పేద ముస్లిమ్‌లకు రేషన్ కిట్లు

0
7 వీక్షకులు
సీఎం కేసీఆర్‌కు లేఖను అందిస్తున్న ఏఐఎంఐఎం ఎమ్మెల్యేయ అక్బరుద్దీన్ ఒవైసీ
  • సీఎం కేసీఆర్‌ను కోరిన అక్బరుద్దీన్

  • ఇఫ్తార్ నిధులను వినియోగించాలని లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 19 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో పేద ముస్లిం కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో ఉచిత రేషన్ వస్తు సామగ్రిని అందించాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీమ్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.

రంజాన్ సమయంలో సీఎం కేసీఆర్ మసీదులలో ఇఫ్తార్ పార్టీలను నిర్వహిస్తున్నారని, ఆ సందర్బంలో దాదాపు నాలుగు లక్షల ముస్లిం కుటుంబాలకు వస్త్రాలను సైతం పంపిణీ చేస్తున్నారని, అదే విధంగా క్రిస్మస్ సందర్భంగా కూడా పంపిణీ చేస్తున్నారని, అయితే, ఈ సంవత్సరం కరోనావైరస్ విపత్తును దృష్టిలో పెట్టుకుని అదే కుటుంబాలకు రేషన్ కిట్లను విరాళంగా ఇవ్వడానికి నిధులను ఉపయోగించాలని కోరారు. ఈ మేరకు అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ముస్లింలలో అధిక శాతం మంది ప్రభావితమయ్యారని ఓవైసీ చెప్పారు.

రంజాన్ ఉపవాస నెలలో సకాలంలో సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బియ్యం, నగదు సహాయంతో సహా రేషన్ కిట్ల పంపిణీకి ఇఫ్తార్ల కోసం కేటాయించిన నిధులను ఉపయోగించుకోవాలని ఆయన కేసీఆర్‌ను కోరారు. 4 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్క కిట్‌కు కనీసం 500 రూపాయలు ఖర్చు చేసే రేషన్ కిట్ల పంపిణీ కోసం రూ. 40 కోట్ల రూపాయల మేరకే అవుతుందని, ఇది ఇఫ్తార్ పార్టీలకు కేటాయించిన మొత్తానికి సమానం అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here