న్యూఢిల్లీ, జనవరి 3 (న్యూస్‌టైమ్): కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు చెందిన నిపుణుల కమిటీ రెండు రోజుల పాటు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుని వాటిని సిఫార్సుల రూపంలో నివేదిక తయారుచేసింది. భారత ఔషధ నియంత్రణాధికారి తుది నిర్ణయం తీసుకోవటానికి పరిగణించాల్సిందిగా కోరుతూ ఈ అంశాలను ప్రస్తావించింది.
బహుళ నియంత్రణ షరతులకు లోబడి టీకాను నియంత్రిత అత్యవసర వాడకానికి పూణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేయటంతో పాటు ప్రజాప్రయోజనాల దృష్ట్యా పుష్కలంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ క్లినికల్ ట్రయల్స్ పద్ధతిలో, మరీ ముఖ్యంగా ఇప్పుడు తాజాగా వస్తున్న రెండో తరహా కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు అనుమతి మంజూరు చేయటం, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విధివిధానాలకు అనుగుణంగా నిర్వహించటానికి అహమ్మదాబాద్‌లోని కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్‌కు అనుమతి మంజూరు చేయటం ఈ సిఫార్సుల్లో ప్రధానాంశాలు.