గుంటూరు జిల్లాలో చెలరేగిన ప్రతీకార దాడులు

711

తెలుగుదేశంతో తలపడిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు

గుంటూరు, ఏప్రిల్ 12 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలకు ప్రతీకారం అన్నట్లు శుక్రవారం అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఇర్లపాడులో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ వర్గం వారిపై దాడులకు పాల్పడ్డారన్న కారణంతో తెదేపా వర్గీయులపై వైకాపా కార్యకర్తలు శుక్రవారం ఉదయం ప్రతీకార దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో 9 మంది తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గ్రామంలో మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో నలుగురు వైకాపా వర్గీయులకు గాయాలయ్యాయి. ఓ పోలింగ్‌ కేంద్రంలో అదనంగా 50 ఓట్లు పోల్‌ కావడంపై ఈ వివాదం కొనసాగుతోంది. మరోవైపు, గుంటూరు జిల్లాలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడిన విషయం తెలిసింది. నరసరావుపేట తెదేపా అభ్యర్ధిపైనా జగన్ మద్దతుదారులు దాడులకు దిగారు. ఇదిలావుండగా, పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన తనపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్లలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్లినట్టు శుక్రవారం ఆయన చెప్పారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడికి పాల్పడ్డారని, పోలింగ్‌ అధికారులు తలుపులు వేస్తే వాటినీ పగులగొట్టారని చెప్పారు. వైకాపా నాయకులు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించానన్నారు. ఈ విధంగా దాడులు చేయడం ఇన్నేళ్లలో మొదటిసారి చూస్తున్నట్టు చెప్పారు. సభాపతిగా ఉన్న తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని సీఎం చంద్రబాబు ముందునుంచే చెబుతున్నారని ఈ సందర్భంగా కోడెల గుర్తు చేశారు.