రాహుల్ చిన్నపిల్లాడు కాదు; ప్రజకు మేలు చేస్తాడు: ప్రియాంక

925

అమేథీ (ఉత్తరప్రదేశ్), ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): అధికార ఎన్డీయే, భాజపా లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ మరోసారి తనదైన శైలిలో విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. మరోమారు ప్రధానమంత్రి కావాలన్న ఆశ తప్ప నరేంద్రమోదీలో ప్రజలకు ఏదో మంచి చేద్దామన్న తపన మాత్రం కనిపించడం లేదని ఎద్దేవాచేశారు. తన సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతం కంటే ఎంతో శ్రమిస్తున్న ప్రియాంక పార్టీలోని దాదాపు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియా ప్రతినిధులతోనూ ప్రియాంక కాసేపు ముచ్చటించారు.

‘‘నేను ఇక్కడ పర్యటిస్తుండడాన్ని కొంత మంది రాజకీయ కోణంలో చూస్తున్నారు. నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీకి తరుచూ వస్తున్నాను. బహుశా, ఇప్పుడు సందేహ పూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నవారికి తెలియదేమో’’ అని ప్రియాంక అన్నారు. ‘‘మీడియా ముందే వారు (ప్రత్యర్థి పార్టీల నేతలు) ఓటర్లకు డబ్బులు, చీరలు, బూట్లు పంచుతున్నారు. వారు ఎన్నికల్లో పాల్గొంటున్న తీరు సరైంది కాదు. అమేథీ ప్రజలు ఎన్నడూ ఎవరిని ఇలా ఏమీ అడగలేదు. నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలు చాలా గౌరవంగా బతుకుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ప్రజా సమస్యలేంటనే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల సమస్యలు ఉన్నాయి. వారు (ప్రత్యర్థి పార్టీల నేతలు) సమస్యలపై ప్రజల వాదనను వినిపించుకోవట్లేదు. ప్రజలు తమ సమస్యలను లేవనెత్తుతుంటే వారిని అణచివేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. జాతీయతా భావం కాదు’’ అని ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. కాగా, అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీ చేస్తున్న రాహుల్‌, సోనియా గాంధీ తరఫున ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ‌ఇటీవల అమేథీలో కేంద్రమంత్రి, భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ ప్రజలకు బూట్లు పంచారని ప్రియాంక మీడియా ముందు విమర్శలు చేశారు. ‘‘దీన్ని మనం ప్రజాస్వామ్యం అనుకోవాలా? తాయిలాలకు తలవంచే ఓటర్లు కాదు, ఇక్కడి వారు. తమకు ఎవరు మంచి చేస్తారో వారికి బాగా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ ప్రజలు మా కుటుంబం పక్షానే నిలుస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల తీర్పు ఏకపక్షంగా ఉంటుందని, అది కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా మారనుందనీ ఆమె ధీమా వ్యక్తంచేశారు. ‘‘నా సోదరుడు ఇచ్చిన ప్రతి హామీనీ చిత్తశుద్ధితో నెరవేరుస్తాడు. తనను గైడ్ చేయడానికి మా అమ్మ సోనియాతో పాటు పార్టీలోని చాలా మంది సీనియర్లు, యూపీఏలోని భాగస్వామ్య పక్షాలూ ఉన్నాయి. రాహుల్ ఏమీ చిన్నపిల్లాడు కాదు. దేశ సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకు ఉంది’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రియాంక చెప్పారు.