చక్రవర్తుల రాఘవాచారి (File photo)

సంపాదకీయాలకు ‘సీఆర్ ట్రస్ట్’ పుస్తకరూపం

హైదరాబాద్, అక్టోబర్ 10 (న్యూస్‌టైమ్): మహా మేధావి, జ్ఞానసంపన్నులు, విశాలాంధ్ర దినపత్రికకు సుదీర్ఘ కాలం సంపాదకులుగా వ్యవహరించిన చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలను వరుసగా వివిధ సంపుటాలుగా వెలువరించాలని ‘రాఘవాచారి ట్రస్ట్’ నిర్ణయించింది. ఉన్నత విలువలతో సమగ్ర జీవనాన్ని ఎలా గడపవచ్చో సమాజానికి ఆచరణలో చూపిన నిజమైన కమ్యూనిస్టు రాఘవాచారి.

‘సామవేదం’ నుంచి ‘సామ్యవాదం’ వరకూ, ‘స రి గ మ ల’ నుంచి ‘న్యూటన్ గురుత్వాకర్షణ’ సూత్రాలవరకూ, ‘జీవపరిణామ సిద్ధాంతం’ నుంచి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ వరకు సకల అంశాలపై సాధికారత కలిగిన ఓ విజ్ఞాన సర్వస్వంగా ప్రశంసలందుకున్న సంపాదక శిఖరం రాఘవాచారి. ప్రతి పరిణామాన్ని మార్క్సిస్టు దృక్పధంతో పరిశీలించి టిప్పణి చెప్పగల మేధస్సు వారికే సొంతం.

దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆయన వివిధ అంశాలపై రాసిన సంపదకీయాలను సంపుటాలుగా ప్రచురించేందుకు ట్రస్ట్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సంపుటాలు గతానికి సంబంధించి ఓ చరిత్ర… వర్తమానానికి దిక్సూచి… భవిష్యత్తుకు అమూల్య భాండాగారమని చెప్పవచ్చు. ఓ అసాధారణ మేధావి రాసిన మూడు దశాబ్దాల చరిత్రకు ప్రతిబింబాలు. పరిశోధన విద్యార్థులకు, అధ్యాపకులకు, చరిత్రను తెలుసుకోవాలనే జిజ్ఞాసపరులకు ఇవి కరదీపికల్లా ఉపయోగ పడతాయి.

‘సాహిత్యం , కళలు, సంస్కృతి’ మొదటి సంపుటిగా రాఘవాచారి ప్రధమ వర్ధంతి సందర్భంగా అక్టోబరు 28న ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అదేరోజు ఆయన వర్థంతి సభ జరుగుతుంది. ఈ సంపుటాలు వెలువరించడానికి అందరి సహాయ, సహకారాలను కోరుకుంటున్నామని సి. రాఘవాచారి ట్రస్ట్ తరఫున కె. జ్యోత్స్న ఒక ప్రకటనలో కోరారు.