నరేంద్రమోదీపై రాహుల్‌ గాంధీ ధ్వజం

2820

న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ వల్ల దేశానికి జరిగిన మేలు కంటే లక్షల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)ను కాదని, ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థకు ప్రధాని మోదీ రూ.20 వేల కోట్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రఫేల్‌ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకూ ఒక్క విమానం కూడా దేశానికి రాకుండానే ఆ మొత్తాన్ని చెల్లించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను సంధించిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అబద్ధాలు వల్లె వేస్తున్నారని మండిపడుతూ ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ నష్టాల్లో ఉందని, తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ.వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోందని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం రఫేల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌-భాజపా మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేయడం ద్వారా భాజపా ప్రభుత్వం అనిల్‌ అంబానీకి మేలు చేకూర్చేలా ప్రవర్తించిందని సోమవారం పార్లమెంటు బయట రాహుల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఇది భారత వ్యూహాత్మక సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పార్లమెంటులో కాంగ్రెస్‌ అడిగిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్‌ చెప్పిన సమాధానాల వీడియోను ఆయన ప్రదర్శించారు. మరోవైపు, యూపీఏ హాయాంలోనే అప్పటి ప్రభుత్వం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను అసలు పట్టించుకోలేదని, తాము అధికారంలోకొచ్చాకే ఆ సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని భాజపా నాయకులు చెప్తున్నారు. రాహుల్‌ చేస్తున్న ఈ ఆరోపణలను అనిల్‌ అంబానీ కూడా ఖండించారు.