కరోనాతో కుదేలైన భవన నిర్మాణ రంగం... దీనిపై ఆధారపడ్డ లక్షలాది మందికి పనుల్లేకుండాపోయాయి

కరోనా విజృంభణ పరిస్థితులు, మహమ్మారి వ్యాప్తి ఇవి రెండూ దేశవ్యాప్తంగా ప్రజలందర్నీ తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసింది. అందునా మధ్య తరగతి ఉపాధి, ఆదాయ వనరులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ‘సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ (సీఎంఐఈ) తాజా అధ్యయనం తేల్చింది. లాక్‌డౌన్‌ సమయం ఏప్రిల్‌-జూన్‌లో మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ పథకాలేవీ తమకు అమలుకావటం లేదని వారంతా ఆవేదన చెందుతున్నట్టు సీఎంఐఈ నివేదిక పేర్కొంది. 2019లో నెలకు రూ.4వేలు (సంవత్సరాదాయం రూ.48వేలు), అంతకన్నా సంపాదన కలిగినవారిని లాక్‌డౌన్‌ దెబ్బకొట్టింది. నెలకు రూ.6వేలు ఆదాయాన్ని పొందిన వారిలో 99శాతం లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయారు.

గత ఏడాదితో పోల్చితే ఆదాయాలు పడిపోయాయని అన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు సర్వేలో తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని రెండు లక్షలకు పైగా కుటుంబాలపై సర్వే చేసినట్టు సీఎంఐఈ తెలిపింది. ఎగువ మధ్యతరగతి, ధనిక కుటుంబాల ఆదాయాలు కూడా పడిపోయాయని సర్వేలో పేర్కొన్నారు. మొత్తానికి బతుకు చితికింది.. ఆశ సన్నగిల్లింది.. వేలాది మంది జీవన చక్రం కరోనా దెబ్బకు తల్లకిందులైంది.. నూటికి 80 శాతం మందికి నేటికి బతుకు బండి కదలడం లేదు.. ఆదాయం రావడంలేదు.. పేద.. మధ్య తరగతికి మరింత కష్టతరంగా మారింది.. ఎవరిని కదిపినా ఆర్థిక ఇబ్బందులే.. చేద్దామంటే పని లేదు.. పైసా ఆదాయం సంపాదించే దారి లేదు.. వ్యాపారాలకు అవకాశం లేదు.. ఏదో రోజువారి సంపాదనపై ఆధారపడి జీవించే బతుకులన్నీ రోడ్డున పడ్డాయి. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాయి.. దాతల సాయం కోసం అర్రులు చాస్తున్నాయి.

ఇసుక కార్మికులకు కరోనా దెబ్బ తగిలింది.. చేద్దామంటే పనిలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక ర్యాంప్‌లు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఇసుక కార్మి కులు రోజుకు సుమారు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకూ ఆదాయం సంపాదించేవారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఇసుక సరఫరాపై నిషేధం విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల వరకూ పనిలేకుండా పోయింది.. ఆ తరువాత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇసుక సరఫరాతో కార్మికులు కాస్త కుదుటపడ్డారు. ఈ లోపున ఇసుక ర్యాంపుల నిర్వాహకులు ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించారు. బాగానే ఉందనుకునే లోపునే కరోనా రావడంతో కష్టాలు ఆరంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా పనిలేక ఇబ్బందులు పడుతున్నారు.

అయినా నిర్వాహకులు ఎవరినీ పట్టించుకోవడం లేదు. గతంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కనీసం దాతలు ఇచ్చే సాయంతో కడుపు నింపుకునే వారు. కొవ్వూరులో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో దాతలను పోలీసులు బయటకు రానివ్వడంలేదు. దీంతో గత కొద్ది రోజులుగా పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. వలస కార్మికులైతే పనిలేక.. స్వగ్రామాలకు వెళ్లే దారి లేక ఆకలి కేకలు పెడుతున్నారు. దీనిపై పడవ యజమానులను ప్రశ్నిస్తే ఏపీఎస్‌ఎండీసీ అధికారులు గత వేతన బకాయిలు చెల్లించకపోవడంతో ఏం చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఇకనైనా ఏపీఎండీసీ అధికారులు స్పందించి తమ ఆకలి తీర్చాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు, బతుకు బండి మూలనపడింది.

రోజువారి వ్యాపారం కుదేలైంది.. వ్యాపారం లేక పెట్టుబడులు కాస్తా కుటుంబ అవసరాలకు కరిగిపోయాయి. దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుటుంబ గడిచే దారిలేక.. ఏదైనా పనికి వెళదామంటే పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్క విజయవాడ నగరంలోనే సుమారు 3000 మందికి పైగా పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది కార్మికులు ఉంటారు. ప్రస్తుతం వ్యాపారాలు ముందుకు సాగడంలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ ముందు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకూ వ్యాపారాలు సాగేవి. కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ప్రస్తుతం వ్యాపారం సాగకపోవడంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చిపడ్డాయి.

పైసా ఆదాయం లేక రోజువారి ఖర్చులకు అటూ ఇటూ చూస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారుల పరిస్ధితి కూడా దీనంగా ఉంది. గతంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగే వ్యాపారాలు కాస్తా ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, ఇటు రిటైల్‌ వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదు. ఇంకోవైపు, ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక విధంగా లాభం చేజారిపోతోంది. గతంలో ప్రకృతి ప్రకోపం ఉంటే.. ప్రస్తుతం కరోనా వరి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ప్రతీ ఏడాది జిల్లా వ్యాప్తంగా వలస కూలీలు మాసూళ్లు నిర్వహించేవారు. అయితే కరోనా కారణంగా వలస కూలీలు రాకపోవడంతో వరికోత యంత్రాలతోనే కోతలు కోయించుకుంటున్నారు.

వరికోత యంత్రాలకు ప్రభుత్వం గంటకు నిర్ధిష్టమైన ధరను ప్రకటించినా డిమాండ్‌ను బట్టి పెంచేస్తున్నారు. పోనీలే అని కోత కోయించిన తరువాత ధాన్యం ఆరబెట్టడానికి బరకాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏటా గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు తరలివచ్చి బరకాలను అద్దెకు ఇచ్చేవారు. అద్దె చాలా తక్కువగా ఉండడంతో రైతులు కూడా వినియోగించేవారు. ఈ సీజన్‌లో రాకపోకవడంతో బరకాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో గ్రామాల్లో బరకాల అద్దె ధరలు అమాంతంగా పెరిగిపో యాయి. గతంలో ఒక బరకానికి రూ.10 ఉండగా ప్రస్తుతం రోజుకు రూ.30 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఇంత కష్టపడి ధాన్యం అమ్ముదామంటే ధరలు అరకొరగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై కరోనా తీవ్ర ప్రభావం చూపించబోతోందా? కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు జనాన్ని గట్టెకించగలవా? కరోనా నుంచి బయట పడిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి? వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మన్మోహన్ నేతృత్వంలో కమిటీ ఏం చేయబోతోంది? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మన్మోహన్ కమిటీ మార్గదర్శనం చేస్తుందా? రాజకీయ పార్టీల నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి? విపక్షాలకు ఒక అవకాశం దొరికింది. మోదీ ప్రభుత్వంలోని లోపాలను ప్రస్తావిస్తూ ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరచూ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నప్పటికీ సోనియా లేఖలు రాయడం మాత్రం ఆపడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ప్రభుత్వ తీరుపై అప్పుడప్పుడు విరుచుకుపడుతున్నారు. పేద ప్రజల చేతిలో చిల్లిగవ్వ లేక తిండికి అల్లాడిపోతూ ఉంటే మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ మోదీపైన, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పైన విమర్శల వేగం పెంచుతున్నారు. పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధన్యాలు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని చిదంబరం సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై రోజువారీ అంచనా కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కన్సెల్టేటివ్ కమిటీ వేసింది. 11 మంది సభ్యుల కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా ఉంటారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాంరమేష్, కేసీ వేణుగోపాల్ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ప్రతీ రోజు సమావేశమై ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమాలోచనలు చేస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తోంది. భారత కంపెనీలను టేకోవర్ చేసేందుకు అనేక విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించిన వారంలోపే ప్రభుత్వం స్పందించడం తమ విజయంగా కాంగ్రెస్ భావిస్తోంది. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానాల్లో మార్పులు చేసింది. ప్రభుత్వం వేస్తున్న ప్రతీ అడుగును విశ్లేషిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

లాక్‌డౌన్ ప్రకటించక ముందు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను ప్రకటించింది. లక్షా75వేల కోట్లతో ప్రకటించిన మొదటి ప్యాకేజీలో ప్రధానంగా పేద ప్రజలకు నిత్యావసరాలను అందించడం, అత్యవసర వైద్య సదుపాయాలు మెరుగుపరచడం లాంటి చర్యలు చేపట్టారు. తాజా ఉద్దీపన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మెరుగు పరిచేందుకు రూ.50వేల కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నిర్ణయాలు ఎందుకు కొరగావని ఆరోపించింది. జీడీపీలో కనీసం 9 శాతం నిధులను ఉద్దీపన ప్యాకేజీలకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతోంది. అంటే ఏకంగా 17లక్షల50వేల కోట్లు కేటాయించాలన్నది కాంగ్రెస్ డిమాండ్‌గా తెలుస్తోంది. లాక్‌డౌన్ తొలి పక్షం రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి.

చిన్న పరిశ్రమలు అదే దారిలో నడిచాయి. 4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. మరికొంత మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కరోనా విపత్తు తర్వాత రూ.15లక్షల కోట్లు నష్టపోయినట్లు భావిస్తున్నారు. ఇది జీడీపీలో 7 నుంచి 8 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు 50 శాతం వరకు తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జీఎస్టీ 10 శాతం వసూళ్లు కూడా కష్టమవుతుంది. ప్రస్తుతం నిత్యవసరాల విక్రయం ద్వారా మాత్రమే కొంత జీఎస్టీ వస్తోంది. దేశ వృద్ధి రేటు రెండు శాతం కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వస్తు, రవాణా లేక కొనుగోళ్లు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇదంతా ప్రభుత్వం చేతగాని తనమే అని కాంగ్రెస్ అంటోంది.

కరోనా కారణంగా దెబ్బతినే తొట్టతొలి వ్యవస్థ అసంఘటిత రంగమే అని చెప్పాలి. జీడీపీలో 45శాతం ఉన్న ఈ రంగంలోనే 94శాతం మంది ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయం ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చినా మార్కెట్లకు సరుకులు తరలించలేని పరిస్థితి. కరోనా లాక్‌డౌన్‌లోనూ, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా ప్రభుత్వం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించడంలో జాప్యం చేయకూడదు. వచ్చే పంటకాలానికి రైతులకు వడ్డీ రుణాలపై దృష్టి పెట్టాలి. అసంఘటిత రంగంలోకి పరిశ్రమలకు తక్కువ వడ్డీతో పాటు వడ్డీపై మారిటోరియం ఉండే రుణాలు ఇవ్వాలి. అప్పుడే లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.

వేతన బకాయిలు పొందేందుకు వీలు కలుగుతాయి. మధ్య తరగతి వర్గానికి కొత్త సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. అంటే నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోగలగాలి. అలా చేయాలంటే సరుకుల రవాణాకు ఆటంకం లేకుండా చూడాలి. కరోనాకు ముందొచ్చిన ఆర్థిక మాంధ్యం కారణంగా ఆటోమొబైల్ లాంటి రంగాలు దెబ్బతిన్నాయి. ఆ రంగం రూ.15వేల కోట్ల మేర నష్టపోయింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 3లక్షల నుంచి 4లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఆటో రంగం మరింత కుదేలైంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తర్వాత కూడా కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోళ్లు చేసేవారు తక్కువగానే ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే పరిశ్రమ కోలుకునేందుకు ప్రభుత్వ చేయూత కూడా అవసరం అవుతుంది. తయారీ రంగం పూర్తి లాక్‌డౌన్‌లో ఉంది. పరిశ్రమలు తెరిచే అంశం మే 3 తర్వాతే పరిశీలించే వీలుంది. భారీ పరిశ్రమలకు కూడా పెట్టుబడుల సమస్యలు రావొచ్చు.

ఇప్పటికే స్టాక్‌మార్కెట్ సంక్షోభం కారణంగా పారిశ్రామిక వేత్తల సంపద చాలా వరకు ఆవిరైపోయింది. దీంతో ఇప్పుడు బ్యాంకులే వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉద్దీపనలు ప్రకటించగా లాక్‌డౌన్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. దెబ్బతిన్న ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్ఎమ్‌సీజీ పరిశ్రమలను కూడా ఆదుకోవాలి. భారత విమానాయాన రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆశావాహ వాతావరణం నెలకొన్న తరుణంలోనే కోవిడ్ 19 కారణంగా విమానాలను హ్యాంగర్లకు పరిమితం చేయాల్సి వస్తోంది. అనేక ప్రైవేటు విమానాయ సంస్థలు ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ప్రకటించాయి. మే 3 తర్వాత కూడా వెంటనే విమాన రాకపోకలకు అనుమతించకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

జూన్ నాటికి పరిస్థితులు చక్కబెట్టగలిగితే ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేక ఉద్దీపనలు అవసరం. నష్టాల భారిన పడకుండా ఉద్యోగులను మళ్లీ తీసుకోవాలంటే ఎయిర్‌లైన్స్‌ను ఆర్థికంగా ఆదుకోకతప్పదు. ఇక, పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. లాక్‌డౌన్ సమయంలో భారత పర్యాటక రంగానికి రూ.35వేల కోట్ల నష్టం వాటిల్లుంటుందని అంచనా. హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్ కూడా దెబ్బతిన్నది. అక్కడ పనిచేసే దినసరి కార్మికులు రోడ్డున పడ్డారు. రెస్టారెంట్లు, పర్యాటకం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున వాటిని ఆదుకోక తప్పదు. అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి కూడా విదేశీ మారకద్రవ్యం అందుతుంది. ఏ దేశంతోనైనా ద్వైపాక్షిక వాణిజ్యం పెంపొందించుకునే వీలుంటుంది.