వర్ధిల్లుతున్న వానపాముల అక్రమ రవాణ!

2984
  • భారీగా సాగుతున్నా పట్టించుకోని యంత్రాంగం

  • పులికాట్ సరస్సు సమీపంలోనే వర్ధిల్లుతున్న వ్యాపారం

నెల్లూరు, అక్టోబర్ 24 (న్యూస్‌టైమ్): వానపాముల అక్రమ వ్యాపారానికి, రవాణాకూ నెల్లూరు జిల్లా కేంద్రంగా నిలుస్తోంది. నిబంధనలకు విరుద్దమని తెలిసినా వ్యాపారులు పెద్ద ఎత్తున వానపాముల తరలింపునకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పులికాట్ సరస్సు పరిసరాల్లోనే సాగుతున్న ఈ అక్రమ దందాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం పెద్దగా చొరవ చూపిస్తున్న దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో వానపాముల అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

సీజన్ వచ్చిందంటే నానాటికీ ఈ దందా పెరిగిపోతుండటం స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ వస్తోంది. తడ మండలంలోని వేనాడు, ఇరకం, భీమునివారిపాలెం, వాటంబేడు, కారిజాత గ్రామాలు, సూళ్లూరుపేట మండలంలోని అట కానీ తిప్ప, పేరునాడు, కుదిరి, తిప్ప ఖండ్రిక తదితర గ్రామాలకు సమీపాన గల పులికాట్ సరస్సులో ప్రతిరోజు రాత్రులందు వానపాములును అక్రమంగా గోతులు తవ్వి తీస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇలా ఇక్కడ పులికాట్ సరస్సు సమీపంలో సేకరించిన వానపాములను ప్యాకింగ్ చేసుకొని విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల సహా తెలుంగాణలోని కొన్ని ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఒడిశా, మధ్యప్రదేశ్ వరకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వానపాములను సేకరించడం కానీ, అక్రమ రవాణా చేయడం గానీ నిషేథం. కానీ, ఆ విషయాన్ని అక్రమార్కులు కనీసం పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. గత ఏడాది అనేకసార్లు లింగంపాడు స్వర్ణ టోల్‌గేట్ వద్ద కారులో అక్రమంగా వానపాములును తరలిస్తుండగా కాపుకాచి ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు.

ఆ తరువాత వీటి గురించి పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో స్పందించిన అధికారులు ఇప్పుడెందుకు చోద్యం చూస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. కార్లు, బస్సులు, రైళ్ల ద్వారా కూడా ఈ అక్రమ రవాణా జరుగుతుండడం గమనార్హం. ఈ వానపాములు కిలోధర 1800 రూపాయల నుంచి నుంచి 2 వేల 600 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. అధికంగా ఈ అక్రమ వ్యాపారం చేసే వారంతా యువకులే కావడం విశేషం.

గతంలో ఈ అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులు, విద్యావంతులు ఉండడం శోచనీయం. ఈ వానపాములను అధికంగా రొయ్యలకు ఆహారంగా, సేంద్రీయ ఎరువుల తయారీతో పాటు కొన్ని ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇకమీదట అయినా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పులికాట్ తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.