కరోనా తగ్గాలని హోమం!

173
అర్చకులతో కలిసి హోమాన్ని నిర్వహిస్తున్న ఇప్పిలి శంకరశర్మ

శ్రీకాకుళం, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): సర్వజన సుభిక్షం కోసం అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన ప్రాంగణంలోని అనివెట్టి మండపంలో ఏర్పాటుచేసిన ‘వైనతేయ’ హోమం ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది.

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శంకర శర్మ మాట్లాడుతూ ఈ ప్రత్యేక పూజలు చేయడం వలన ఆపదుద్ధారణ విష జ్వరాది ప్రాణాంతక రోగ నిర్మూలన తద్వారా ప్రాణులకు స్వస్థత చేకూరుతుందన్నారు. ఈ వైనతేయ హోమం (గారుడ) (ఇష్ట)హావనం వేద వేదాంగ వేత్తలచే, పండిత ప్రకాండల నడుమ జరిగిందని తెలిపారు.

నేడు కరోనా మహమ్మారి ప్రబలకుండా దేశం సుభిక్షంగా ఉండాలని, వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక హోమాలను అరసవల్లి సూర్య క్షేత్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఈ మహమ్మారిని ప్రబలకుండా చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని వారు పేర్కొన్నారు.

సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి. హరిసూర్య ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మధ్య దూరాన్ని పాటిస్తూ ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నామని చెప్పారు. అలాగే నిబంధనల దృష్ట్యా భక్తులు ఎవరిని ఈ హోమ పూజలకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. భక్తులు ఈ ప్రత్యేక పూజలను టీవీల ద్వారా చూసి తరించాలని ఆయన కోరారు.