ముంబయి, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను మరోమారు సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో తాజా రుణరేటు 6.95 శాతంగా ఉంది.

పెంచిన రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌బీఐ మార్చి 1న ఇంటి రుణాలపై వడ్డీరేట్లను అత్యంత కనిష్ఠంగా 6.70 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజుపైనా వంద శాతం రాయితీ కల్పించింది. అయితే, ఆ పరిమిత ఆఫర్‌ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు గతంలోనే పేర్కొంది.

మరోవైపు గృహరుణాలపై 0.40 శాతం ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ కూడా ఉండనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. రుణాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉండనుంది. ఇదిలా ఉండగా ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో మిగతా బ్యాంకులు కూడా ఇదే నిర్ణయాన్ని అనుసరించే అవకాశాలున్నాయి.