న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నిర్వహిస్తున్న జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల నిర్వహణ తీరును గురించి గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య/ఆయుష్ మంత్రుల వెబినార్‌కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి శ్రీపాద ఎస్సో నాయక్ అధ్యక్షత వహించి సమీక్షించారు.

ఈ సందర్బంగా రాష్ట్రాలు తమ కార్యాచరణ ప్రణాళికలను, వినియోగ ధ్రువీకరణ పత్రాలను, భౌతిక, ఆర్ధిక నివేదికలు, లబ్ధిదారులకు నగదు బదిలీకి సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో సమర్పించడానికి జాతీయ ఆయుష్ మిషన్ కోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను నాయక్ ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల ప్రభుత్వ విధానం ప్రకారం పనుల్లో పారదర్శకత, ఐటీ వినియోగంలో సౌలభ్యం కలుగుతుంది. ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలతో పాటు మొత్తం 4 ప్రచురణలను మంత్రి విడుదల చేశారు. తమ తమ రాష్ట్రాలలో ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల నిర్వహణ, ప్రగతి, జాతీయ ఆయుష్ మిషన్ గురించి వెబినార్‌లో 15 మంది ఆరోగ్య/ఆయుష్ మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల నిర్వహణకు, జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆమోదించిన కార్యకలాపాలలో గణనీయమైన ప్రగతిని సాధించడానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రులు తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఆపన్నులకు ఆయుష్ ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తేవడానికి వీలుగా ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను వీలయినంత త్వరగా ఏర్పాటు చేసి నిర్వహించడంపైన దృష్టిని కేంద్రీకరించాలని వీడియో కాన్ఫరెన్సు ద్వారా శ్రీపాద నాయక్ రాష్ట్రాల మంత్రులను కోరారు. ఆరోగ్య సేవల ప్రయోజనాలు సామాన్యులకు అందేవిధంగా జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల పరిధిలో మంజూరైన పనులను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య/ఆయుష్ మంత్రులతో పాటు ఆరోగ్య/ఆయుష్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు/సెక్రెటరీలు, కమిషనర్లు/డైరెక్టర్లు వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా మాట్లాడుతూ ప్రజారోగ్యంలో ఆయుష్ వ్యవస్థ సమర్ధతను పాదుకొల్పడానికి ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల ఏర్పాటు ఒక మంచి అవకాశమని అన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధులను కాలపరిమితి మించకుండా వినియోగించాలని ఆయన నొక్కి చెప్పారు. ఆయుష్ శాఖ జాయింట్ సెక్రెటరీ రోషన్ జగ్గీ జాతీయ ఆయుష్ మిషన్, ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాల గురించి వివరిస్తూ అన్ని రాష్ట్రాలు తమకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమయానికి ఆయుష్ ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి కృషిచేయాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here