భార్యతో కలిసి ప్రసాద్ విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యటించినప్పటి చిత్రం (File photo)

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ శృంగారం ప్రసాద్ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మూడు దశాబ్దాల కాలంగా పత్రికా రంగంలో సేవలందించి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో సాధారణ కార్యకర్త నుండి జిల్లా కార్యదర్శిగా ఎదిగిన ఆయన తుది వరకూ పాత్రికేయాన్నే నమ్ముకుని సేవలందించారు. చిన్న పత్రికలకు మొట్టమొదటి విలేకరిగా పనిచేసి ‘సమాచార్ ప్రసాద్’గా గుర్తింపు పొందిన ప్రసాద్ తర్వాత అనేక చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేశారు. జర్నలిజంలో తనకంటూ ఓ స్థానం ఉండాలని ఆశించిన ప్రసాద్ సుమారు ఐదేళ్ల క్రితమే 2016 మే 23న) ‘ప్రసాద్ న్యూస్’ పేరిట రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) నుంచి దినపత్రిక నిర్వహణ కోసం టైటిల్ క్లియరెన్స్ (టీసీ) పొంది రిజిస్ట్రేషన్ (సీఆర్) కూడా పూర్తిచేసుకున్నారు.

2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ అప్పటి కమిషనర్ సి. పార్ధసారధి చేతుల మీదుగా ‘మన్యసీమ’ పక్షపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన చిత్రంలో శృంగారం ప్రసాద్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి). పక్కన పైడి లక్ష్మణరావు, దిమిలి అత్యుచ్‌రావు

విద్యావంతుల కుటుంబం నుంచి జర్నలిజం వృత్తిలోకి వచ్చిన ప్రసాద్ తండ్రి శృంగారం నాగేశ్వరరావు అప్పట్లో స్కూల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వృత్తిరీత్యా తండ్రి ఉత్తరాంధ్ర జిల్లాలలోని వేర్వేరు ప్రాంతాలలో పనిచేయడంతో ప్రసాద్ చదవుకు కూడా ఒకచోట స్థిరంగా సాగలేదు. అయితే, వివాహం అనంతరం మాత్రం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. ప్రసాద్ అకస్మిక మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలోకి జారుకుంది.

ప్రసాద్ వయస్సు 55 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. తన సాయం కోరి వచ్చినవాారికి ఆపన్న హస్తం చాటటడంలో ప్రసాద్‌కు కేవలం శ్రీకాకుళంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోని చాలా జిల్లాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. యూనియన్ కార్యకలాపాలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎంత దూరం వెళ్లాలన్నా ప్రయాణానికి సిద్ధపడేవాడు. కొన్ని కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆయనకు ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా నల్లి ధర్మారావు లాంది పెద్దల సహకారాన్ని తీసుకుని వెళ్తూ యూనియన్ పట్ల తన అంకితభావాన్ని చాటుకునే వారు. పత్తి నాగేశ్వరరావు, నల్లి ధర్మారావు లాంటి జర్నలిస్టు ధిగ్గజాలతోనే కాకుండా సమాచార శాఖలోని ఎందరో సీనియర్ అధికారులతో కలిసి పనిచేసిన ఆయన అప్పట్లో ప్రభుత్వ శాఖలు సమాచార శాఖతో కలిసి ఏర్పాటుచేసిన అనేక అధ్యయన యాత్రలకు హాజరై విజయగాధలను వివిధ పత్రికలకు అందించారు. ముళ్లపూడి సాయికుమార్ (అగ్నివర్ష) లాంటి ఎందరో వర్ధమాన, ఔత్సాహిక ప్రచురణకర్తలకు అవసరమైన వార్తలను అందిస్తూ ప్రసాద్ ప్రోత్సహించేవారు. అలాంటి ప్రసాద్ కన్నుమూశారన్న వార్తను ఆయన గురించి తెలిసిన చాలా మంది దిగమింగుకోలేకపోతున్నారు.

ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే అందుబాటులో ఉన్న పాత్రికేయ మిత్రులు న్యూ కాలనీలోని నివాసానికి చేరుకుని తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) పూర్వ అధ్యక్షుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆహ్వాన సభ్యుడు నల్లి ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరరావు, యూనియన్ జిల్లా అధ్యక్షుడు కూన పాపారావు, ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎమ్.వి. మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు చింతాడ అప్పలనాయుడు, ‘అగ్నివర్ష’ దినపత్రిక ఎడిటర్ ముళ్లపూడి సాయికుమార్ తదితరులు ప్రసాద్ పార్ధివదేహాన్ని సందర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.