వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ కలిసినప్పటి చిత్రం (File Photo)
(* శ్రీథర్ ఎస్.టి.జి.)

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అధికారాన్ని ఇచ్చిన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రానున్న కాలంలో ఏక పార్టీ పాలనకు దారి తీయనున్నాయా? తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న రాజకీయ వాతావరణం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. రాష్ట్ర విభజన జరగక ముందు కాంగ్రెస్ పార్టీ ఏకబిగిన మూడున్నర దశాబ్దాలు అధికారం చెలాయించింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పీకి పారేసారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఐదేళ్లు పూర్తి కాకముందే కాంగ్రెస్ పన్నిన కుట్రకు ఆయన బలైపోయారు. 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఎన్టీఆర్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చివరకు తెలంగాణలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఎన్టీఆర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. 89 నుంచి 94 వరకు జరిగిన రాజకీయ పరిణామాలలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోయారు. తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తిరిగి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగానే విధాన సభలో అడుగు పెడతానని శభదం చేసిన ఎన్టీఆర్ తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబునాయుడు తొమ్మిది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజన సులువైపోయింది.

తెలంగాణలో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. విధాన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే 2019లో జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. వైయస్ తనయుడు జగన్ నెలకొల్పిన వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారం చలాఇస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడంతో ఆ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో బాబు విఫలమయ్యారు. తన సామాజిక వర్గానికి చెందిన మీడియా సహాయంతో తాను తప్పించి ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ కు నాయకత్వం వహించలేరని భ్రమ కల్పించారు. మాటల్లో తప్పిస్తే నిర్మాణాత్మకమైన అభివృద్ధి ఏకోశానా కనిపించలేదు. వైసీపీ తరుపున ఎన్నికైన శాసనసభ్యులను కోట్లాది రూపాయలు వెచ్చించి తన పార్టీలోకి చేర్చుకున్నారు. కుమారుడు లోకేష్‌ను దొడ్డిదారిలో విధాన పరిషత్‌కు తీసుకువచ్చి మంత్రిని చేశారు.

ఫలితంగా రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రులు కూడా లోకేష్ ఆదేశాలకు లోబడి పని చేయవలసిన దుస్థితి ఏర్పడింది. లోకేష్ రాకతో బాబు ఆశించిన ఫలితాలు లభించకపోగా పార్టీ, ప్రభుత్వం అపహాస్యం పాలైంది. చంద్రబాబు అంతకుముందు మాదిరి పార్టీ పైన, ప్రభుత్వం పైన, అధికార యంత్రాంగం పైన పట్టు సాధించలేకపోయారు. ఇదే సమయంలో వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి విధానసభ సమావేశాలను బహిష్కరించి పాదయాత్ర ప్రారంభించారు. మూడు వేల కిలోమీటర్లు పైబడి ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ప్రజలలో బలపడి ఓట్ల రూపంలో అధికారం ఇచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతోంది. జగన్ రాజకీయంగా చంద్రబాబుకు పక్కలో బల్లెంగా మారారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తెలుగుదేశం మద్దతుదారులు న్యాయస్థానాలను ఆశ్రయించటం మొదలుపెట్టారు. తాత్కాలిక ఊరట లభించినప్పటికీ ప్రజలు మాత్రం జగన్ పక్షానే నిలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయింది. నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కనుచూపు మేరలో కనిపించలేదు. ప్రజలు చంద్రబాబుకు మొండిచేయి చూపించారు. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమిని హుందాగా తీసుకోకుండా దొంగ ఓట్లతో అధికార పార్టీ గెలిచిందని చేసిన ప్రకటనలు ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ తమ నైతిక బలం క్షీణించిందని నిరూపించుకున్నారు. పార్టీలేదు, బొంగులేదని పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు చేసిన వ్యాఖ్య వైరల్ కావడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావలాగా నడుస్తోంది. చంద్రబాబు సంయమనం తప్పి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. జగన్ ధాటికి తాము తట్టుకోలేమన్న నిజాన్ని తెలుగుదేశం నాయకులు గ్రహించారు. ఎవరికి వారు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయింది. వామపక్షాలు అయిపు లేకుండాపోయాయి. కమ్యూనిస్టులకు కంచుకోటగా గుర్తింపు పొందిన విజయవాడలో కమ్యూనిస్టుల చిరునామా కోసం వెతుక్కోవలసి వస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం ఎవరు వహిస్తున్నారో అంతు పట్టడం లేదు. వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ తెలుగుదేశంలో విలీనం అయిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి బలమైన పునాదులు లేవన్నది జగమెరిగిన సత్యం. తిరుపతిలో గెలిచి తీరుతామని ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరాశ మిగిలింది. డిపాజిట్ కూడా గల్లంతయింది. ఇప్పటికైనా పత్రికా ప్రకటనలు, అర్థం పర్థం లేని విమర్శలు మానేసి అట్టడుగు స్థాయి నుంచి పార్టీని పునర్ నిర్మించుకునేందుకు బిజెపి, వామపక్షాలు ప్రయత్నించని పక్షంలో మరోసారి శృంగభంగం తప్పదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రాంతీయ పార్టీల హవాయే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోఉన్న టిఆర్ఎస్, వైసిపిలకే ప్రజలు మొగ్గుచూపే ఆస్కారం ఉన్నది.

(* వ్యాసకర్త; సీనియర్ జర్నలిస్టు; విశ్లేషకులు; +91 98111 82079)