ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మేవార్ 13వ రాజు ప్రతాప్ సింగ్. ‘మహారాణా ప్రతాప్‌’గా ప్రసిద్ధి చెందిన సింగ్ మేవార్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. మహారాణా ప్రతాప్ హిందూ రాజ్‌పుత్ర కుటుంబంలో జన్మించారు. అతను ఉదయ్ సింగ్ 2, జైవంతా బాయి దంపతులకు జన్మించాడు. అతని తమ్ముళ్ళు శక్తి సింగ్, విక్రమ్ సింగ్, జగ్మల్ సింగ్. ప్రతాప్‌కు చాంద్ కన్వర్, మాన్ కన్వర్ ఇద్దరు సవతి సోదరీమణులు కూడా ఉన్నారు. అతను బిజోలియాకు చెందిన అజాబ్డే పున్వర్‌ను వివాహం చేసుకున్నాడు.

1572లో ఉదయ్ సింగ్ మరణం తరువాత, రాణి ధీర్ బాయి తన కుమారుడు జగ్మల్ రాజు కావాలని కోరుకుంది. కాని రాజ దర్బారులోని సీనియర్ సభికులు పెద్ద కొడుకైన ప్రతాప్‌నే తమ రాజుగా చేసుకోవటానికి ఇష్టపడ్డారు. వారి కోరికే నెగ్గింది. 1567-1568లో చిత్తోర్‌గఢ్ ముట్టడి తరువాత మేవార్ సారవంతమైన తూర్పు బెల్టును మొఘలుల వశమైంది. అయితే, ఆరావళి ప్రాంతాంలో అడవులతో కూడిన కొండ రాజ్యం ఇప్పటికీ రాణా నియంత్రణలోనే ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మేవార్ ద్వారా గుజరాత్‌కు స్థిరమైన మార్గం ఒకటి ఉండాలని అనుకున్నాడు; 1572లో ప్రతాప్ సింగ్ రాజు (రానా) ఐనప్పుడు, అక్బర్ ఈ ప్రాంతంలోని అనేక ఇతర రాజ్‌పుత్ర నాయకుల మాదిరిగానే రాణా కూడా తనకు సామంతుడుగా ఉండాలని కోరుతూ అనేక రాయబారాలు పంపించాడు. అక్బర్‌కు లొంగడానికి రాణా నిరాకరించడంతో, యుద్ధం అనివార్యమైంది.

హల్దీఃఘాటీ యుద్ధం మహారాణా ప్రతాప్‌కు, మాన్ సింగ్ నేతృత్వంలోని అక్బర్ సైనిక దళాలకూ మధ్య 1576 జూన్ 18న జరిగింది. ఇందులో మొఘలులు విజయం సాధించారు. మేవార్‌ సైన్యానికి గణనీయమైన ప్రాణనష్టం కలిగింది. కాని మహారాణాను పట్టుకోలేక పోయారు. యుద్ధం జరిగిన ప్రదేశం రాజస్థాన్‌లోని ఆధునిక రాజ్‌సమంద్, గోగుండా సమీపంలోని హల్దిఘాటి వద్ద ఒక ఇరుకైన కనుమ దారి. మహారాణా ప్రతాప్ సుమారు 3000 అశ్వికదళాలు, 400 మంది భిల్ విలుకాళ్ళను మోహరించాడు. మొఘలు సేనలకు అంబర్‌కు చెందిన మాన్ సింగ్ నాయకత్వం వహించాడు, అతని వెంట 5000-10,000 మంది సైనికులున్నారు. ఆరు గంటలకు పైగా జరిగిన భీకర యుద్ధం తరువాత, మహారాణా గాయపడ్డాడు. మొఘలు అతన్ని పట్టుకోలేకపోయారు. అతను కొండల్లోకి తప్పించుకోగలిగాడు.

మహారాణా ప్రతాప్‌ను లేదా ఉదయపూర్‌లోని అతని దగ్గరి కుటుంబ సభ్యులను పట్టుకోలేక పోవడంతో, హల్దిఘాటి విజయం మొఘలులకు నిరర్థకమైంది. సామ్రాజ్యం దృష్టి వాయవ్య దిశగా మారిన వెంటనే, ప్రతాప్ ససైన్యంగా అజ్ఞాతంలోంచి వచ్చి పశ్చిమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బెంగాల్, బీహార్లలో తిరుగుబాట్లు, మీర్జా హకీమ్ పంజాబ్లోకి చొచ్చుకు రావడం మొదలైన వాటి వల్ల 1579 తరువాత మేవార్‌పై మొగలుల ఒత్తిడి సడలింది. 1582లో మహారాణా ప్రతాప్, దావర్ వద్ద ఉన్న మొగలు స్థావరంపై దాడి చేసి ఆక్రమించాడు. ఇది మేవార్‌లోని మొత్తం 36 మొఘల్ సైనిక కేంద్రాల మూసివేతకు దారితీసింది. ఈ ఓటమి తరువాత, అక్బర్ మేవార్‌పై తన సైనిక చర్యలను ఆపాడు. దావర్ విజయం మహారాణా ప్రతాప్ కీర్తి కిరీటంలోఇక కలికి తురాయి. జేమ్స్ టాడ్ దీనిని మారథాన్ ఆఫ్ మేవార్‌గా అభివర్ణించాడు.

1585లో, అక్బర్ లాహోర్కు వెళ్లి, తరువాతి పన్నెండు సంవత్సరాలు అక్కడే ఉండి, వాయవ్యంలోని పరిస్థితిని పర్యవేక్షించాడు. ఈ కాలంలో మేవార్‌పై పెద్ద మొఘల్ ద్ండయాత్ర ఏదీ జరగలేదు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొన్న ప్రతాప్, కుంభాల్‌గఢ్, ఉదయపూర్, గోగుండలతో సహా పశ్చిమ మేవార్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో, అతను ఆధునిక దుంగార్‌పూర్ సమీపంలో చావంద్ అనే కొత్త రాజధానిని కూడా నిర్మించాడు. ఒక కథనం ప్రకారం, 1597 జనవరి 19న చావంద్ వద్ద వేటకు వెళ్ళినపుడు ప్రమాదంలో గాయపడి రాణా ప్రతాప్ మరణించాడు. అప్పటికి అతడికి 56 సంవత్సరాల వయస్సు. అతని తరువాత అతని పెద్ద కుమారుడు మొదటి అమర్ సింగ్ రాజయ్యాడు. ప్రఖ్యాత చారిత్రికుడు సతీష్ చంద్ర రానా ప్రతాప్ సింగ్ గురించి ఇలా అన్నాడు… ఒంటరిగా, మరే రాజపుత్ర రాజ్యాల మద్దతూ లేకుండా మొగలు సామ్రాజ్యాన్ని ధిక్కరించిన రాణా ప్రతాప్ శౌర్యం రాజపుత్ర శౌర్య ప్రతాపాలను, వారి ఆత్మ గౌరవాన్నీ, వారి విలువలనూ వివరించే గొప్ప గాథ రాణా ప్రతాప్ అవలంబించిన యుద్ధ తంత్రాన్ని ఆ తరువాత మాలిక్ అంబర్, ఛత్రపతి శివాజీలు కూడా అనుసరించారు.