అస్తమించిన గాన గాంధర్వం

గాయకుడు ఎస్పీబీ కన్నుమూత

చెన్నై, సెప్టెంబర్ 25 (న్యూస్‌టైమ్): పాట అని తలుచుకోగానే మొదట మెదిలే పేరు ఆయనదే.. ముత్యాలు వస్తావా అని పాడి నవ్వించినా.. శంకరా నాదశరీరాపరా అని సంగీత సుస్వారలతో మైమరిపించినా.. నవ్వింది మల్లె చెండు అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టినా.. ఆ గాన గాంధర్వానికి మురిసిపోని హృదయం లేదు. ఒకటా రెండా 40 వేలకు పైగా పాటలు.. అదీ ఇదీ అని లేకుండా 11 భాషలు.. అలుపనేది లేకుండా నాలుగు దశాబ్దాల సినీ గాత్ర ప్రస్థానం.. ప్రజల ఆరాధ్య గాయకుడిగా నిలిచిన తెలుగు తేజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం! కొన్ని పాటలు ఆయన పాడితే బావుండును అనిపిస్తుంది.. మరికొన్ని అబ్బా ఈయన పాడాడేమిటి అనిపిస్తుంది.. కానీ, బాలు పాడితే ఏ పాటైనా అయన కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఆయన గొంతు జాతీయ స్థాయి సినీ నటులకు ఆలంబనగా నిలిచింది.

ఆయన స్వరం ఎందరో ప్రసిద్ధ నటులకు గాత్రభిక్ష అందించింది. అంతెందుకు బాలూ పాడితే ఆయన గొంతులో నటుల గాత్రం ఒదిగిపోతుంది. తెలుగు సినిమా.. కాదు భారతీయ సినిమా ఉన్నంత వరకూ బాలసుబ్రహ్మణ్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. భారత సినీమా తల్లికి స్వరాభిషేకం చేసి.. పాడుతా తీయగా అంటూ మన మధ్యలోనే ఎప్పటికీ.. మన గుండెల్లోనే ఎన్నటికీ.. అయన స్థానం చెదరదు. ఎందుకంటే నభూతో.. నభవిష్యతి.. అనే మాటకి సరిగ్గా సరిపోయే పాటసారి మన బాలూ!

అంతటి ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు. గత 50 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఎజిఎం ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో యావత్ సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. కరోనా వైరస్ బారిన పడి ఆగస్ట్ 5న చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు ఆయన. ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాడని తనయుడు ఎస్పీ చరణ్ తెలిపాడు. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్న నేపథ్యంలో ఉన్నట్లుండి ఆయన మరణించారన్న వార్త సినీ లోకాన్ని కుదిపేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేశారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.

ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యం. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో ఓ బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. ఈయ‌న‌ సాంబ‌మూర్తి, శ‌కుంత‌ల‌మ్మ దంప‌తుల రెండో సంతానం. ఇంజ‌నీర్ కావాల‌ని క‌ల‌లు క‌ని గాయ‌కుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయ‌న‌కు చ‌ర‌ణ్‌, శైల‌జ అని ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న (1966) చిత్రంలో తొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన‌ సినీ ప్ర‌స్థానంలో న‌ల‌భై వేల పైచిలుకు పాట‌లు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. ముఖ్యంగా భక్తి పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు.

అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటావినిపిస్తూనే ఉన్నాయి. ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981లో బాలీవుడ్‌లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషన్‌ వరించింది. 1999లొ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది.