ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న వలస కార్మికులు

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావిత పేదలకు ఉపాధి, జీవనోపాధి కల్పనలో భాగంగా గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన (GKRA) ప్రారంభమైంది. దీనికింద ప్రస్తుతం ఆరు రాష్ట్రాలు (బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌) పరిధిలోని 116 జిల్లాల్లో గ్రామస్థులకు జీవనోపాధి కల్పన కోసం ప్రభుత్వం ఉద్యమ తరహాలో చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో ఇది ఆరో వారంలో ప్రవేశించగా, ఇప్పటికే లక్ష్యసాధన దిశగా పురోగమిస్తోంది. తదనుగుణంగా 17 కోట్ల పనిదినాలు కల్పించగా రూ.13,240 కోట్లు చెల్లించారు. ఈ పనుల్లో భాగంగా 62,532 జల సంరక్షణ పనులు, 1.74 లక్షల గ్రామీణ గృహాలు, 14,872 పశువుల షెడ్లు, 8,963 వ్యవసాయ చెరువులు, 2,222 సామాజిక పారిశుధ్య ప్రాంగణాలు నిర్మాణంతోపాటు జిల్లా ఖనిజ నిధి ద్వారా మరో 5,909 పనులు నిర్వహించారు. మరోవైపు 564 పంచాయతీలకు ఇంటర్నెట్ సంధానం, 16,124 మంది అభ్యర్థులకు రైతు విజ్ఞాన కేంద్రా(KVK)ల ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చారు.