న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్‌టైమ్): కేంద్ర రక్షణ‌ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ రోజు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ బెంజిమిన్ గాంట్జ్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం పురోగతిపై మంత్రులు ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ చర్యలను మరింతగా బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు. కోవిడ్ -19 మహమ్మారితో పోరాట‌పు విష‌య‌మై జ‌రుగుతున్న‌ పరిశోధన, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఇరుప‌క్షాల సహకారం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పెద్దమొత్తంలో మానవతా ప్రయోజనానికి కూడా సహాయపడుతుంది. రక్షణ తయారీలో కొత్త సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉన్నందున ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు ఇందులో ఎక్కువ భాగం పాల్గొనాలని రక్షణ‌ మంత్రి ఆహ్వానించారు. ప్రాంతీయ పరిణామాలపై ఇద్దరు మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. వీలైనంత తొంద‌ర్లో భారతదేశాన్ని సందర్శించాలంటూ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారు.