సత్వర ఫలితాలతో సంచలనం

58
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని తన కార్యాలయం నుంచి అత్యవసర విధులు నిర్వహిస్తున్న దక్షిణ తూర్పు రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ మొహంతి
  • భారతీయ రైల్వేల కొత్త కేంద్రీయ నియంత్రణ విభాగం

  • లాక్‌డౌన్ తొలి 10 రోజుల్లో హెల్ప్‌లైన్‌కు 1,25,000 ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): రైలు ప్రయాణీకులు, ఇతర పౌరులకు సహాయం అందింఛి సరుకుల రవాణా సమస్యలను తీర్చేందుకు వీలుగా లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత భారతీయ రైల్వేలు కేంద్రీయ నియంత్రణ విభాగం ఏర్పాటు చేశాయి. కొద్ది రోజుల కిందట ఏర్పాటైన నియంత్రణ విభాగం నిర్వహణలో విజయం సాధించింది. ఏర్పాటైన మొదటి 10 రోజుల్లో (లాక్‌డౌన్ సమయంలో కూడా) రైల్వే సిబ్బంది 1,25,000 ప్రశ్నలకు బదులిచ్చారు.

ప్రజల ఫిర్యాదులు, సూచనలను అందుకోవడానికి ఏర్పాటైన సమాచార వ్యవస్థ (ప్లాట్ ఫాం)పైన రైల్వే సిబ్బంది నేరుగా ఫోనులో మాట్లాడి 87% (1,09,000కు పైగా) ప్రశ్నలకు బదులిచ్చారు. నాలుగు సమాచార, ప్రతిపుష్టి వ్యవస్థలు (ప్లాట్ ఫాంలు)–హెల్ప్ లైన్లు- 139, 138, సామాజిక మాధ్యమం (విశేషంగా ట్విట్టర్), ఈమెయిల్ railmadad@rb.railnet.gov.in ద్వారా విరామం లేకుండా 24×7 నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తోంది.

లాక్‌డౌన్ సమయంలో సాధారణ ప్రజానీకం తమ సమస్యలు ఎలాంటి అడ్డంకులు లేకుండా రైల్వే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలవుతుంది. ప్రజలు అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవడమే కాక ఏవైనా సూచనలను కూడా అందించవచ్చు. కంట్రోల్ కార్యాలయాన్ని రేయింబవళ్ళు డైరెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రైల్వే వినియోగదారుల నుంచి విశేషంగా సరుకుల రవాణాకు సంబంధించి సామాజిక మాధ్యమం, ఈమెయిల్ ద్వారా అందే పౌరుల ఫీడ్ బ్యాక్ (ప్రతిపుష్టి) మరియు వారి సూచనలకు సత్వరం స్పందించి ఈ అధికారులు తగిన విధంగా పనులు జరిగేలా చూస్తున్నారు. ఈ బృందం పనిని క్షేత్రస్థాయి అధికారులైన అదనపు డిఆర్ఎంలు డివిజన్ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైల్ మదద్ హెల్ప్ లైన్ 139 ద్వారా లాక్‌డౌన్ మొదలైన మొదటి 10 రోజుల్లో సాధారణ ప్రజానీకం అడిగిన 80,000 ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వడం జరిగింది.

ఇవి కాకుండా ఐవిఆర్ఎస్ సౌకర్యం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ప్రశ్నలలో ఎక్కువ భాగం రైల్వే సర్వీసుల పునఃప్రారంభం, చార్జీల తిరిగి చెల్లింపు నియమాల సడలింపు (ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ కారణంగానే నియమాల సడలింపు), ఈ కష్టకాలంలో రైల్వేల ప్రయత్నాలకు సామాజిక మాధ్యమంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యావసర వస్తువులతో సరుకుల రైళ్ళను నడపడం, వ్యాగన్లను ఆలస్యంగా పంపినందుకు జరిమానాల మాఫీ, రైలు కోచులను ఆసుపత్రి వార్డులుగా మార్చడం, ఆహార పొట్లాల పంపిణీ, కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి వ్యక్తిగత సంరక్షణ సాధనాలు(పిపిఇలు), శానిటైజర్లు, ఇతర పరికరాల తయారీ మొదలైన పనులకు ప్రశంసలు అందుతున్నాయి.

హెల్ప్ లైన్ నెంబర్ 138పై వచ్చే ఫోన్ కాల్‌లను ఫోన్ చేసే ప్రదేశం ప్రాతిపదికగా నేరుగా రైల్వే డివిజనల్ నియంత్రణ కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ హెల్ప్ లైన్‌లో పనిచేసే సిబ్బంది స్థానిక భాష మాట్లాడటంతో పాటు స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవారు. దీనివల్ల ఫోన్ చేసే వారికి సులభంగా అర్ధమయ్యే భాషలో సమాచారం, సలహాలు అందించడం సాధ్యమవుతుంది. భాషా సమస్య లేని ఈ కొత్త సౌకర్యం వల్ల డివిజన్ స్థాయిలో అందుబాటులో ఉన్న సముచితమైన సమాచారం వేగంగా రైల్వే వినియోగదారులకు, ఇతరులకు అందించడానికి వీలవుతుంది.

భారతీయ రైల్వే శాఖ అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా ప్రయాణీకులు మరియు అన్ని వర్గాల వాణిజ్య వినియోగదారులు ప్రయోజనాలను కాపాడటంతో పాటు జాతీయ సరఫరా శృంఖల అన్నివేళలా ఆగకుండా కొనసాగేలా చూస్తున్నదని చెప్పడం సముచితం.