అంబాలా (పంజాబ్‌), జులై 30 (న్యూస్‌టైమ్): విదేశీ పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుని స్వదేశీ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసుకుని వినియోగంలోకి తీసుకురావాలనుకున్న కేంద్ర ప్రభుత్వ కల ఎట్టకేలకు సాకారమైంది. తొలి విడత రఫేల్‌ విమానాల రాకతో రక్షణ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ఈ లోహవిహంగాలకు ఘనస్వాగతం లభించింది. ఇక విమానాలు ల్యాండ్‌ అయిన అంబాలా ప్రాంత ప్రజల ఉత్సాహానికి అంతే లేదు. ఈ విమానాల రాకకై స్థానికులు బుధవారం ఉదయం నుంచే ఎదురుతెన్నులు చూశారు. ఈ ఫైటర్‌ యుద్ధవిమానాలను భారీ సంఖ్యలో ప్రజలు జాతీయరహదారి పైకి చేరి మరీ తిలకించారు.

ప్రతి ఒక్కరూ తమ ఊరిగురించే మాట్లాడుకుంటున్నారని, రఫేల్‌ విమానాలకు తమ పట్టణం చిరునామాగా మారడం గర్వకారణమని స్థానికులు అంటున్నారు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకునేందుకు కొందరు మిఠాయిలు కూడా పంచిపెట్టారు. కాగా, రఫేల్‌ విమానాల రాక సందర్భంగా అధికారిక యంత్రాంగం పట్టణంలో కొన్ని రహదారులను మూసివేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులోకి తెచ్చింది.

అంబాలా అంబరాన హోరెత్తిన ‘రఫేల్‌’ సంబరాలు

రఫేల్ సారధులు…

ఇక, రఫేల్ ఫైటర్ల రాకతో భారత వైమానిక దళం శత్రు భయంకరంగా మారిందనే చెప్పాలి. ఇవి ఫ్రాన్స్‌ మెరిగ్నాక్‌లోని డసాల్ట్‌ వైమానిక కేంద్రం నుంచి ఈనెల 27వ తేదీన ఉదయం బయలుదేరి బుధవారం మధ్యాహ్నం భారత్‌ చేరుకున్నాయి. మార్గం మధ్యలో అబుదాబిలోని అల్‌ దఫ్రా వైమానిక స్థావరంలోనూ ఆగాయి. రఫేల్‌ యుద్ధ విమానాల ప్రయాణం రెండు దశల్లో సాగింది. భారత పైలెట్లే వీటిని నడిపారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ చేరుకోవడానికి 8500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి.

తొలి మజిలీలో భాగంగా, ఏడున్నర గంటల్లో 5800 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఫ్రెంచ్‌ వైమానిక ట్యాంకర్‌ ద్వారా గాలిలోనే ఇంధనం నింపుకున్నాయి. మరోవైపు, చెప్పిన గడువులోగా యుద్ధ విమానాలను అప్పగించినందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి, పరిశ్రమకు ఐఏఎఫ్‌ అభినందనలు తెలిపింది. ప్రయాణ సమయంలో ఫ్రెంచ్ వాయుసేన తన ఇంధన ట్యాంకర్ ద్వారా అందించిన మద్దతుతో ఇంత సుదూర ప్రయాణం గడువులోగా విజయవంతంగా ముగిసింది. 17వ స్క్వాడ్రన్‌ అయిన ‘గోల్డెన్‌ యారోస్‌’లో రఫేల్‌ యుద్ధ విమానాలు భాగమయ్యాయి. ఈ స్క్వాడ్రన్‌ను 1951లో ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నో తొలి ఘనతలు ఉన్నాయి.

1955లో, మొదటి దిగ్గజ యుద్ధవిమానం ‘డి హవిల్లాండ్ వాంపైర్’ 1957లో ‘హాకర్‌ హంటర్‌’ యుద్ధ విమానం ఈ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్‌ యుద్ధ విమానాల చేరిక వేడుకను ఆగస్టు ద్వితీయార్ధంలో అధికారికంగా నిర్వహిస్తారు. ఈ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

ఐఏఎఫ్‌కు రాహుల్ అభినందన… కేంద్రంపై సందేహాలు

రాహుల్ గాంధీ

ఇదిలావుండగా, తొలివిడత రఫేల్‌ యుద్ధవిమానాలు భారత్‌కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై భారతీయ వైమానిక దళానికి అభినందనలు తెలుపుతూనే తన సందేహాలను బయటపెట్టారు. మొదటి నుంచి రూ.59,000 కోట్ల రఫేల్‌ ఒప్పందాన్ని విమర్శస్తూ వస్తున్న ఆయన తాజాగా మూడు ప్రశ్నలను ప్రభుత్వం ముందుంచారు.

ఒక్కో రఫెల్‌ విమానం ఖరీదు రూ.526 కోట్లు కాకుండా రూ.1670 కోట్లుగా ఎందుకు మారింది? 126 విమానాలకు బదులుగా కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారు? రూ.30,000 కోట్ల కాంట్రాక్టును హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు కాకుండా, దివాలా తీసిన అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారు? అంటూ రాహుల్ ప్రశ్నించారు. గతంలో కూడా రఫేల్‌ ఒప్పందం నేపథ్యంలో ‘చౌకీదార్‌ చోర్‌ హై..’ (కాపలాదారే దొంగ) అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్‌ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. రక్షణ వ్యవహారాల్లో అనుభవం లేని అనిల్‌ అంబానీ సంస్థకు అతి కీలకమైన కాంట్రాక్టును అప్పగించారంటూ కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ వారికి లాభం కలిగించేందుకు ఒప్పందంలో ధరలను పెంచేశారంటూ అనేకమార్లు ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇవ్వడం గమనార్హం.