కోడి కత్తితో దాడి కేసులో సిట్‌కు జగన్‌ లేఖ

640

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో వాంగ్మూలాన్ని కోరుతూ సిట్‌ పంపిన నోటీసులపై వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు విశాఖలోని సిట్‌ అధికారులకు ఆయన ఓ లేఖ రాశారు. జగన్‌ రాసిన లేఖను ఆ పార్టీ జిల్లా నేతలు విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని సిట్‌ అధికారులకు అందజేశారు.

హైకోర్టులో జగన్ వేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27కు విచారణకు వస్తోందని, అందుకే సిట్ ఎదుట తాను హాజరుకాలేకపోతున్నానని జగన్‌ లేఖలో పేర్కొన్నట్టు వైకాపా విశాఖ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మళ్ల విజయ్ ప్రసాద్ వివరించారు. తమకు కూడా సిట్ నుంచి నోటీసులు వచ్చాయన్న ఆయన సిట్‌కు శుక్రవారం తాము సమాధానం ఇస్తామని తెలిపారు. మరోవైపు, తన పాదయాత్రను అడ్డుకునేందుకు 108 వాహనాన్ని, ఆవును సీఎం చంద్రబాబు పంపిచారంటూ వేరు వేరు సందర్భాల్లో వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో దీటుగా స్పందించారు.

జగన్ తొలుత 108 డ్రామా, ఆ తర్వాత కోడికత్తి డ్రామా కొనసాగించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా ఆవు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆడిన ఏ డ్రామా రక్తి కట్టలేదన్నారు. ఒకవేళ చెత్త నటనకు అవార్డులంటూ ఉంటే జగనే అన్నీ కైవసం చేసుకుని ఉండేవారని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ వివిధ సందర్భాల్లో చేసిన ఆరోపణల వీడియోను లోకేశ్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.