టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు

476

హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): ‘టీవీ9’ కొత్త యాజమాన్యంపై ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపణలు గుప్పించారు. కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను, వారి ఫిర్యాదులనే పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియో క్లిప్‌ను మీడియాకు విడుదల చేశారు.

టీవీ9లో చోటు చేసుకొన్న పరిణామాలను రవిప్రకాష్ ఆ వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు. 15 ఏళ్ల క్రితం టీవీ9ను నెలకొల్పిన సమయంలో శ్రీనిరాజు పెట్టుబడి పెట్టి తనకు సహకరించినట్టుగా రవిప్రకాష్ చెప్పారు. ఈ సంస్థ బాధ్యతలన్నీ కూడా తాను తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడి పెట్టిన శ్రీనిరాజు కేవలం తనకు ఆర్ధిక మద్దతుగా మాత్రతమే నిలిచారని ఆయన గుర్తు చేశారు.

అనేక న్యూస్ చానెల్స్ నష్టాల్లో ఉన్న సమయంలో కూడా ‘టీవీ9’ లాభాల బాటలో నడిచిన విషయాన్ని రవిప్రకాష్ ఉదహరించారు. 15 ఏళ్లుగా సంస్థ చైర్మన్, సీఈవోగా తాను కొనసాగినట్టుగా రవిప్రకాష్ వివరించారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్నీ ఆయన తప్పుబట్టారు. అయితే, మరోవైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా రవిప్రకాష్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిగింది. శ్రీనిరాజు సంస్థ నుండి తప్పుకోవాలని భావించిన సమయంలో కొత్త పెట్టుబడిదారుల కోసం తాను ప్రయత్నిస్తున్న సమయంలో ప్రముఖ కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి ఏబీసీఎల్ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని రవిప్రకాష్ చెప్పారు. తనతో పాటు మరో నలుగురు మిత్రులు ఈ సంస్థలో 20 శాతం చొప్పున పెట్టుబడి పెట్టనున్నారని వివరించినట్టుగా ఆయన తెలిపారు. దీంతో కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే, అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడా కృష్ణారెడ్డి తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

కానీ, తనకు చెప్పినట్టుగా కాకుండా మెజారిటీ వాటాను జూపల్లి రామేశ్వరరావు కొనుగోలు చేశారని రవిప్రకాష్ ప్రకటించారు. ఏబీసీఎల్‌‌లో మైనార్టీ వాటాదారుడినైన తనతో ఒప్పందం చేసుకొనేందుకు జూపల్లి రామేశ్వరరావు అంగీకరించలేదని రవిప్రకాష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని రవిప్రకాష్ ఆరోపించారు. సినీ నటుడు శివాజీతో తాను చేసుకొన్న ఒప్పందంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. తనపై మూడు కేసులను నమోదు చేశారని రవిప్రకాష్ ఆరోపించారు.

ఈ విషయమై పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా రవిప్రకాష్ చెప్పారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆయన మీడియాను కోరారు.