న్యూఢిల్లీ, డిసెంబర్ 1 (న్యూస్‌టైమ్): 19వ నంబర్ జాతీయ రహదారికి చెందిన వారణాసి – ప్రయాగ్ రాజ్ మధ్య ఆరు లైన్ల వెడల్పుతో నిర్మించిన రహదారి ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గతంలో చేసిన కాశీ క్షేత్రం సుందరీకరణతో పాటు కనెక్టివిటీ కోసం చేపట్టిన పనుల ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నామని పేర్కొన్నారు. వారణాసిలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ రాకపోకల రద్దీని తగ్గించడానికి కొత్త రహదారులు, పుల్-ఫ్లైఓవర్లు, రహదారుల వెడల్పు వంటి అనేక అపూర్వమైన పనులు జరిగాయని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఆధునిక కనెక్టివిటీ విస్తరించినప్పుడు మన రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారని, ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో ఆధునిక రహదారులతో పాటు శీతల గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలతో ఒక నిధిని కూడా ఏర్పాటుచేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ప్రయత్నాలు, ఆధునిక మౌలిక సదుపాయాల నుండి రైతులు ఎలా లబ్ధి పొందుతున్నారనే విషయమై ప్రధానమంత్రి ఒక ఉదాహరణను పేర్కొంటూ, ‘‘రైతుల ఆదాయాన్ని పెంచడానికి రెండు సంవత్సరాల క్రితం చందౌలీలో నల్ల బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం, ఒక రైతు కమిటీని ఏర్పాటు చేసి, ఖరీఫ్ సీజన్లో పండించడానికి 400 మంది రైతులకు ఈ బియ్యం ఇచ్చారు. సాధారణ బియ్యం కిలోకు 35 రూపాయల నుండి 40 రూపాయలకు అమ్ముడౌతుండగా, ఈ నల్ల బియ్యం కిలోకు 300 రూపాయల వరకు ధరకు అమ్ముడయ్యాయి. మొట్టమొదటిసారిగా, ఈ బియ్యం కిలోకు 800 రూపాయల ధరకు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం జరిగింది.’’ అని వివరించారు.

భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ పెద్ద మార్కెట్లు, అధిక ధరలకు రైతులకు ఎందుకు ప్రవేశం ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త ఎంపికలతో పాటు, చట్టపరమైన కొత్త రక్షణను ఇచ్చాయనీ, అదే సమయంలో ఎవరైనా పాత వ్యవస్థను ఎంచుకుంటే, పాత వ్యవస్థ కూడా కొనసాగుతుందని, ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు, మండీ వెలుపల లావాదేవీలు చట్టవిరుద్ధం, అయితే, ఇప్పుడు చిన్న రైతులు సైతం, మండీ వెలుపల లావాదేవీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని ప్రధానమంత్రి వివరించారు.

ప్రభుత్వాలు విధానాలు, చట్టాలు, నిబంధనలను రూపొందిస్తామని, ప్రధానమంత్రి చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు కేవలం అపోహలు, భయాలపైనే, విమర్శలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు ఏమీ జరగలేదని, ఇక ముందు కూడా ఏమీ జరగదన్న గందరగోళం సమాజంలో నెలకొందని, ఆయన పేర్కొన్నారు. వీరు, దశాబ్దాలుగా రైతులను మోసగించిన వారేనని ఆయన అన్నారు. గతంలో అనుసరించిన నకిలీ విధానాలనే కొనసాగిస్తూ, ఎం.ఎస్.పి.ని ప్రకటించినట్లు ప్రధానమంత్రి చెప్పారు, అయితే చాలా తక్కువ ఎమ్.ఎస్.పి. కొనుగోలు జరిగిందని అన్నారు. ఈ మోసం కొన్నేళ్లుగా కొనసాగిందని, రైతుల పేరిట పెద్ద పెద్ద రుణ మాఫీ ప్యాకేజీలను ప్రకటించినప్పటికీ, అవి చిన్న, మధ్య తరహా రైతులకు చేరలేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రైతుల పేరిట పెద్ద పథకాలు ప్రకటించినప్పటికీ, వాటిలో రూపాయికి, 15 పైసలు మాత్రమే రైతుకు చేరుకున్నాయనీ, ఇది పథకాల పేరిట మోసమని, వారే నమ్ముతున్నారనీ ప్రధానమంత్రి చెప్పారు. చరిత్ర పూర్తిగా మోసపూరితంగా ఉన్నప్పుడు, రెండు విషయాలు సహజంగా ఉంటాయని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. మొదటిది, ప్రభుత్వాల వాగ్దానాల గురించి రైతులు భయపడటం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. రెండవది, వాగ్దానాలను విచ్ఛిన్నం చేసేవారికి, అంతకుముందు ఏమి జరిగిందో, ఇప్పుడు కూడా అదే జరగబోతోందనే అసత్యాలను వ్యాప్తి చేయడం వారికి తప్పనిసరి అవుతుంది. ఈ ప్రభుత్వ గత చరిత్ర చూసినప్పుడు, వాస్తవాలు వాటంతట అవే బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌‌ను నిలిపివేసి, రైతులకు తగినంత యూరియా ఇస్తామన్న హామీని, ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుకు అనుగుణంగా ప్రభుత్వం ఎం.ఎస్.‌పి.ని 1.5 రెట్లు పెంచినట్లు, ప్రధానమంత్రి తెలిపారు. ఈ వాగ్దానాలు, కేవలం కాగితాలపై పేర్కొనడమే కాకుండా, రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. 2014కి ముందు ఐదేళ్ళలో సుమారు 6.5 కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలను రైతుల నుంచి సేకరించగా, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో, సుమారు 49,000 కోట్ల రూపాయల విలువైన పప్పుధాన్యాలు సేకరించారని, అంటే 75 రెట్లు పెరుగుదల నమోదయ్యిందని ప్రధానమంత్రి చెప్పారు. 2014కి ముందు ఐదేళ్ళలో, రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన వరిని కొనుగోలు చేయగా, ఆ తరువాతి ఐదు సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయలను, వరి రైతులకు ఎం.ఎస్.‌పి.గా అందజేయడం జరిగిందని, అంటే, దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఆదాయం రైతులకు చేరిందన్నారు.

2014కి ముందు ఐదేళ్ళలో, రైతుల నుండి సుమారు 1.5 లక్షల రూపాయల విలువైన గోధుమలను కొనుగోలు చేయగా, ఆ తరువాతి 5 సంవత్సరాలలో, గోధుమ రైతులకు సుమారు రెట్టింపు అంటే 3 లక్షల కోట్ల రూపాయలు లభించాయని, మండీలను, ఎం.ఎస్.‌పి.లను కూల్చివేస్తే పక్షంలో, ప్రభుత్వం ఎందుకు ఇంత ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి ప్రశ్నించారు. మండీలను ఆధునీకరించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ ససమ్మాన్ నిధి గురించి, ప్రతిపక్షాలు మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ డబ్బు ఇస్తున్నారనీ, ఎన్నికల తరువాత ఈ డబ్బు వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసి వస్తుందన్న పుకారును వ్యాప్తి చేశారని ప్రధానమంత్రి విమర్శించారు. ప్రతిపక్షపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనుమతించలేదని ఆయన చెప్పారు.

ఈ సహాయాన్ని, దేశంలోని 10 కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల మేర సహాయం రైతులకు చేరిందని ప్రధానమంత్రి తెలియజేశారు. దశాబ్దాల తరబడి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న మోసాలు ఇప్పుడు లేవనీ, గంగాజలం వంటి స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం భయాల ఆధారంగా భ్రమలు వ్యాప్తి చేసే వారి నిజస్వరూపం దేశం ముందు నిరంతరం బహిర్గతమవుతూనే ఉందని, ఆయన వ్యాఖ్యానించారు. రైతులు వారి అసత్యాలను అర్థం చేసుకున్నప్పుడు, వారు మరొక అంశంపై అసత్యాలను వ్యాప్తి చేయడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా కొన్ని సందేహాలు, ఆందోళనలతో ఉన్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నిరంతరం సమాధానం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు వ్యవసాయ సంస్కరణలపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్న రైతులు భవిష్యత్తులో ఈ వ్యవసాయ సంస్కరణల ప్రయోజనాన్ని కూడా పొందుతారనీ, వారి ఆదాయాన్ని పెంచుకుంటారనీ విశ్వాసం వ్యక్తం చేశారు.