అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.

‘‘జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పొదలకూరు మండల పరిధిలోనే తొలి విడతలో స్కూళ్ల అభివృద్ధి కోసం 7 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేశారు. నాడు-నేడు నిధులతో పాటు ప్రత్యేకంగా నాబార్డు నిధులు కూడా అదనంగా వెచ్చించి, అభివృద్ధి పనులు చేస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి గురించి పట్టించుకోక శిథిలావస్థకు చేరాయి.’’ అని అన్నారు.

‘‘వ్యక్తిగత కార్యక్రమాలపై ఉన్న శ్రద్ద సమాజంలోని విద్యను అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డుతున్నాం అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొట్ట మొదటగా పాఠశాలలో మౌలిక వసతులపై దృష్టి పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్య విషయంలో అన్ని విధాలా సహాయ సహకారాలను జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు. గత ప్రభుత్వం క్రమబద్దీకరణ పేరుతో స్కూళ్లను మూసివేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి పాఠశాలలను అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ స్కూళ్లపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి అనే విధంగా, విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.’’ అని కాకాణి తెలిపారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలి. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు నడిపించే విధంగా చర్యలు చేపట్టాలి. ఉపాధ్యాయులపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం నిజం చేసేలా, పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందించాలి.’’ అని చెప్పారు.