షిరిడీ, నవంబర్ 16 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ ప్రభావంతో మూతపడ్డ ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయం సోమవారం తెరుచుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్రంలోని దేవాలయాలు, మత ప్రార్థనా స్థలాలు తిరిగి ఒకటొకటిగా ప్రారంభమవుతున్నాయి. భక్తుల సందర్శనానికి వీలు కల్పించారు. ఇందులో భాగంగానే షిర్డీ ఆలయాన్ని కూడా సోమవారం నుంచి తిరిగి సాయి భక్తులు, యాత్రికుల సందర్శనార్థం తిరిగి తెరిచారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా దేశంలో ప్రఖ్యాతిగాంచిన పలు ఆలయాలతో పాటు షిర్డీ ఆలయానికి కూడా మూత తప్పలేదు. సోమవారం కాకడి ఆరతి తరువాత భక్తులు సాయిబాబాను సందర్శించుకునే వెసులుబాటు కల్పించారు. అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతానికి రోజుకు 6000 మంది భక్తులను గంటకు 900 మంది చొప్పున ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నారని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు దర్శనం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను తీసుకుంటారు. దీని ప్రాతిపదికనే టికెట్లు అందచేస్తారు. 65 ఏళ్లు పైబడ్డ వారిని, పదేళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఇప్పటికే షిరిడీ సంస్థాన్ ట్రస్టు ప్రకటించింది.

కొవిడ్‌ మహమ్మారి మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ జారీ చేసింది. ఆలయాల్లో సామాజిక దూరం, ఫేస్‌ మాస్క్‌లు ధరించడం తప్పసరి సరి చేశారు. షిర్డీ దేవస్థానం ట్రస్ట్‌ నిత్యం ఆరువేల మందికిపైగా భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్‌ హల్వాయి గణపతి ఆలయంలో సైతం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చిలో ఆలయాలు మూతపడ్డాయి. కేవలం ఆయా ఆలయాల్లో నిత్య పూజలు జరగ్గా భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇచ్చారు. జూన్‌లో కేంద్రం ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూసే ఉంచింది.