అలహాబాద్‌లోని ఓ ఆసుపత్రి వద్ద కోవిడ్ పరీక్ష కోసం వేచి ఉన్న కరోనా అనుమానితులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): భారత్‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య తగ్గుముఖం పడుతున్న ధోరణి కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా బాధితుల సంఖ్య 8 లక్షల లోపే ఉంది. ప్రస్తుతం 7,83,311 మంది కోవిడ్ బాధితులు చికిత్సపొందుతూ ఉన్నారు. దేసంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా ప్రస్తుతం 10.45%. జాతీయ స్థాయిలో ఇలాంటి ధోరణి కొనసాగుతుండగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20 వేల లోపు మాత్రమే చికిత్సలో ఉన్నట్టు తేలింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే 20,000కు పైగా, 50,000 లోపుగా కేసులు చికిత్సలో ఉన్నాయి. 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే 50,000కు పైగా కేసులున్నాయి.

కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం వల్లనే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారి సంఖ్య 65,97,209కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 58 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే అది 58,13,898. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి 88.03% చేరుకుంది. గడిచిన 24 గంటలలో 72,614 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా పాజిటివ్‌గా నిర్థారణ అయినవారు 61,871 మందిగా నమోదయ్యారు.

కొత్తకేసులలో 79% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో ఒకే రోజు అత్యధికంగా 10,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 9,000 కేసులతో కేరళది రెండో స్థానం. గత 24 గంటలలో 1033 మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 86% మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లోనే రికార్డయ్యాయి. 44% పైగా (463 మంది) తాజామరణాలు మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి.

దేశంలో కొత్తగా 61,871 మందికి కరోనా పాజిటివ్‌

మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా, కొనసాగుతోంది. అయితే క్రియాశీల కేసులతోపాటు, కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. శనివారం 9,70,173 నమూనాలను పరీక్షించగా 61,871 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1033 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,031గా నిలిచింది. నిన్న దేశ వ్యాప్తంగా 72,614 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 65,97,210 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,83,311 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

రోవైపు రికవరీల రేటు పెరుగుతోంది. దాదాపు 88.03 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.45 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,42,24,190 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో 1,436 కరోనా కేసులు

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,22,111కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,271కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 22,050 ఉన్నాయి. వీరిలో 18,279 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి మరో 2,154 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,98,790కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 249 కొత్త కేసులు నమోదయ్యాయి.