కరోనా ఫ్రెండ్లీగా ఆర్టీసీ బస్సు సీట్లు

178
ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్‌లో కొత్తగా చేసిన సీటింగ్ ఏర్పాట్లు మెచ్చుకునేలానే ఉన్నాయి... కానీ, ఆయా సీట్లకు ఉన్న వస్త్రం పరిస్థితే భయాన్ని రేకెత్తిస్తోంది

అమరావతి, హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ విరామం (లాక్‌డౌన్) తర్వాత గ్రీన్ జోన్లలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులు నడుపుకోవచ్చన్న కేంద్ర (లాక్‌డౌన్-3లో ఇచ్చిన సడలింపు) మార్గదర్శకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం సీటింగ్ సామర్ధ్యం కుదింపు, ప్రయాణీకులు మాస్క్‌ల వినియోగం తప్పనిసరి, హ్యాండ్ శానిటైజర్ల వినియోగం వంటి విషయాలపై బాగానే దృష్టిపెట్టినప్పటికీ కొన్ని (ఉదాహరణకు సూపర్ లగ్జరీ) బస్సుల్లో సీటు కవర్లపై (సీటు కవర్లంటే ఇక్కడ సీటుకు పైన తొడిగే కవర్లు కాదు. సీటు తయారీకి ఉపయోగించిన దలసరి వస్త్రం గురించి) అసలు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కరోనా ఫ్రెండ్లీగా సీట్లు ఉన్నాయని, వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కొవిడ్-19 వ్యాప్తికి ఆహ్వానం పలికినట్లేనని ఇప్పటికే బస్సుల్లో ప్రయాణించిన కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరణ విషయంలో ఇంత కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సీటింగ్‌, శానిటేషన్‌తో పాటు సీట్లకు ఉపయోగించిన క్లాత్ మార్పిడి సహా, ప్రయాణ సమయంలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణపై మరింత దూరదృష్టితో లోతుగా ఆలోచన చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే, బస్సుల్లో సీటింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముఖ్యమంత్రి ఆర్టీసీకి స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిని అంత సీరియస్‌గా పట్టించుకోలేదన్న భావన కొన్ని బస్సుల్లో సీట్ల పరిస్థితిని గాని, వ్యాధి వ్యాపించకుండా తీసుకున్న చర్యలను గానీ గమనిస్తే అర్ధమవుతుంది.

ముఖ్యమంత్రి సూచన మేరకు కరోనా నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేయడమే కాకుండా హ్యాండ్ శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా, ఆర్టీసీ బస్సుల్లో సీట్ల తయారీకి ఉపయోగించిన వస్త్రం కరోనాను అతి వేగంగా గుణించటానికి చాలా అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏ శానిటైజర్ అయినా వస్త్రంలో కలుషితమైన వైరస్‌ను చంపలేదు. అందుకే, బస్సుల్లో ప్రయాణించి నిద్రపోతున్న ప్రయాణీకులకు ఇది పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరూ ప్రజా రవాణాను ఉపయోగించుకుంటారు. కరోనాతో కలిసి జీవించాల్సిందేనన్న ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కంటితుడుపు చర్యలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన బస్సుల్లో సీట్లను మాత్రమే కాకుండా వాటి తయారీకి గతంలో వినియోగించిన వస్త్రాలను కూడా తొలగించి వైరస్ వ్యాప్తికి ప్రతికూలమైన వాటిని వాడితే ఫలితం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీట్లను లామినేషన్ లేదా ప్లాస్టిక్ కవర్లతో కవర్ చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, ఇండియన్ నేవీ రిటైర్డ్ అధికారి పైడి విశ్వేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు, ఇప్పటికే బస్సుల్లో సీటింగ్‌కు సంబంధించి మార్పులు, చేర్పులు పూర్తయ్యాయి.

సీటింగ్ మార్పుల ప్రకారం, బస్సుల్లో సామర్ధ్యం ఇలా ఉంది.

ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా మార్పుచేసిన సీట్లు
  • సూపర్ లగ్జరీ (36 సీట్లు): 24 సీట్లకు కుదింపు
  • అల్ట్రా డీలక్స్(40 సీట్లు): 27 సీట్లకు కుదింపు
  • ఎక్స్‌ప్రెస్‌(50 సీట్లు): 30 సీట్లకు కుదింపు
  • పల్లెవెలుగు(60 సీట్లు): 36 సీట్లకు కుదింపు
  • సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌(45 సీట్లు): 23 సీట్లకు కుదింపు
  • సిటీ ఆర్డినరీ(46 సీట్లు): 24 సీట్లకు కుదింపు

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు 58 రోజులుగా ఆర్టీసీ బస్సు చక్రం ఆగిపోయింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ సూచనలు, అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగానే సీటింగ్ ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. చైనాలోని బీజింగ్, షాంఘై తరహా పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం సర్వీసులు మాత్రమే ప్రారంభించినట్లు తెలుస్తోంది. టికెట్ల జారీ, సీటింగ్ సామర్ధ్యం వరకే చూసిన అధికారులు కొన్ని బస్సుల్లో పాత సీట్లకు వాడిన వస్త్రం వల్ల వైరస్‌ను అడ్డుకునే సామర్ధ్యం ఏ శానిటైజర్‌కూ లేదన్న విషయాన్ని మరచిపోయారు.

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ అనుసరించాల్సిన, పాటించాల్సిన కొన్ని కీలక ప్రమాణాలు మరువరాదు. సీట్ల మార్పునకు ఒక్కో సీటుగా సగటున పది రూపాయల వరకూ ఖర్చుచేశామని చెబుతున్న అధికారులు పనిలోపనిగా సీట్ల తయారీ సమయంలో స్పాంజీలకు అమర్చిన వస్త్రాన్ని కూడా మార్చి ఉంటే బావుండేది.