ఎమ్మెల్సీ ఎన్నికలలో రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు

186

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య, బ్యాలెట్ పేపర్ భారీ పరిమాణం దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా తెలిపారు.

సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఈ నెల 22వ తేదీ పోలింగ్, 26వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియల నిర్వహణపై వివరించారు. ఈ సందర్భంగా 46 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న నేపద్యంలో బ్యాలెట్ పేపర్ సైజు గణనీయంగా పెరిగిందని తెలియజేస్తూ నమూనా బ్యాలెట్‌ను వారి అవగాహన కొరకు చూపారు.

బ్యాలెట్ పత్రం సైజు, బరిలో ఉన్న 46 మంది అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు చేసేందుకు ఒక్కక్క ఓటరుకు పట్టే కనీస సమయం అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలన్నిటిలో పెద్ద సైజు బ్యాలెట్ బాక్స్‌లతో రెండు ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు.

అలాగే బ్యాలెట్ పత్రాన్ని బాక్స్‌లో వేసేందుకు ఏ విధంగా మతపెట్టన్నది ఆయన ప్రదర్శించి అభ్యర్థులకు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు ఓటు వేసేపుడు చేయదగిన, చేయకూడని అంశాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభ్యర్థులకు వివరించి, వాటిపై ఓటర్లను చైతన్య పరచాలని కోరారు. అలాగే ఓట్లు ఏఏ కారణాల వల్ల చెల్లబాటు కాదని పరిగణిస్తారో ఆయన అభ్యర్థులకు వివరించారు. చెల్లని ఓట్లను అభ్యర్థులు, ఏజెంట్లకు చూపి లెక్కింపులో తొలగించడం జరుగుతుందని, వాటిని నిర్ణయించడంలో రిటర్నింగ్ అధికారిదే అంతిమ నిర్ణయమని తెలియజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఓటరుకు ఇచ్చిన ఊదా (వయలెట్) రంగు స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాలి, వేరే ఇతర పెన్, పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఉపయోగించరాదు. ఓటరు తన మొదటి ప్రాధాన్యత సంఖ్య 1ని ఎంచుకున్న అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో రాయడం అత్యంత ఆవశ్యకం, మిగిలిన అభ్యర్థుల ఎంపిక ఓటరు ఇష్టం, అనగా 2, 3, 4 అంకెల ద్వారా తదుపరి ప్రాధన్యతలను సూచించవచ్చు లేదా వదిలి వేయవచ్చును. ప్రాధన్యతలను సూచించేందుకు ఓటర్లు అంతర్జాతీయ విధానంలో భారతీయ అంకెలను గానీ రోమన్ అంకెలను గానీ, భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన భారతీయ భాషాలలో ఉపయోగించే సంఖ్యలను గానీ వాడాలి. వివిధ రకాల సంఖ్యా విధానాలను కలిపి వాడకూడదు.

ఓకే ప్రాధాన్యత సంఖ్యను ఓక అభ్యర్థికన్నా ఎక్కవ మందికి సూచించరాదు. బ్యాలెట్ ప్రత్రంపై ఓటరు పేరు గానీ, ఇతర పదాలు, సంతకం లేదా పోడి అక్షరాలు రాయడం, వేలి ముద్ర వేయడం చేయరాదు. ఎంపిక ప్రాధాన్యతలను అంకెలలో 1, 2, 3 అని సూచించాలి, అక్షరాల్లో ఒకటి, రెండు, మూడు అని వ్రాయకూడదు. అలాగే ఎంపిక ప్రాధాన్యతలను టిక్ లేదా ఎక్స్ మార్కులతో సూచించ రాదు. ఒక అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కవ అంకెలను సూచించరాదు. అభ్యర్థికి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే సంఖ్య రాయాలి, రెండు గదుల మద్య గీతపై రాయరాదు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కాకినాడ, రంగరాయ మెడికల్ కళాశాల బాలుర ఎగ్జామినేషన్‌లో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు తెలియజేశారు. అలాగే కౌంటింగ్ హాలులో టేబుళ్ల ఏర్పాటు, ఆర్ఓ, అబ్జర్వర్, అభ్యర్థులు, ఏజెంట్‌ల సిటింగ్ ప్లాన్‌లను ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానంపై అభ్యర్థులు, ఏజెంట్‌లకు ఈ నెల 25వ తేదీ, 10 గంలకు మరో విడత సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసి, వారు తెలిపిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై విచారణ చేసి ఎన్నికల కమీషన్‌కు సమర్పిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ యం.వి.గోవిందరాజులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు పాల్గొన్నారు.