జలియన్‌వాలాబాగ్‌ స్మారకం వద్ద రాహుల్‌ నివాళి

3171

అమృత్‌సర్‌, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ జరిగి నేటికి సరిగ్గా వందేళ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జలియన్‌వాలాబాగ్‌ స్మారకం వద్ద నివాళులర్పించారు. నాటి నరమేధంతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. ‘స్వాతంత్ర్య విలువలను ఎప్పటికీ మర్చిపోకూడదు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పోరాటవీరులు, అమరులు, దేశ ప్రజలకు అభివాదం చేస్తున్నాం’ అని రాహుల్‌ అక్కడి సందర్శకుల పుస్తకంలో రాశారు.

సరిగ్గా వందేళ్ల క్రితం 1919 ఏప్రిల్‌ 13న పంజాబీ పండగ అయిన వైశాఖీని జరుపుకునేందుకు దాదాపు 15వేల నుంచి 20వేల మంది అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ తోటకు వచ్చారు. అలాగే ప్రజలను అణగదొక్కే కఠినమైన నాటి రౌలత్‌ చట్టానికి వ్యతిరేకించేందుకు కూడా చాలామంది కలిశారు. అప్పట్లో ఇద్దరు జాతీయ నేతలు సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూల అరెస్టు, దేశ బహిష్కారాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలిపేందుకు కూడా వారంతా తరలివచ్చారు.

దీంతో ఆగ్రహానికి గురైన కల్నల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌ వారిపై కాల్పులకు ఆదేశించారు. డయ్యర్‌ ఆదేశాలతో సైనికులు తోటలోకి ప్రవేశించి తూటాల వర్షం కురిపించారు. బయటకు వెళ్లే దారులన్నీ మూసేసి 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.