చిన్నాన్నే రోల్‌ మోడల్‌!

468
  • ప్రతీ పరిశోధన సమాజానికే

  • ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య భైరాగిరెడ్డి

విశాఖపట్నం, జులై 9 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆచార్య టి.భైరాగిరెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, కొణిజేడు. తండ్రి కోటి రెడ్డి వ్యవసాయ దారుడు, తల్లి అచ్చమ్మ గృహిణి. బాల్యం, పాఠశాల విద్యను తన స్వగ్రామంలోనే ఆయన పూర్తిచేశారు. అనంతరం ఇంటర్‌, డిగ్రీ విద్యను ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో పూర్తిచేశారు.

ఎమ్మెస్సీ కోర్సును ఆంధ్రశిశ్వవిద్యాలయం నుంచి 1980-82 సంవత్సరంలో బోటనీ విభాగం నుంచి పూర్తిచేశారు. ఆచార్య భైరాగి రెడ్డికి భార్య కన్యాకుమారి, కుమారులు రాజగోపాల్‌ రెడ్డి, సాయి సిద్ధార్థ రెడ్డిలు ఉన్నారు. కుమారులిద్దరూ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. రాజగోపాల్‌ సివిల్స్‌ పరీక్షలకు సిద్దమవుతుందడగా, సాయి సిద్ధార్ధ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

‘‘విద్యార్థిదశనుంచే చిన్నాన్నలు ఐఏఎస్‌ అధికారి టి.వెంకా రెడ్డి, టి.గోపాలరెడ్డి ప్రభావం నాపై అధికంగా ఉంది. వెంకారెడ్డి కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓఎస్‌డిగా సేవలందించారు. మరో చిన్నాన్న గోపాలరెడ్డి అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా చేశారు. వీరు ప్రభుత్వ రంగంలో పనిచేయడంతో వారి ప్రభావం నామీద పడింది. వారి బాటలోనే పబ్లిక్‌ సర్వెంట్‌గా మారాలనే బలమైన కోరిక నాలో కలిగింది. దీనితో పీజీ చేసిన తరువాత రెండు సంవత్సరాలు సివిల్స్‌కు సిద్దమవడానికి వెళ్లాను. ఒక విధంగా చెప్పాలంటే మా చిన్నాన్నలు నాకు గాడ్‌ ఫాదర్‌లాంటి వారు’’ అని పేర్కొన్నారు.

‘‘1984 సంవత్సరంలో ఆచార్య సి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ప్లాంట్‌, యానిమల్‌ ఇంటరాక్షన్‌పై పరిశోధన ప్రారంభించాను. 1988లో డాక్టరేట్‌, బంగారు పతకం అందుకున్నారు. మా రోజుల్లో బయాలాజికల్‌ సైన్సెస్‌ కోర్సులన్నింటికీ కలిపి ఒకటే గోల్డ్‌ మెడల్‌ ఉండేది. ఇది లభించడం ఎంతో కష్టం. నా గురువు సుబ్బారెడ్డి అందించిన సహకారం, సూచనలతో జరిపిన పరిశోధనకు డాక్టకేట్‌తో పాటు బంగారు పతకం లభించింది’’ అని రెడ్డి తెలిపారు.

‘‘నా పరిశోధన మార్గదర్శిగా నిలచిన ఆచార్య సుబ్బారెడ్డి ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఆయన నుంచి శాస్త్ర జ్ఞానాన్నే కాకుండా వ్యక్తిగత క్రమశిక్షణను నేను అలవరచుకున్నాను. ఉదయం 8 గంటలకు విభాగానికి వస్తే మద్యాహ్నం ఒక గంట భోజన విరామం లభించేది. అనంతరం పని ప్రారంభిస్తే రాత్రి మా గురువు ఇంటికి వెళ్లేవరకు అక్కడే ఉండి పనిచేసే వాడిని. రాత్రి భోజనం ముగించుకుని తిరిగి విభాగానికి వచ్చి అక్కడే పడుకునే వాడిని. మా గురువు సుబ్బారెడ్డి గది తాళాలు నాకు ఇచ్చి వెళ్లేవారు. నా పరిశోధనకు సంబంధించిన పని చేసుకుని అక్కడే రాత్రి పనుకునే వాడిని. దాదాపుగా పరిశోధక విద్యార్థిగా ఉన్నంత కాలం నాకు విభేగమే ఇల్లుగా మారిపోయింది’’ అని అన్నారు.

‘‘నేను చేపట్టిన ప్రతీ ప్రాజెక్టు, పరిశోధన సమాజ హితాన్ని కాంక్షించేవే కావడం యాదృశ్చికం. తూర్పు కనుమలు, అండమాన్‌ ఐలాండ్స్‌లో అడవులపై పరిశోధన చేసే అవకాశం లభించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఈ ప్రాజెక్టులో మా గురువు సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సీనియర్‌ రీసెర్చ్‌ఫెలోగా చేయడం జరిగింది. అతరించిపోతున్న గిరిజన జాతులు, వారి జీవనం, ఆహార శైలి, కుట్టుబాట్లు తదితర అంశాలను సునిశితంగా పరిశీలించే అవకాశం కలిగింది. కొన్ని సందర్భాలలో విపత్కర పరిస్తితులను, గిరిజనుల దాడులను ఎదుర్కొనే పరిస్థితులను సైతం చవిచూడాల్సిన అవసరం ఎదురైంది. అండమాన్‌లో 9 నెలల కాలం ఉండి 30 ఐలాండ్స్‌ను సందర్శించడం, పరిశీలించం జరిగింది.అక్కడ ఆహార సమస్య ఎక్కువగా ఎదురయ్యేది. మనం తినే అన్నం, భోజనం లభించేది కాదు. కేవలం ఉచికించిన పప్పు, పచ్చడి వేసుకుని తిని అక్కడ పనిచేసిన రోజులు ఎప్పటికీ మరువలేను’’ అని అన్నారు.

‘‘తూర్పు కనుమలపై జరిపిన మమ్మేలియన్‌ సర్వే ఇక్కడ జంతుజాతులపై పరిశోధన చేసే అవకాశాన్ని కల్పించింది. దీనిని ఆచార్య ఎం.వి సుబ్బారావు పర్యవేక్షణలో నిర్వహించాను. వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా 1994లో చేరడం జరిగింది. 2003లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతులు సాధించాను. నేను, ఆచార్య ఇ.ఉదయ భాస్కర రెడ్డి, ఆచార్య సాల్మన్‌ రాజు ఒకే సంవత్సరంలో ఉద్యోగంలో చేరడం జరిగింది. అప్పట్లో చిన్న విభాగంగా పర్యావరణ శాస్త్ర విభాగం ఉండేది. ఐదుగురు ఆచార్యులు ఉండేవారు’’ అని భైరాగిరెడ్డి చెప్పారు.

‘‘కొన్ని పరిశోధనలు జరిపే సమయంలో ప్రమాదకర పరిస్తితులను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా అరకు, పాడేరు ప్రాంతాలలో నీటి నాణ్యతను అధ్యయనం చేయడానికి నీటి నమూనాల సేకరణకు ప్రత్యక్షంగా వెళ్లేవాడిని. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో సైతం నీటిని సేకరించడం జరిగింది. ఆ సమయంలో నక్సల్స్‌ తారసపడం, వారు అనేక ప్రశ్నలు వేయడం, ప్రభుత్యోగి కావడంతో మరింతగా మమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. వీరికి సరైన సమాధానం ఇచ్చి, సర్దిచెప్పి మా పరిశోధన పూర్తిచేయడం జరిగింది’’ అని అన్నారు.

‘‘నా పరిశోధనలు దాదాపుగా ఫీల్డ్‌కు సంబంధించినవే. ఎంతో రిస్క్‌తో కూడుకున్నప్పటికీ వీటినే నేను ఎంచుకునే వాడిని, పర్యావరణంపై అవగాహన కల్పించే వీడియోలు, ఫిల్మ్‌లను గ్రామీణ ప్రాంతాలో ప్రదర్శించే వాడిని. ఒక సందర్భంలో పోలీసులు మమ్మల్ని గిరిజన ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పై అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఆక్కడకు వెళ్లి పరిశోధనకు అవసరమైన శాంపిళ్లను తీసుకురావడం జరిగింది. మేము వచ్చేసిన మూడు రోజులకు అక్కడ ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ను నక్సల్స్‌ పేల్చివేసారు. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో అనేకం చూసాను’’ అని చెప్పారు.

‘‘ఆచార్య ఎన్‌.సోమేశ్వర రావుతో సంయుక్తంగా గాలి. నీటి నాణ్యతలపై మేజర్‌ ప్రాజెక్టులను నిర్వహించడం జరిగింది. బార్క్‌ ఏర్పాటు చేసే స్థలంలో బేస్‌లైన్‌ డేటాలో భాగంగా సాయిల్‌, వాటర్‌, ఎయిర్‌ క్వాలిటీ, ఫ్లోరా, ఫానా పై 6 పరిశోధనలు నిర్వహించాను. కాలుష్య నియంత్రణ మండలితో కలసి నగరంలో నీటి నాణ్యతపై ప్రాజెక్టును చేసాను. పిసిబి అడిట్‌ మెంబరుగా ఉన్న సమయంలో సమాజ హిత, కాలుష్య నియంత్రణ సంబంధ పరిశోధన ప్రాజెక్టులకు స్కాలర్‌షిప్‌లు అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీర్చిదిద్ది అమలు చేస్తున్నాను’’ అని అన్నారు.

‘‘ఆచార్య వై.సి సింహాద్రి వీసీగా పనిచేసిన కాలంలో మూడు సంవత్సరాల కాలం నేను పరీక్షల విభాగంలో పనిచేశారు. నేను ఈ పదవిని వదిలి వెళ్లాలని ప్రయత్నించినా వీసీ సింహాద్రి నన్ను వదలలేదు. అక్కడ క్రమశిక్షణ, అనుభవం, బృందంగా పనిచేయడం అలవడింది. ప్రస్తుతం వర్సిటీలో శానిటేషన్‌, వాటర్‌ ఫెసిలిటీల కల్పనపై దృష్టిసారించడం ఎంతో అవసరం. ప్రయోగశాలలను పూర్తిస్తాయిల్లో అభివృద్ది చేయడం ఎంతో అవసరం. వ్యర్ధాల నుంచి ఎరువును తయారు చేయడంపై దృష్టిసారించాలి’’ అని అన్నారు.

‘‘వర్సిటీలో విద్యార్థిగా, పరిశోధనకునిగా నేను చూసిన సంఘటనలు, పరిస్థితులు నాకు నేటికి గుర్తున్నాయి. అందుకే నేను పరిశోధకుల వసతిగృహం చీఫ్‌ వార్డెన్‌గా పనిచేయడానికి సిద్దపడ్డాను. అక్కడ పరిశోధకుల సమస్యలు తెలుసుకుని వసతి ఇబ్బంది లేకుండా ఉంచడానికి కృషిచేసాను. పరిశోధనలో ఉండే కష్టాలను తెలుసుకుని వారికి అవసరమైనంత వరకు సహకారం అందించడానికి చిత్తశుద్దితో పనిచేశాను’’ అని రెడ్డి అన్నారు.